నాడు అరాచకం.. నేడు సామరస్యం | A clear changes between the last assembly and the current assembly | Sakshi
Sakshi News home page

నాడు అరాచకం.. నేడు సామరస్యం

Published Wed, Jun 19 2019 5:09 AM | Last Updated on Wed, Jun 19 2019 5:09 AM

A clear changes between the last assembly and the current assembly - Sakshi

గత శాసనసభ, ప్రస్తుత శాసనసభ సమావేశాలకు మధ్య ఎంత తేడా... సభా నిర్వహణలో అప్పటి స్పీకర్‌కు, ఇప్పటి స్పీకర్‌కు మధ్య ఎంత వ్యత్యాసం... ఇక సభా నాయకుల మధ్య హుందాతనంలో అప్పటికి, ఇప్పటికి మధ్య అసలు పోలికే లేదు... రాష్ట్రంలో గత శాసనసభ జరిగిన తీరు, ప్రస్తుతం జరిగిన శాసనసభ తొలి సమావేశం తీరును చూసిన తర్వాత రాజకీయ నిపుణుల్లో వ్యక్తమవుతున్న అభిప్రాయాలివి. ఎన్నో అంశాల్లో అప్పటి, ఇప్పటి సభ తీరును బేరీజు వేస్తున్నారు. సానుకూలమైన మార్పు స్పష్టంగా కనిపిస్తోందని కొనియాడుతున్నారు. నాటి సభలో నిరంకుశత్వం, అరాచకం రాజ్యమేలగా, ఇప్పటి సభలో అలాంటి వాటికి చరమగీతం పాడారని ప్రశంసిస్తున్నారు. ప్రతిపక్షానికి సభలో మాట్లాడే అవకాశాలు ఎక్కువగా ఇవ్వాలని అధికార పక్షమే కోరడం మంచి పరిణామమని అంటున్నారు. 
– సాక్షి, అమరావతి

టీడీపీ హయాంలో సభా సంప్రదాయాలకు పాతర 
గతంలో అసెంబ్లీ జరిగిన తీరు, ఇప్పుడు అసెంబ్లీ జరిగిన తీరును గమనించిన రాజకీయ నిపుణులు రెండింటి మధ్య ఎంతో వ్యత్యాసం కనిపిస్తోందని అభిప్రాయపడుతున్నారు. గత అసెంబ్లీలో సభా నియమాలను అప్పటి అధికారపక్షం పట్టించుకోలేదు. సంప్రదాయాల పాటింపు అసలే లేదు. దూషణ భాషణలకు, వ్యక్తిగత నిందారోపణలకు హద్దులే లేవు. చివరకు అసభ్య పదజాలానికీ అడ్డుకట్ట పడలేదు. సభా నాయకుడు చంద్రబాబుతో సహా సభాధ్యక్ష స్థానంలో కూర్చున్న కోడెల శివప్రసాదరావుదీ అదే తీరు. రాష్ట్ర విభజనానంతరం ఏర్పడిన అసెంబ్లీలో తొలి సమావేశాల నుంచే అధికార తెలుగుదేశం పార్టీ అరాచకంగా వ్యవహరించింది. ఎక్కడికక్కడ ప్రతిపక్షం గొంతును నులిమేసింది. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే సభ నుంచి సస్పెండ్‌ చేసేశారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మాట్లాడుతుండగానే మధ్యలోనే మైక్‌ కట్‌ చేయడం, ప్రశ్నించిన వారిని సస్పెండ్‌ చేయడం వంటివి కనిపించడం లేదు. ఎవరైనా స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేసే అవకాశం లభిస్తోంది. సభ గౌరవ మర్యాదలను కాపాడాలని, సభ్యులంతా హుందాగా వ్యవహరించాలని సభా నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి కోరిన సంగతి తెలిసిందే.  ఫిరాయింపులపై ఫిర్యాదు చేసినా.. 

వైఎస్సార్‌సీపీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన 23 మందిని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రలోభాలకు గురిచేసి తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నారు. దీనిపై వైఎస్సార్‌సీపీ నిరసన వ్యక్తం చేసినా, అప్రజాస్వామిక విధానాలను తూర్పారబట్టినా ప్రయోజనం లేకపోయింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదులు చేసినా, పలుమార్లు విన్నవించినా అప్పటి స్పీకర్‌ కోడెల లెక్కచేయలేదు.  

ప్రజలకు నష్టం కలిగించే అంశాలపై చర్చకు నో 
గత అసెంబ్లీలో ప్రజా సమస్యలను ప్రస్తావించడానికి ప్రతిపక్షానికి అవకాశం కల్పించలేదు సరికదా కీలకమైన బిల్లులు, పద్దులపై కూడా చర్చకు అవకాశం లేకుండా ఏకపక్షంగా వ్యవహరించారు. రాజధాని నిర్మాణానికి సంబంధించి స్విస్‌ చాలెంజ్‌ విధానంపై చర్చలో ప్రతిపక్షానికి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదు. ఆ విధానానికి తమకు నచ్చిన రీతిలో సవరణలు చేస్తూ ఏకపక్షంగా అసెంబ్లీలో తీర్మానాలను ఆమోదింపజేసుకున్నారు. రైతులకు ఎంతో భరోసానిచ్చే 2013 భూసేకరణ చట్టానికి కూడా ఏకపక్షంగా సవరణలు చేశారు. 

రోజాకు అవకాశం ఇవ్వకుండా సస్పెన్షన్‌
వైఎస్సార్‌సీపీ సభ్యురాలు రోజాపై నిబంధనలకు విరుద్ధంగా సస్పెన్షన్‌ వేటు వేశారు. అప్పటి సీఎం చంద్రబాబు సూచనలతో ఆమెను సభ నుంచి బయటకు గెంటివేశారు. సభలో తాను సమాధానం చెప్పడానికి, వివరణ ఇచ్చుకోవడానికి అవకాశమివ్వాలని రోజా ఎంతగా ప్రాధేయపడ్డా పట్టించుకోలేదు. చివరకు ఆమె హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాటం చేయాల్సి వచ్చింది. ఆమెను సభ లోపలకు అనుమతించాలని కోర్టు ఉత్తర్వులిచ్చినా అసెంబ్లీకి వచ్చిన రోజాను అరెస్టు చేయించారు.  

ప్రత్యేక హోదా గళానికి సంకెళ్లు 
రాష్ట్రానికి సంజీవని వంటి ప్రత్యేక హోదాపై తెలుగుదేశం పార్టీ, నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసెంబ్లీ లోపల, బయట కూడా నిరంకుశంగా వ్యవహరించారు. ప్రత్యేక హోదాను కాదని ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించి రాష్ట్ర ప్రజల ఆశలను తుంచేశారు. దీనిపై ప్రతిపక్ష నేతగా జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో దీక్షలు, సభలు, సమావేశాలు నిర్వహించడంతో పాటు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీశారు. జగన్‌ ఇచ్చిన నోటీసులను అసెంబ్లీ స్పీకర్, ప్రభుత్వం పట్టించుకోలేదు. అసెంబ్లీలో చర్చకు జగన్‌ పట్టుబట్టగా అధికార పక్షం ఆయనను దౌర్జన్యంగా అడ్డుకుంది. 

సగం రోజులు ప్రతిపక్షం లేకుండానే
పార్టీ ఫిరాయింపులపై వైఎస్సార్‌సీపీ పలుమార్లు రాజ్యాంగ వ్యవస్థలన్నిటికీ ఫిర్యాదులు చేసినా ఫలితం కనిపించలేదు. తమ పార్టీ గుర్తుపై గెలిచిన వారిని మంత్రులుగా అసెంబ్లీలో స్పీకర్‌ గుర్తించడంతో తాము అసెంబ్లీకి హాజరవ్వడం సరికాదన్న అభిప్రాయానికి వైఎస్సార్‌సీపీ వచ్చింది. సగం రోజులు ప్రతిపక్షం లేకుండానే గత అసెంబ్లీ కొనసాగింది.  

ప్రతిపక్ష నేతపై దూషణల పర్వం
టీడీపీ హయాంలో అప్రజాస్వామికంగా, నిరంకుశ రీతిలో శానససభను నిర్వహించారు. ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా  గొంతు నొక్కేశారు. ప్రజా సమస్యలను ప్రస్తావించే ప్రతిసారీ స్వయంగా స్పీకరే అడ్డు తగులుతూ చర్చను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేశారు. పలు కీలక అంశాలపై నాటి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగించడానికి అవకాశం దొరకలేదు. ప్రతిపక్ష నేతను సీఎం చంద్రబాబు దారుణమైన రీతిలో అవహేళన చేసి మాట్లాడుతున్నా స్పీకర్‌ వాటిని రికార్డుల్లోకి ఎక్కేలా చేశారు.

నిష్పక్షపాతంగా సభ నిర్వహించాలని స్పీకర్‌కు వినతి 
ప్రస్తుత శాసనసభలో తొలిరోజు నుంచే కార్యకలాపాలు సజావుగా సాగేలా అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నిబద్దత ప్రదర్శించింది. స్పీకర్‌గా ఎన్నికైన బీసీ నేత తమ్మినేని సీతారాంను ఆయన సీట్లోకి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా తోడ్కొని వెళ్లగా, ప్రతిపక్ష నేత చంద్రబాబు రాకుండా ఎమ్మెల్యే కె.అచ్చెన్నాయుడిని పంపించడం వివాదాస్పదమైంది. గత అసెంబ్లీలో స్పీకర్‌గా కోడెల శివప్రసాదరావు ఎన్నిక సమయంలో ఆయన పేరును వైఎస్సార్‌సీపీ ప్రతిపాదించడమే కాకుండా, అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆయనను సాదరంగా స్పీకర్‌ స్థానం వరకు తోడ్కొని వెళ్లారు. కానీ, ఈసారి చంద్రబాబు ఆ సంప్రదాయం పాటించకుండా విమర్శలపాలయ్యారు. గత అసెంబ్లీలో స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు సభను నిర్వహించడంలో పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరించారు.

67 మంది సభ్యుల బలం ఉన్న ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌కు మాట్లాడేందుకు మైకు ఇవ్వడమే గగనంగా మారింది. ఒకవేళ మాట్లాడే అవకాశం వచ్చినా అధికార టీడీపీ సభ్యులు వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ అడుగడుగునా ఆటంకాలు కల్పించేవారు. అందుకు స్పీకర్‌ కోడెల యథాశక్తి సహకరించేవారు. ఈసారి సభలో అందుకు భిన్నమైన వాతావరణం కనిపించింది. అధికార పక్ష సభ్యులు 151 మంది, ప్రతిపక్ష సభ్యులు 23 మందే ఉన్నా స్పీకర్‌ ప్రజాస్వామ్యబద్ధంగా సభను నడిపించాలని, నిష్పక్షపాతంగా, రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజాస్వామ్య విలువలను కాపాడేలా సభను నిర్వహించాలని వైఎస్‌ జగన్‌ ఆకాంక్షించారు. తాము పూర్తిగా సహకరిస్తామని సభలోనే స్పష్టం చేశారు. పార్టీ ఫిరాయింపులపై గత అసెంబ్లీలో స్పీకర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని గుర్తు చేశారు. ఈ సభలో అలాంటి పరిణామాలకు తావులేదని, ఎవరైనా పార్టీ మారితే వారిపై వెంటనే అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను కోరారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement