అధికారులకు ఇచ్చిన అర్జీలు, ఇతర పత్రాలను చూపుతున్న శంకరయ్య
సాక్షి, కడప : ఏళ్ల తరబడి ఓ పెద్దాయన కొడుకు ఉద్యోగం కోసం పోరాటం చేస్తున్నాడు. ఒక నెల కాదు...మూడు నెలలు కాదు..దాదాపు 22 ఏళ్లుగా ఉద్యోగం కోసం తిరగని కార్యాలయం లేదు...కలవని అధికారి లేడు. నిరంతరం తిరుగుతున్నా ఉద్యోగం మాత్రం అందని ద్రాక్షలా మారింది.
ఎన్నో ఏళ్లుగా తప్పని నిరీక్షణ
ప్రాజెక్టు విషయంలో సహకరించిన ప్రజలను ఎప్పటికీ మరిచిపోకూడదు. పది మందికి నీళ్లందించే రిజర్వాయర్ నిర్మాణానికి ఇళ్లను....భూములను వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధమైన వారి త్యాగాలను ఎప్పటికీ గుర్తు పెట్టుకోవాలని అప్పట్లో ప్రభుత్వం నష్టపోయిన బాధితులకు పరిహారంతోపాటు ఉద్యోగం ఇచ్చేలా నిర్ణయించింది. అంతేకాకుండా జీఓలను కూడా జారీ చేశారు. ఇల్లు, భూములు కోల్పోయిన అనేక మందికి ఉద్యోగాలిచ్చారు. ఏం జరిగిందో ఏమో తెలియదుగానీ బ్రహ్మంగారిమఠం మండలం ఓబులరాజుపల్లెకు చెందిన మేకల శంకరయ్య కుటుంబానికి మాత్రం ఇప్పటి వరకు ఉద్యోగం రాలేదు. శంకరయ్యకు చెందిన పది సెంట్ల స్థలంలో ఉన్న ఇల్లు తెలుగుగంగ ప్రాజెక్టులో ముంపునకు గురైంది. 1995 ప్రాంతంలో నివాస ప్రాంతాన్ని వదిలిపెట్టి శంకరయ్య కుటుంబం బయటికి వచ్చిం ది. కుమారుడికి ఉద్యోగం వస్తుందని ఆశించినా ఇప్పటివరకు నెరవేరలేదు.
అనేక మందికి అవకాశాలు కల్పించినా....
బ్రహ్మంసాగర్ ప్రాజెక్టు పరిధిలో ఓబులరాజులపల్లెతోపాటు మరికొన్ని గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం మేరకు అనేక మందికి పరిహారంతోపాటు ఉద్యోగాలు కల్పించారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంతోపాటు తర్వాత దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో కూడా అనేక మందికి పోస్టింగ్‌లు ఇచ్చారు. అయితే శంకరయ్యకు సీరియల్ నెంబరు 518 ఇచ్చారు. అయితే నెంబరుకు అటు, ఇటు సీరియల్ నెంబర్ల వారికి కూడా ఉద్యోగాలు వచ్చాయని... తమకు మాత్రమే ఇవ్వలేదని శంకరయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. గతంలో కూడా తెలుగుగంగ కార్యాలయంలోని కొంతమంది నగదు మొత్తాలను అడిగారని, ఇవ్వకపోవడంతోనే ఉద్యోగం విషయంలో లిస్టులో పెట్టకుండా పక్కదారి పట్టిస్తూ తమ కుటుంబంతో ఆడుకుంటున్నారని శంకరయ్య ఆరోపిస్తున్నారు.
22 ఏళ్లుగా న్యాయ పోరాటం
బి.మఠం మండలం ఓబులరాజుపల్లెకు చెందిన శంకరయ్య 22 ఏళ్లుగా పోరాటం చేస్తున్నాడు. 1990–95 మధ్య ప్రాజెక్టులోకి ఇల్లు కోల్పోవడంతో తర్వాత కాలం నుంచి ఉద్యోగం కోసం తిప్పలు పడుతున్నాడు. ప్రతిసారి కలెక్టరేట్‌కు రావడం...జిల్లా కలెక్టర్‌కు అర్జీ సమర్పించడం జరుగుతోంది. అంతేతప్ప రైతుకు ఎందుకు ఉద్యోగం కల్పించలేదో చెప్పలేదు. కలెక్టరేట్‌తోపాటు జీఎన్‌ఎస్‌ఎస్ అధికారులను శంకరయ్య కలుస్తూ వస్తున్నారు. అయితే తెలుగుగంగ కార్యాలయ పరి««ధిలోని అధికారులు కూడా ఉద్యోగ విషయంలో ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. ఇప్పటికే మీ కోసంలో సుమారు 75 నుంచి 100 వినతిపత్రాలు సమర్పించారు. ఇంతవరకు అధికారులు ఉద్యోగం మాత్రం కల్పించలేదని పేర్కొంటున్నారు. శంకరయ్య కుమారుడు విశ్వనాథ్ కూడా డిగ్రీ వరకు చదువుకున్నాడు. ఏదిఏమైనా శంకరయ్య కుటుంబానికి ఎప్పుడు న్యాయం జరుగుతుందో వేచి చూడాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment