కుంగిన పుత్తూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్ట
పుత్తూరు రూరల్ (చిత్తూరు జిల్లా): అడుగడుగునా అవినీతి మేటలు నింపి నిర్మించిన పుత్తూరు సమ్మర్ స్టోరేజ్ (ఎస్‌ఎస్) ట్యాంక్ గట్టు మంగళవారం కుంగిపోయింది. రూ.55 కోట్ల వ్యయంతో మాజీ ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమ నాయుడు కుమారుడు గాలి భానుప్రకాష్ బినామీ కంపెనీ పేరుతో దీని నిర్మాణం చేపట్టారు. నాలుగేళ్లపాటు జరిగిన ఈ పనుల్లో నాణ్యత ఏమాత్రం లేదని అప్పట్లోనే పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. నీరు నింపి ఏడాది కాకుండానే ట్యాంక్ గట్టు 10 అడుగుల లోతున, దాదాపు 200 మీటర్ల పొడవున కుంగిపోయింది. గండి పడితే పుత్తూరులోని భవానీ నగర్, ఈశ్వరాపురం ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. ట్యాంకు నిర్మాణం నాసిరకంగా జరుగుతోందని, పనుల్లో అవినీతి రాజ్యమేలుతోందని నిర్మాణ సమయంలో ఆరోపణలు వెల్లువెత్తినా పట్టించుకోలేదని.. దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నామని పుత్తూరు వాసులు అంటున్నారు.
కాసుల కక్కుర్తితో..
2006లో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సహకారంతో అప్పటి పుత్తూరు ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమ నాయుడు పుత్తూరు చెరువును సమ్మర్ స్టోరేజీ ట్యాంకుగా మార్పు చేయించారు. నియోజకవర్గానికి రూ.55 కోట్లతో మంజూరైన అతి పెద్ద కాంట్రాక్ట్ కావడంతో తన కుమారుడు గాలి భానుప్రకాష్‌కు ఆ పనులు అప్పగించారు. జయ్‌గణేష్ అండ్ కన్‌స్ట్రక్షన్‌కు చెందిన గురు అనే బినామీ పేరిట గాలి భానుప్రకాష్ ఈ పనులు చేయించారు. నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు ఏమాత్రం పాటించడం లేదంటూ అప్పట్లోనే పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. వాటిని పెడచెవిన పెట్టిన ముద్దుకృష్ణమ నాయుడు 2010 నాటికి పని పూర్తయ్యిందనిపించారు. 2009 ఎన్నికల నాటికే టీడీపీలో చేరిన ఆయన నగరి ఎమ్మెల్యేగా గెలుపొందినా.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఏర్పడటంతో ట్యాంక్‌ను అధికారికంగా ప్రారంభించలేదు.
ఏళ్ల తరబడి నిరుపయోగంగా..
ట్యాంక్ నిర్మాణం పూర్తయి 11 ఏళ్లు పూర్తవగా.. పదేళ్లుగా ట్యాంకులోకి చుక్కనీరు కూడా చేరలేదు. ఎమ్మెల్యే ఆర్కే రోజా చొరవతో గతేడాది నుంచి వృథాగా పోతున్న పుత్తూరు చెరువు నీటిని ట్యాంక్‌లోకి పంపింగ్ చేస్తున్నారు. ఇటీవల వర్షాలు విస్తారంగా కురవడంతో ట్యాంక్‌లోకి సుమారు 60 శాతం నీరు చేరింది. ఈ నేప«థ్యంలో ట్యాంక్ కట్ట లోపలే పగుళ్లు వచ్చి కుంగిపోయిందని అధికారులు చెబుతున్నారు.
కాంట్రాక్టర్‌పై చర్యలు చేపట్టండి: ఎమ్మెల్యే ఆర్కే రోజా
రూ.కోట్లను దోచేసి అరకొర పనులతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మించిన జయ్‌గణేష్ అండ్ కన్‌స్ట్రక్షన్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి, తగిన చర్యలు చేపట్టాలని ఏపీఐఐసీ చైర్‌పర్సన్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా చిత్తూరు కలెక్టర్ హరినారాయణ్‌ను కోరారు. పుత్తూరు ఎస్‌ఎస్ ట్యాంకు కుంగిపోయిన వైనాన్ని, పొంచి ఉన్న ప్రమాద విషయాలను కలెక్టర్‌కు ఆమె ఫోన్ ద్వారా వివరించారు. అస్తవ్యస్తంగా, అవినీతిమయంగా నిర్మించిన సదరు కాంట్రాక్టర్ ద్వారానే కట్టను పునరుద్ధరించాలని కోరారు. అప్పటి క్వాలిటీ కంట్రోల్ అధికారులపైనా చర్యలు చేపట్టాలని కోరారు. ప్రమాదం జరగకుండా తక్షణ ఏర్పాట్లు చేయాలని కోరారు.
ట్యాంక్‌ను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి
కుంగిపోయిన ఎస్‌ఎస్ ట్యాంక్‌ను ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి మంగళవారం పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వందేళ్ల కిత్రం నిర్మించిన పిచ్చాటూరు ట్యాంకు నేటికీ చెక్కు చెదరలేదని, పదేళ్ల క్రితం నిర్మించిన కట్ట కుంగిపోవడం అవినీతిని బట్టబయలు చేస్తోందని అన్నారు. ప్రమాదం జరిగితే దిగువ గ్రామాలు దెబ్బతింటాయని, వెంటనే తగిన చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఎస్‌ఎస్ ట్యాంకును కలెక్టర్ హరినారాయణన్ పరిశీలించి వెంటనే మరమ్మతు పనులను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. పుత్తూరు, ఈశ్వరాపురం గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయమని ఇరిగేషన్, పబ్లిక్ హెల్త్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment