ఆయనొస్తున్నారని..
► సీఎం పర్యటన పేరుతో నిధుల పందేరానికి రంగం సిద్ధం
► బాగా ఉన్న రోడ్డుపైనే మళ్లీ నిర్మాణం
► శిల్పారామంలో రూ.15.50 లక్షలతో ప్రహరీ
► రూ.90 లక్షల పనులకు రంగం సిద్ధం
► కార్పొరేషన్ తీరుపై సర్వత్రా విమర్శలు
నగర పాలక సంస్థ పాలకవర్గం, అధికారుల వ్యవహారశైలిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్నిచోట్ల అవసరం లేకున్నా పనులు చేయడం, నిధులు ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తుండటంపై ప్రతిపక్ష పార్టీల నాయకులతో పాటు ప్రజలు మండిపడుతున్నారు. నగర సమగ్రాభివృద్ధిని ఏమాత్రమూ పట్టించుకోకుండా తమకు ‘నగదు’ మిగిలే పనులపైనే దృష్టి పెడుతున్నారన్న ఆరోపణలున్నాయి.
అనంతపురం న్యూసిటీ : ముఖ్యమంత్రి పర్యటన పేరుతో మరోసారి నిధుల పందేరానికి నగర పాలక సంస్థ సిద్ధమైంది. గత పర్యటన సందర్భంగా విచ్చలవిడిగా నిధులు ఖర్చు చేసి విమర్శల పాలైన పాలకవర్గం, అధికారులు.. ఈసారి కూడా అదే పంథాలో వెళుతుండడం గమనార్హం. ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చే నెల 6, 15వ తేదీల్లో ‘అనంత’ పర్యటనకు రానున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని పనులు చేపట్టేందుకు నగరపాలక సంస్థ అధికారులు, పాలకవర్గం రంగం సిద్ధం చేశారు. నగరంలో బాగా ఉన్న రోడ్డుపైనే మళ్లీ వేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయడం వివాదాస్పదమవుతోంది. శిల్పారామంలో రూ.15 లక్షలతో ప్రహరీ ఏర్పాటు చేయనున్నారు. వాస్తవానికి శిల్పారామం నగరపాలక సంస్థ పరిధిలోకి రాదు. అయినా లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధపడడం విమర్శలకు తావిస్తోంది. రూ 28.10 లక్షలతో అంబేడ్కర్ సర్కిల్ నుంచి ఎస్పీ కార్యాలయం, ఆర్‌అండ్‌బీ అతిథి గృహం నుంచి డీఆర్‌డీఏ కార్యాలయం, డీఆర్‌డీఏ నుంచి ఉపాధ్యాయ భవన్ వరకు, రూ.20 లక్షలతో పోలీస్ శిక్షణ కళాశాల (పీటీసీ) నుంచి కొవ్వూర్‌నగర్ నాగులకట్ట వరకు బీటీ రోడ్లు వేసేందుకు టెండర్లను ఆహ్వానించనున్నారు. సైనిక్ భవన్ నుంచి లేపాక్షి ఎంపోరియం షాపింగ్ కాంప్లెక్స్ వరకు రూ.6 లక్షలతో సీసీ రోడ్డు వేయనున్నారు. ఎస్పీ, ఆర్‌అండ్‌బీ కార్యాలయం ముందు రోడ్లు బాగా ఉన్నప్పటికీ ఎందుకు టెండర్లు పిలుస్తున్నారో అర్థం కావడం లేదని ప్రజలు అంటున్నారు.
పరిధిలో లేకున్నా..
నగరపాలక సంస్థ పరిధిలోకి రాని ప్రాంతాల్లోనూ అభివృద్ధి పనులు చేపట్టాలని పాలకవర్గం, అధికారులు నిర్ణయం తీసుకోవడం దుమారం రేపుతోంది. ప్రజాధనాన్ని నగరపాలక సంస్థ పరిధిలోనే ఖర్చు చేయాలి. అందుకు భిన్నంగా అధికారులు వ్యవహరిస్తున్నారనడానికి శిల్పారామంలో చేపట్టనున్న పనులే నిదర్శనం. శిల్పారామం వద్ద గతంలోనూ నగరపాలక సంస్థ నిధులు రూ.40 లక్షలతో మ్యూజికల్ ఫౌంటేన్ ఏర్పాటు చేశారు. ఈ పనులకు బిల్లు చేయబోమని మొదట్లో అధికారులు చెప్పారు. చివరకు అధికార పార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గారు. జేఎన్‌టీయూ నుంచి ఆడిటోరియం వరకు రూ 9.68 లక్షలతో బీటీ రోడ్డు వేయనున్నారు. ఇది కూడా కార్పొరేషన్ పరిధిలోకి రాదు.
కౌన్సిల్ ఆమోదం తీసుకుంటాం : – సురేంద్రబాబు, ఎస్‌ఈ, నగర పాలక సంస్థ
శిల్పారామం నగరపాలక సంస్థ పరిధిలోకి రాదు. ఉన్నతాధికారుల సూచన మేరకు ప్రహరీ ఏర్పాటుకు టెండర్లను పిలవనున్నాం. ఎస్పీ కార్యాలయం, ఆర్‌అండ్‌బీ అతిథిగృహం ముందున్న రోడ్లు దెబ్బతిన్నాయి. అందుకే కొత్తగా వేయాలని నిర్ణయించాం.