నాడు వెలవెల.. నేడు జలకళ | Telugu Ganga Project Special Story In YSR Kadapa District | Sakshi
Sakshi News home page

నాడు వెలవెల.. నేడు జలకళ

Published Tue, Dec 10 2019 8:24 AM | Last Updated on Tue, Dec 10 2019 8:24 AM

Telugu Ganga Project Special Story In YSR Kadapa District - Sakshi

జలకళను సంతరించుకున్న రామసముద్రం చెరువు 

సాక్షి, కడప:  వరుణుడు కరుణించడంతో ఈ ఏడాది దిగువ సగిలేరు ప్రాజెక్టుకు తెలుగుగంగ ప్రాజెక్టు నుంచి నీటిని వదిలారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు దిగువ సగిలేరు కింద ఉన్న చెరువుల్లో జలకశ ఉట్టిపడుతోంది. కుడి, ఎడమ కాలువలకు సంబంధించి 36 గొలుసు చెరువులు ఉండగా ఇప్పటికే 20 చెరువులకు నీటిని వదిలారు. ఈ నీటిని వదిలేందుకు ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్యలతోపాటు అధికారులు తీవ్ర ప్రయత్నం చేయడం వల్లనే సాధ్యమైంది. దీంతోపాటు రైతుల సహకారం కూడా ఉంది.   

  • గత ప్రభుత్వ హయాంలో దిగువ సగిలేరుకు ఉన్న రెండవ గేటు కొట్టుకునిపోవడంతో వృథాగా నీళ్లు సముద్రం పాలైంది. అంతకుముందు కూడా ఈ స్థాయిలో చెరువులను నింపిన దాఖలాలు లేవు. అప్పట్లో మంజూరైన జైకా నిధులను నిర్మాణాత్మక పనులకు ఉపయోగించకుండా అనవసరమైన పనులకు వినియోగించి అక్రమాలకు ఒడిగట్టినట్లు ఆరోపణలు మిన్నంటాయి.  
  • ఈ ఏడాది వర్షాలు బాగా పడడంతో తెలుగుగంగ నుంచి దిగువ సగిలేరుకు రోజుకు 700 క్యూసెక్కుల దాక నీరు చేరడంతో కుడి, ఎడమ కాలువలకు సంబంధించిన చెరువులకు నీటిని తరలిస్తున్నారు. త్వరలో  మిగిలిన చెరువులతో పాటు బద్వేలు చెరువును కూడా నీటితో నింపేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.   

గత ప్రభుత్వంలో అక్రమాలు... 
బద్వేలు నియోజకవర్గంలోని బి.కోడూరు మండల పరిధిలో వడ్డెమాను చిదానందం దిగువ సగిలేరు జలాశయం ఉంది. గతంలో తెలుగుగంగ నుంచి బొక్కినేరు ద్వారా దీనికి నీటిని వదిలారు. కుడి, ఎడమ కాలువలు ఉండగా, వీటి కింద 36 గొలుసు కట్టు చెరువులు ఉన్నాయి. దాదాపు 16 వేల  ఎకరాల ఆయకట్టు ఉంది.  బ్రహ్మంగారిమఠం, బద్వేలు, అట్లూరు, గోపవరం మండలాలకు చెందిన రైతులు ఈ జలాశయంపై ఆధారపడి పంటలు పండించుకుంటున్నారు. ఈ జలాశయానికి నింపిన 0.115 ఎంసీఎఫ్‌టీ నీరు దాదాపు ఐదు వేల ఎకరాల్లో పంటలు సాగయ్యే పరిస్థితి ఉంటుంది. కానీ రెండవ గేటు కొట్టుకుపోయిన కారణంగా సాగు, తాగునీటి అవసరాలు తీరకుండా పోయాయి. సక్రమంగా నీటిని అందిస్తే ఈ గొలుసు చెరువుల ద్వారా రూ. 40 కోట్ల వ్యవసాయ ఉత్పత్తులు అందే పరిస్థితి ఉంటుంది.  ఇదిలా ఉండగా గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం  వల్ల రెండవ గేటు కొట్టుకుపోవడంతో ఉన్న నీరంతా సోమశిలకు చేరింది.

గత ప్రభుత్వంలో రెండవ గేటు కొట్టుకుపోయి వృథాగా పోయిన నీరు (ఫైల్‌)  

జైకా నిధుల్లో ఇష్టారాజ్యం.. 
ఇదే జలాశయానికి సంబంధించి గతంలో జైకా (జపాన్‌ ఎయిడెడ్‌ క్రెడిట్‌ అసోసియేషన్‌) కింద రూ. 19 కోట్లు వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు కేటాయించారు. తొలుత కొత్త గేట్లు మార్చాలన్న అభిప్రాయానికి వచ్చిన తర్వాత అధికారులు మళ్లీ నిర్ణయాన్ని మార్చుకున్నారు. నిర్మాణాత్మక పనులు చేపట్టకుండా కట్టపైకి మట్టి తరలింపు, రాతి కట్టడం, ఇతరత్రా పనులు చేసి అక్రమార్జనకు తెర లేపారన్న ఆరోపణలు వచ్చాయి. ఇదంతా ఓ ఉన్నతాధికారి బినామి కాంట్రాక్టర్‌ను పెట్టుకుని అంతా తానై పనులు చేసినట్లు ఆరోపణలు వినవచ్చాయి. గేటు కొట్టుకునిపోయిన తర్వాత విచారణ కమిటీ పేరిట విచారణ జరిపారే గానీ ఆ తర్వాత చర్యలు  ఏమాత్రం లేవు. అంతేకాకుండా ప్రైజ్‌ ఎక్స్‌లేషన్‌ (అంచనా వ్యయం  పెంచడం) ద్వారా రూ.2.5 కోట్ల అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. అంటే పనులు పూర్తయిన తర్వాత మళ్లీ ప్రభుత్వానికి సిమెంటు, కడ్డీల ధరలు పెరిగాయని నివేదికలు పంపి అదనంగా నిధులు మంజూరు చేయించుకోవడం. ఇది అధికారులు చొరవ చూపితేనే సాధ్యమవుతుంది. దీంతో అప్పట్లో ఉన్న కలెక్టర్‌ సీరియస్‌ అయినట్లు వార్తలు వచ్చాయి. నీటిని వదిలిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే.. తెలుగుగంగ ఎస్‌ఈ శారదను తెలుగుగంగ నుండి దిగువ సగిలేరు జలాశయానికి కనీసం రెండు టీఎంసీల నీటిని అందజేయాలని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ఇటీవల విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు ఈ జలాశయానికి నీటిని వదిలేందుకు సానుకూలంగా ఆమె స్పందించారు. ప్రస్తుతం ఒక టీఎంసీ నీటిని ఈ జలాశయానికి అందించేందుకు సిద్దపడ్డారు. ఇటీవల తెలుగుగంగ నుండి బొక్కిలేరు వాటర్‌ ట్యాంకుకు ఎమ్మెల్సీ డీసీ  గోవిందరెడ్డితోపాటు ఎస్‌ఈ శారద, నీటిపారుదలశాఖ ఈఈ వెంకట్రామయ్య తదితర అధికారులు పూజలు నిర్వహించి నీటిని విడుదల చేశారు. రామసముద్రం వాటర్‌ ట్యాంకు వద్దకూడా ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య అధికారులతో కలిసి పూజలు నిర్వహించి నీటిని వదిలారు. తెలుగుగంగ నుంచి వీలైనంత మేర రెండు టీఎంసీల నీటిని ఈ జలాశయానికి అందిస్తే 36 గొలుసు చెరువులను నింపి ఆయకట్టుకు నీరిచ్చే పరిస్థితి ఉండేలా చూడాలని మరోసారి సూచించారు. ఈ ఏడాది చెరువుల్లో జలకళ ఉండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement