
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) సార్వత్రిక గోల్డ్ బాండ్ల(ఎస్‌జీబీ)కు సంబంధించి తుది రిడంప్షన్ ధరను ప్రకటించడంతో ఇన్వెస్టర్ల సంపద భారీగా పెరగబోతుంది. 2016-17 సిరీస్ 4(ఎనిమిదేళ్లు), 2019-20 సిరీస్ 4(ఐదేళ్లు)లో పెట్టుబడిదారులు ఈమేరకు గణనీయమైన రాబడిని పొందనున్నారు. బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో ఎస్‌జీబీ ఇన్వెస్టర్ల సంపద దాదాపు మూడు రెట్లు పెరగవచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి.
2017 ఫిబ్రవరిలో గ్రాముకు రూ.2,943 చొప్పున జారీ చేసిన 2016-17 సిరీస్ 4 బాండ్లను ఇప్పుడు గ్రాముకు రూ.8,624గా రీడీమ్ చేసి 193 శాతం రాబడిని అందించనున్నారు. అదే ధరకు 2019 సెప్టెంబర్‌లో జారీ చేసిన 2019-20 సిరీస్ 4లో ఇన్వెస్టర్లు గ్రాముకు రూ.8,634 చొప్పున బాండ్లను రీడీమ్ చేసుకోవచ్చు. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) ప్రచురించిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది మార్చి 10 నుంచి మార్చి 13 మధ్య 999 స్వచ్ఛత బంగారం సగటు ముగింపు ధర ఆధారంగా ఈ రెండు సిరీస్‌లకు రిడంప్షన్‌ను మార్చి 17న షెడ్యూల్ చేశారు.
రిడంప్షన్ ధర ఎలా లెక్కిస్తారంటే..
బాండ్లను రిడంప్షన్ చేసుకునేవారికి ఆ తేదీకి ముందు గడిచిన మూడు పనిదినాల్లో సగటు బంగారం ధర (999 స్వచ్ఛత) ఆధారంగా ఉంటుంది రాబడిని లెక్కిస్తారు. ఈ బాండ్ సిరీస్ కోసం ఐబీజేఏ 2025 మార్చి 11, 12, 13 తేదీల్లో బంగారం ధరలను లెక్కించింది. సావరిన్ గోల్డ్ బాండ్స్ (ఎస్‌జీబీ) ఎనిమిదేళ్ల మెచ్యూరిటీని కలిగి ఉంటాయి. కానీ పెట్టుబడిదారులు ఐదేళ్ల తర్వాత వీటిని రిడీమ్ చేసుకోవచ్చు. ఈమేరకు సంబంధిత వడ్డీ చెల్లింపు తేదీల్లో మాత్రమే ఉపసంహరించుకోవచ్చు. ఎస్‌జీబీ సిరీస్ 4 2019-20కు సంబంధించి ఐదేళ్లకాలానికి రిడీమ్ తేదీని మార్చి 17గా నిర్ణయించారు.
రిడీమ్ ప్రక్రియ ఇలా..
బాండ్లను ముందుగానే రిడీమ్ చేసుకోవడానికి పెట్టుబడిదారులు వడ్డీ చెల్లింపు తేదీకి 30 రోజుల ముందు నిర్దేశించిన బ్యాంకు, ఎస్‌హెచ్‌సీఐఎల్ కార్యాలయం, పోస్టాఫీసు లేదా ఏజెంట్ వద్ద దరఖాస్తు సమర్పించాలి. ఈ అభ్యర్థన మార్చి 17 కంటే కనీసం ఒక రోజు ముందుగా విజయవంతంగా ప్రాసెస్ అవుతుంది. ఇది ఆమోదం పొందిన తర్వాత వచ్చే ఆదాయం నేరుగా ఎస్‌జీబీ అప్లికేషన్‌తో లింక్ చేయబడిన ఇన్వెస్టర్ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. మెచ్యూరిటీ కంటే ముందు కూడా అత్యవసర సమయాల్లో పెట్టుబడులను ఉంపసంహరించుకోవచ్చు. కానీ దానిపై అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. దాంతో రాబడి తగ్గుతుంది.
మెచ్యూరిటీ వరకు ఎస్‌జీబీలను ఉంచడం వల్ల కలిగే ప్రయోజనాలు
పన్ను రహిత లాభాలు: మెచ్యూరిటీ వరకు ఉంచితే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఉండదు.
గ్యారంటీడ్ వడ్డీ: 2.5 శాతం వార్షిక వడ్డీ స్థిరమైన ఆదాయాన్ని నిర్ధారిస్తుంది.
మార్కెట్ లింక్డ్ రిటర్న్స్: ప్రస్తుతం ఉన్న బంగారం ధరలతో ముడిపడి రాబడి పెరుగుతుంది.
భద్రత: ప్రభుత్వ మద్దతు ఉండే ఎస్‌జీబీలు పెట్టుబడులకు భద్రత కల్పిస్తాయి.
ఏమిటీ ఎస్‌జీబీలు..?
ఇవి భారత ప్రభుత్వం తరఫున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) జారీ చేసిన ప్రభుత్వ సెక్యూరిటీలు. నిజమైన (భౌతిక) బంగారానికి ఇవి ప్రత్యామ్నాయ రూపం. పెట్టుబడిదారులు భౌతికంగా బంగారం కలిగి ఉండాల్సిన అవసరం లేకుండా దానిపై పెట్టుబడి పెట్టడానికి ఈ బాండ్లు వీలు కల్పించాయి. పెట్టుబడిదారులు ఇష్యూ ధరను నగదు రూపంలో చెల్లించాలి. బాండ్ల గడువు ముగిసిన తర్వాత పెట్టుబడిదారులకు నగదు రూపంలోనే తిరిగి చెల్లిస్తారు.బంగారం దిగుమతులను నిరుత్సాహపరచడం ద్వారా విదేశీ మారకం నిల్వలను కాపాడుకోవచ్చన్న భావనతో కేంద్రం ఈ బాండ్ల జారీని ప్రారంభించింది.
ఇదీ చదవండి: భారత్‌లో యాపిల్-గూగుల్ భాగస్వామ్యం..?
భారంగా మారిన బాండ్లు
భారత్‌లో పెరుగుతున్న బంగారం దిగుమతులను తగ్గించాలన్న లక్ష్యంతో పదేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించింది. ఆశించిన ప్రయోజనం అటుంచితే పెరుగుతున్న బంగారం ధరలతో ఖజానాపై ఊహించని ఆర్థిక భారం పడింది. దీంతో ప్రభుత్వం చివరకు ఈ పథకాన్ని రద్దు చేయాల్సి వచ్చింది. గోల్డ్ బాండ్స్‌లో ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరినాటికి రూ.85,000 కోట్లను తాకనుందని 2024 జూలై మధ్యంతర బడ్జెట్ సందర్భంగా ప్రభుత్వం వెల్లడించింది. ఈ విలువ 2019–20తో పోలిస్తే దాదాపు తొమ్మిది రెట్లు అదనం.
Comments
Please login to add a commentAdd a comment