
సాక్షి, అమరావతి: నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు 12 మునిసిపాలిటీలకు జరగనున్న ఎన్నికల్లోనూ విజయ పరంపర కొనసాగాలని మంత్రులకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిశా నిర్దేశం చేశారు. అందరూ సమష్టిగా పని చేయడం ద్వారా జైత్రయాత్రను కొనసాగించాలని సూచించారు. 2019 ఎన్నికల్లో 50 శాతం ఓట్లు.. 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాల్లో ప్రజలు వైఎస్సార్‌సీపీని గెలిపించి అఖండ విజయాన్ని అందించారని చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయడం.. సంక్షేమ పథకాల ఫలాలను అందించడం.. అభివృద్ధిని చేతల్లో చూపడం ద్వారా ప్రజలకు చేరువయ్యామని చెప్పారు.
కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రజలకు తోడు నీడగా నిలిచామన్నారు. అందుకే మునిసిపల్, పంచాయతీ, పరిషత్ ఎన్నికల్లో జనం ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తూ వైఎస్సార్‌సీపీకి తిరుగులేని విజయాలను అందించారని చెప్పారు. ఈ నేపథ్యంలో నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు 12 మునిసిపాలిటీలకు నిర్వహించే ఎన్నికల్లోనూ ఇదే తరహా ఫలితాలు సాధించాలని మార్గ నిర్దేశం చేసినట్లు సమాచారం. మంత్రివర్గ సమావేశంలో అజెండా ముగిశాక.. అధికారులు నిష్క్రమించిన అనంతరం రాష్ట్రంలో తాజా పరిణామాలపై సీఎం వైఎస్ జగన్ మంత్రులతో చర్చించినట్లు తెలిసింది. ఎయిడెడ్ స్కూళ్లపై, గంజాయిపై టీడీపీ విష ప్రచారం చేస్తోందని మంత్రులు ప్రస్తావించగా.. వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, నవంబర్ 17 నుంచి నిర్వహించనున్న అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ కుట్రలను బహిర్గతం చేయాలని సీఎం సూచించినట్లు తెలిసింది.