తాగునీటి కోసం ధర్నా చేస్తున్న మహిళలు (ఫైల్)
సాక్షి, పుత్తూరు: పుత్తూరు జనాభా ఏటా పెరుగుతోంది. తాగునీటి అవసరాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని 2008లో పుత్తూరులో సమ్మర్‌స్టోరేజ్ ట్యాంకు నిర్మాణానికి అప్పటి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. మున్సిపాలిటీ పరిధిలో చిన్నరాజుకుప్పం మీదుగా వెళుతున్న గాలేరు నగరి కాలువ నుంచి నీటిని తరలించే విధంగా పుత్తూరు చెరువునే సమ్మర్‌స్టోరేజ్ ట్యాంకుగా నిర్మించేశారు. దీనిపై అప్పట్లో అభ్యంతరాలు వ్యక్తమయినప్పటికీ రాజకీయ ఒత్తిడితో పనులు పూర్తి చేశారు. గాలేరు నగరి పూర్తికాకపోవడంతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నిరుపయోగంగా మారిపోయింది.
తెరపైకి తెలుగుగంగ ప్రాజెక్ట్
రోజురోజుకూ పట్టణంలో తాగునీటి కష్టాలు తీవ్రతరం అవుతుండడం, గాలేరు నగరి ప్రాజెక్టు పూర్తయ్యే పరిస్థితి లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలపై అన్వేషణ ప్రారంభమైంది. ఈ సమయంలో ఏషియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకు మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల కల్పనకు రుణం మంజూరు చేసేందుకు ముందుకు వచ్చింది. పుత్తూరు మున్సిపాలిటీకి తాగునీటి అవసరాల కోసం తెలుగుగంగ నుంచి పైపులైన్ ప్రాజెక్ట్ ద్వారా నీటి సరఫరాకు గత ఏడాది రూ.137 కోట్లు రుణం మంజూరు చేసింది.
శ్రీకాళహస్తి నుంచి పైపులైన్
శ్రీకాళహస్తి మండల పరిధిలోని లక్ష్మీపురం నుంచి (తెలుగు గంగ ప్రాజెక్ట్ 91వ కిలోమీటరు) పైపులైన్ ప్రాజెక్ట్ ప్రారంభం కానుంది. లక్ష్మీపురం వద్ద ఒక సంపు, కేవీబీ పురం వద్ద మరొక సంపు నిర్మించనున్నారు. 58 కిలోమీటర్ల పైపులైన్ పుత్తూరు సమ్మర్‌స్టోరేజ్‌కు నీటిని తరలించనుంది. అక్కడి నుంచి మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి ఇంటికీ కొళాయి ఏర్పాటు చేసి, నీరు సరఫరా చేయనున్నారు. కేవలం సంవత్సరం వ్యవధిలో పైపులైన్ ప్రాజెక్ట్ పూర్తికానుంది. ఈ మేరకు ప్రజారోగ్యశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 2020 సెప్టెంబర్ నాటికి ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. టెండర్ దక్కించుకున్న ఎన్‌సీసీ కంపెనీ రెండు నెలల్లో పనులు ప్రారంభించనున్నట్లు సమాచారం.
శుభపరిణామం
పుత్తూరుకు తాగునీటి అవసరాల కోసం రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ 1.3 టీఎంసీల నీటిని కేటాయించడం శుభపరిణామం. పట్టణ వాసుల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. నా విజ్ఞప్తిని మన్నించి తెలుగు గంగ నుంచి పైపులైన్ ప్రాజెక్ట్ పనులను ప్రారంభించేందుకు అధికారులు చర్యలు తీసుకోవడం సంతోషంగా ఉంది. ప్రాజెక్ట్‌ను వేగవంతంగా పూర్తి చేయిస్తాను. పుత్తూరుకు నీటి కేటాయింపు ఫైల్‌పై తొలి సంతకం చేసిన రాష్ట్ర మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌కు నా కృతజ్ఞతలు.
– ఆర్‌కే రోజా, ఎమ్మెల్యే, నగరి
Comments
Please login to add a commentAdd a comment