మహిళలపై ఇద్దరు సీనియర్ల వేధింపులు
ఆడిట్ శాఖలో ఇష్టారాజ్యం
అది ఆడిట్ శాఖ.. వారు ఏళ్ల తరబడి అక్కడే పాతుకుపోయిన సీనియర్లు.. తాము చేసే అక్రమాలకు తలూపితే ఓకే.. లేకపోతే ఎంప్లాయి డేటాలో భర్త పేరుదగ్గర మరొకరి పేరు నమోదు చేస్తారు.. దాన్ని సదరు మహిళ భర్తకు చూపుతామంటూ బ్లాక్‌మెయిల్ చేస్తారు.. ఏడి కళ్లావేళ్లా పడితే మళ్లీ పేరు సాధారణ స్థితికి తెస్తారు. ఇదేమని ప్రశ్నించిన అధికారిని సైతం బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. వీరి చేష్టలకు విసిగిపోయిన మహిళా సిబ్బంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ కాపీ ‘సాక్షి’కి చిక్కింది.
నెల్లూరు (అర్బన్): నెల్లూరు జిల్లా గూడూరులో ఆడిటర్లుగా పని చేస్తున్న ఇద్దరు సీనియర్లు 2006 లో డిప్యుటేషన్‌పై నెల్లూరుకు వచ్చారు. డిప్యుటేషన్‌పై వచ్చిన వారిని మూడేళ్లకు మించి ఉంచకూడదు. ఈ నిబంధన ఆ ఇద్దరికి వర్తించలేదు. అప్పటి నుంచి వారి అవినీతికి అంతం లేకుండా పోయింది. 2012లో కార్పొరేషన్ చిరుద్యోగులు సుబ్బులు, జయరాం, మరో మహిళ తమ పెన్షన్ ఫైలు విషయంలో లంచం అడుగుతున్నారంటూ పత్రికలకు ఎక్కారు. దీంతో విచారణ చేసిన అధికారులు వారిద్దరినీ మళ్లీ గూడూరుకు ట్రాన్స్‌ఫర్ చేశారు. వీరు 2014 బదిలీల్లో మళ్లీ నెల్లూరుకే వచ్చారు. వీరి మీద అభియోగాలున్న దృష్ట్యా ఒకరిని మండల పరిషత్ ఆడిట్ శాఖలో, మరొకరిని జిల్లా పరిషత్ ఆడిట్ శాఖలో నియమించారు. అక్కడా ఇదే పంథా కొనసాగిస్తున్నారు.
జిల్లా కార్యాలయంలో సీటు కోసం కుస్తీ
వీరు రంగనాయకుల పేటలోని జిల్లా ఆడిట్ కార్యాలయంలో కుర్చీలపై కన్నేశారు. నిత్యం ఇతరులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఎలాగైనా ఆదాయం తెచ్చి పెట్టే పాత సీట్లోకి వెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు.
500 ఫిర్యాదులు వెళ్లినా చర్యలేవి?
వీరిలో ఒకరిపై 500ల ఫిర్యాదులు వెళ్లినా చర్యల్లేవ్. విచారణ మూడేళ్లుగా సాగుతోంది. ఓ సీనియర్ ఏటా కార్పొరేషన్‌లో ఆడిట్ చేస్తారు. గతేడాది 12 మందితో కమిటీ వేసినా ఆయన ఒక్కరే ఆడిట్ చేశారు. వాటిలో అభ్యంతరాలున్నా లేనట్టు చూపించి డబ్బులు వసూలు చేసినట్టు విమర్శలున్నాయి. ఆడిట్‌లో అభ్యంతరాలున్నాయంటూ ఒంగోలు డిప్యూటీ డెరైక్టర్ ఫైలుపై ఆరు నెలలు సంతకాలు చేయకుండా ఆపారు. ప్రస్తుతం కార్పొరేషన్‌లో ఇంజనీరింగ్ విభాగానికి ఆడిట్ పూర్తి చేశారు. ఇందులో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారాయనే ఆరోపణలున్నాయి. సొంత ఇంట్లో ఉంటూ ఇన్‌కంటాక్స్ కోసం అద్దె ఇంట్లో ఉన్నట్టు రికార్డు చూపినట్టు ఆరోపణలున్నాయి.
విజిలెన్స్ విచారణ ఏమైందో?
మరొక అవినీతి ఆడిటర్‌పై కూడా విజిలెన్స్ విచారణ జరిగింది. జిల్లా ఆడిట్ అధికారి నివేదిక తయారు చేసి 2015లో ఒంగోలు డిప్యూటీ డెరైక్టర్‌కు పంపారు. అయినా ఆయనపై చర్యలు లేవు. ఆయన జెడ్పీ ఆడిటర్‌గా పని చే స్తూ మండల పరిషత్ ఆడిటింగ్ పనులను ఒకరికి బదులుగా చేసినట్టు ఆరోపణలున్నాయి. గతంలో వీరిపై డిప్యూటీ డెరైక్టర్ చిన్నపరెడ్డి విచారణ చేపట్టారు.
సాక్షికి చిక్కిన బాధితురాలి ఫిర్యాదు కాపీ
వీరి బాధలు పడలేని తోటి సీనియర్ ఆడిటర్ అయిన ఓ మహిళ తనను ఎలా మానసికంగా వేధిస్తున్నారో వివరిస్తూ రాష్ట్ర డెరైక్టర్‌తో పాటు డీడీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. భర్తలేని తాను బిడ్డలతో గుట్టుగా ఉంటే తనను వేధిస్తున్నారని వివరించింది. ఆ ఇద్దరిపై చర్యలు తీసుకొని మహిళా ఆడిటర్లకు రక్షణ కల్పించాలని కోరుతూ డిప్యూటీ డెరైక్టర్-ఒంగోలుకు పంపిన కాపీ ‘సాక్షి’కి చిక్కింది.
వేధింపులకు గురిచేసిన కాపీ అందింది
ఆడిట్ శాఖలో మహిళలను వేధిస్తుని మహిళ చేసిన ఫిర్యాదు అందింది. దీనిపై విచారణ చేపట్టాం. డెరైక్టర్ పరిశీలించి చర్యలు తీసుకోవాలి. అదేంటి మీరే చర్యలు తీసుకుని డెరైక్టర్‌కు నివేదిక పంపాలి కదా? అని సాక్షి ప్రశ్నించగా సమాధానం దాటవేశారు.
-రాధాకృష్ణ, రీజనల్ డిప్యూటీ డెరైక్టర్, ఒంగోలు
చర్యలు తీసుకోవాల్సింది డీడీనే
నేను ఇటీవలే బాధ్యతలు చేపట్టా. వారిపై చర్యలు చేపట్టేందుకు అధికారం లేదు. రీజినల్ డిప్యూటీ డైరె క్టర్ చర్యలు తీసుకోవాలి.
-షణ్ముఖం, జిల్లా ఆడిట్ అధికారి