తెలుగుగంగ ప్రాజెక్టు, కార్యాలయం
సాక్షి, నెల్లూరు : నెల్లూరులోని తెలుగుగంగ ప్రాజెక్టు సర్కిల్‌లోని ఇంజినీరింగ్ విభాగంలో బదిలీల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయి. నిబంధనలు మేర పారదర్శకంగా జరగాల్సిన బదిలీలను ఆ శాఖ ఉన్నతాధికారి ఇష్టానుసారంగా చేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐదేళ్లపాటు విధులు నిర్వహిస్తున్న వారిని తప్పక బదిలీ చేయాలని ప్రభుత్వ ఉత్తర్వులున్నా పట్టించుకోలేదు. ఆ శాఖలో దీర్ఘకాలంగా తిష్టవేసి, ఉన్నతాధికారి కనుసన్నల్లో మెలిగిన వారిని మాత్రం బయట ప్రాంతాలకు పంపించకుండా లోకల్‌గా బదిలీ చేసి నిబంధనలను తుంగలో తొక్కారు. బదిలీల్లో జరిగిన అక్రమాలపై ఆ శాఖ ఉద్యోగులు ఉన్నతా««ధికారిపై తిరుగుబాటు చేశారు.
ఏం జరిగిందంటే..
తెలుగుగంగ ప్రాజెక్టు ఇంజినీరింగ్ విభాగంలో బదిలీల ప్రక్రియ గందరగోళంగా మారింది. ఉద్యోగుల బదిలీల విషయమై ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు రూపొందించి పారదర్శకత పాటించాలని ఆదేశాలు జారీచేసింది. ఒకేచోట ఐదేళ్లపాటు విధులు నిర్వహిస్తున్న వారిని బదిలీ చేయాలి. మెడికల్ గ్రౌండ్, రిక్వెస్ట్ ట్రాన్స్‌ఫర్లు కూడా పరిగణలోకి తీసుకోవాలి. కానీ తెలుగుగంగ ప్రాజెక్టు సర్కిల్‌లో జరిగిన బదిలీల్లో ప్రభుత్వ ఉత్తర్వులను పరిగణలోకి తీసుకోలేదని, ఎస్‌ఈ వెంకటేశ్వర్లు ఇష్టానుసారంగా చేపట్టారని స్థానిక ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఎస్‌ఈకు అనుకూలమైన వారికి లోకల్ పోస్టింగ్‌లు ఇచ్చారని చెబుతున్నారు. ఒకేచోట ఆరేళ్లపాటు పనిచేస్తున్నా వారిని బదిలీలు చేయలేదని ఆరోపిస్తున్నారు. అక్రమాల నేపథ్యంలో ఉద్యోగులు ఉన్నతాధికారి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
అక్రమాలిలా..
► నెల్లూరు సర్కిల్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్ నుంచి సూపరింటెండెంట్ వరకు సుమారు 30 ఏళ్లుగా వి«ధులు నిర్వహిస్తున్న ఎంవీ రమణకుమార్‌ను బదిలీ చేయలేదు. అలాగే డివిజన్ 1, 3ల్లో పనిచేస్తున్న పి.శ్రీనివాసులురెడ్డి, పి.రామయ్యలను నిబంధలకు విరుద్ధంగా లోకల్‌గా బదిలీ చేశారన్న ఆరోపణలున్నాయి. డివిజన్–4లో ఆరేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్న వైవీవీ సత్యనారాయణకు బదిలీ జరగలేదు.
► సీనియర్ అసిస్టెంట్ క్యాడర్‌లో నెల్లూరు సర్కిల్ పరిధిలో డివిజన్–2లో పనిచేస్తున్న కమలను నిబంధలకు విరుద్ధంగా గూడూరు డివిజన్‌కు బదిలీ చేశారు. కండలేరు సబ్‌డివిజన్‌లో పనిచేస్తున్న రత్నయ్యకు ఐదేళ్లు పూర్తయినా కూడా బదిలీ జరగలేదు. టెక్నికల్ ఆఫీసర్స్ విభాగంలో ఒకేచోట 20 ఏళ్లుగా పనిచేస్తున్న అధికారులను లోకల్‌గా బదిలీ చేశారన్న ఆరోపణలున్నాయి. రిక్వెస్ట్, మెడికల్ గ్రౌండ్ పరిగణలోకి తీసుకోకుండా ఎస్‌ఈ ఇష్టానుసారంగా బదిలీలు చేశారన్న ఆరోపణలున్నాయి. అసిస్టెంట్ టెక్నికల్ విభాగంలో 11 ఏళ్లపాటు ఒకే ప్రాంతంలో పనిచేస్తున్న వారిని నిబంధనలకు విరుద్ధంగా స్థానిక బదిలీ చేసినట్లు ఆరోపణలున్నాయి. గూడూరు డివిజన్‌లో పనిచేస్తున్న మునిరెడ్డి రిక్వెస్ట్ బదిలీ పెట్టుకున్నా పరిగణలోకి తీసుకోలేదని తెలిసింది.
► సబార్డినేట్ విభాగంలో కూడా ఇదే పరిస్థితి ఉన్నట్లు ఆరోపణలున్నాయి. నెల్లూరు సర్కిల్‌లో పనిచేస్తున్న టి.గంగిరెడ్డి గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్న నేపథ్యంలో మెడికల్ గ్రౌండ్‌లో బదిలీ చేయకూడదనే నిబంధన ఉన్నా గూడూరు డివిజన్‌కు బదిలీ చేశారు. అలాగే నెల్లూరు డివిజన్–2లో పనిచేస్తున్న బి.నాగమణి తల్లికి క్యాన్సర్ ఉంది. ఆమె బదిలీ వద్దని చెప్పినా డివిజన్–3 పరిధిలోని ఆదూరుపల్లికి బదిలీ చేశారు.
బదిలీలు సక్రమంగానే జరిగాయి
తెలుగుగంగ సర్కిల్ పరిధిలో బదిలీలు సక్రమంగా జరిగాయి. ఏవైనా పొరపాట్లు ఉంటే సరిచేస్తాం. కొందరు ఉద్యోగులు మాపై దుష్ప్రచారం చేస్తున్నారు.
– ఎం.వెంకటేశ్వర్లు, తెలుగుగంగ ప్రాజెక్టు ఎస్‌ఈ, నెల్లూరు సర్కిల్
Comments
Please login to add a commentAdd a comment