సాక్షి ప్రతినిధి, కడప: ‘సత్రం కూటికి అయ్యంగార్ సిఫార్సులు’ అన్నట్లుగా అధికార తెలుగుదేశం పార్టీ నేతల వైఖరి ప్రస్ఫుటం అవుతోంది. రైతన్నల పంటలు కళ్లెదుటే పాడైపోతున్నా పచ్చ నాయకుల కనుసైగలకే ప్రాధాన్యం ఇవ్వడంలో తెలుగుగంగ ప్రాజెక్టు (టీజీపీ) యంత్రాంగం నిమగ్నమైంది. కోడిగుడ్డుపై ఈకలు పీకే చందంగా కుంటిసాకులు వెతుక్కుంటున్నారు. ఫలితంగా 4వేల ఎకరాల ఆయకట్టుదారులకు తీరని నష్టం వాటిల్లుతోంది. సబ్సిడరీ రిజర్వాయర్-2 కింద పప్పనపల్లె, మిట్టమానుపల్లె, ఆదిరెడ్డిపల్లె, ఎర్రబల్లె, వనిపెంట, జీవీసత్రం పంచాయితీల పరిధిలో వేరుశనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు, టమోటా సాగుచేశారు. ఇప్పటికీ నెలరోజుల పైరు అయింది. నీరు విడుదల చేయాల్సిన యంత్రాంగం అధికార ఒత్తిడిలో నలుగుతోంది.
అధికారపార్టీ కనుసైగలతోనే....
ఎస్‌ఆర్-2 పరిధిలో రైతుల దుస్థితిని మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి నవంబర్‌లో టీజీపీ సీఈ దృష్టికి తీసుకెళ్లారు. పంటలు ఏపుగా ఉన్నా సకాలంలో నీరు లభ్యం కావడంలేదని రైతుల అభ్యర్థనను పరిగణలోకి తీసుకోవాలని తెలుగుగంగ సీఈ, ఎస్‌ఈ లకు వివరించారు. అందుకు సమ్మతించిన అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకుడు పుట్టా సుధాకర్‌యాదవ్ చేతుల మీదుగా నీరు విడుదల చేయించారు. ప్రజాప్రతినిధుల్ని విస్మరించి, ప్రోటోకాల్ ఉల్లంఘించడంపై ఎమ్మెల్యే రఘురామిరెడ్డి యంత్రాంగాన్ని ప్రశ్నించారు. దీంతో ‘అత్తమీద కోపం దుత్తమీద’ చూపించినట్లుగా నీటి విడుదలను నిలిపేశారు. అధికారపార్టీ నేతలు కనుసైగలే అందుకు కారణంగా తెలుస్తోంది. పంటలు ఎండుతున్న నేపధ్యంలో నీరు విడుదల కాాకపోవడంపై ఎమ్మెల్యే రఘురామిరెడ్డి తనయుడు నాగిరెడ్డి గతవారం ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. డిసెంబర్ 1లోపు తప్పకుండా నీరు విడుదల చేస్తామని యంత్రాంగం తెలిపింది. అయితే ఎస్‌ఆర్-2 నుంచి నీరు విడుదల చేస్తే తామే విడుదల చేయాలి, లేదంటే అలాగే ఉండాలనే అధికార దర్పం కారణంగా యంత్రాంగం మౌనమంత్రం పాటిస్తోంది. ఓ వైపు నీరు విడుదల చేయాలని టీజీపీ సీఈ వరదరాజ స్వయంగా ఆదేశించారు.
ఆమేరకు నీరు విడుదల చేసినట్లుగా కొద్దిగా షట్టర్ ఎత్తి, ఆపై షట్టర్ బేరింగ్ పాడైందనే సాకు చెప్పినట్లు తెలుస్తోంది. నిజంగా బేరింగ్‌లు పాడైనా గంటలో రిపేరు చేయవచ్చుని రైతుల విమర్శిస్తున్నారు. ఇప్పటికే వందలాది ఎకరాలు నీరు అందని కారణంగా ఎండిపోయాయని, మిగిలినవి కూడా ఒకటి రెండు రోజుల్లో అదేస్థితికి చేరుకుంటాయని రైతులు ఆవేదన చెందుతున్నారు.
డోలయమానంలో కిందిస్థాయి సిబ్బంది...
ఎస్‌ఆర్-2 కింద నీరు విడుదల చేయాలంటూ రైతుల నుంచి ఒత్తిడి, తమ అనుమతి లేనిదే విడుదల చేయరాదంటూ తెలుగుదేశం పార్టీ నేతల బెదిరింపులతో కింది స్థాయి సిబ్బంది తీవ్ర మనోవేదనకు గురైతోన్నట్లు సమాచారం. ‘కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం’అన్నట్లుగా పరిస్థితి ఉత్పన్నమైందని సంబంధిత ఏఈ ఒకరు సహచరులతో ఆవేదన చెందినట్లు సమాచారం. రైతుల న్యాయమైన కోర్కెను తీర్చలేని పరిస్థితిల్లో ఉద్యోగం చేయడం కంటే, తప్పుకోవడం శ్రేయష్కరమని వాపోయినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా సహచర ఉద్యోగికి బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. అధికార పార్టీ నేతలతోనే నీరు విడుదల చేయాలని, ఇతర ప్రాంతాల్లో ఉన్న ఆ నేతలు వచ్చేంతవరకూ సాకులు చూపించాలనే నిర్ణయం కారణంగా నీరు విడుదలకు నోచుకోలేదని సమాచారం.
ఈఈ ప్రతాప్ ఏమన్నారంటే....
ఎస్‌ఆర్-2 నుంచి నీరు విడుదల చేయాలని సీఈ ఆదేశించిన మాట నిజమే. ఆమేరకు విడుదల చేశాం. అంతలోనే షట్టర్ బేరింగ్ పాడైంది. దాంతో నీరు విడుదల ఆపాం. అధికారపార్టీ నాయకుల నుంచి ఎలాంటి ఒత్తిడి లేదు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వ్యవహరిస్తాం. త్వరలో నీరు విడుదల చేస్తాం. అయితే ఎప్పుడు నీరు విడుదల చేస్తామన్న విషయంపై ఈఈ ప్రతాప్ స్పష్టత ఇవ్వలేదు.
పైరుకాడా రాజకీయమే!
Published Thu, Dec 4 2014 3:12 AM | Last Updated on Sat, Sep 2 2017 5:34 PM
Advertisement