మూడవ విడత గోల్డ్ బాండ్ స్కీమ్
తగ్గిన స్పందన!
న్యూఢిల్లీ: మూడవ విడత సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్‌బీజీ) స్కీమ్‌కు స్పందన అంతంతమాత్రంగానే వచ్చింది. దాదాపు రూ.329 కోట్ల విలువైన 1,128 కేజీలకు మాత్రమే డిమాండ్ వచ్చింది. రెండవ విడతతో పోల్చితే ఈ డిమాండ్ దాదాపు సగమే కావడం గమనార్హం. మూడు విడతలూ కలిసి రూ.1,322 కోట్ల విలువ రూ.4,916 కేజీలకు సబ్‌స్క్రిప్షన్ వచ్చినట్లు గణాంకాలు వెల్లడించాయి. మార్చి 8వ తేదీ నుంచి 14వతేదీ వరకూ మూడవ విడత స్కీమ్ అమలయ్యింది. తొలి సమాచారం ప్రకారం 64,000 మంది నుంచి దరఖాస్తులు అందాయి. బాండ్లు మార్చి 29న జారీ అవుతాయి. 2015 నవంబర్‌లో 916 కేజీలు, ఈ జనవరిలో 2,872 కేజీలకు సంబంధించి దరఖాస్తులు వచ్చాయి.
గోల్డ్ స్కీమ్ విజయానికి కసరత్తు...
మరోవైపు గోల్డ్ డిపాజిట్ పథకం విజయవంతం చేయడానికి కేంద్ర కసరత్తు చేస్తోంది. దాదాపు 800 బిలియన్ డాలర్ల విలువ చేసే 20,000 టన్నుల బంగారం బీరువాలకు పరిమితమవుతోందని, దీనిలో సగాన్నైనా మార్కెట్‌లోకి తీసుకురావాలని భావించిన కేంద్రానికి తీవ్ర నిరాశే ఎదురయ్యింది. కేవలం 3 టన్నుల డిపాజిట్ మాత్రమే ఇప్పటివరకూ నమోదైంది.
మరోవైపు, దాదాపు 44 కేజీల బంగారాన్ని.. గోల్డ్ స్కీమ్ కింద డిపాజిట్ చేయాలని యోచిస్తున్నట్లు ముంబైలోని ప్రసిద్ధ సిద్ధి వినాయక దేవాలయం వర్గాలు తెలిపాయి. ఇందుకోసం వివిధ బ్యాంకుల ప్రతిపాదనలను పరిశీలిస్తున్నామని, వచ్చే వారం అధికారిక ప్రకటన రాగలదని పేర్కొన్నాయి. సిద్ధి వినాయక దేవాలయం వద్ద దాదాపు 160 కేజీల బంగారం ఉన్నట్లు అంచనా.