దిగుమతి సుంకం కోతతో ఊరిస్తున్న పుత్తడి
కొత్త గోల్డ్ బాండ్లలో పెట్టుబడులు ఆకర్షణీయం
రిడెంప్షన్లపై ప్రభుత్వానికి భారీ ఊరట...
ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్టు.. బడ్జెట్లో మోదీ సర్కారు బంగారంపై గురి పెట్టింది. అనూహ్యంగా దిగుమతి సుంకాన్ని సగానికిపైగా తగ్గించడంతో కొత్తగా సావరీన్ గోల్డ్ బాండ్స్ (ఎస్‌జీబీ)లో పెట్టుబడి పెట్టేవారికి ధర భారీగా దిగొచి్చంది. మరోపక్క, పాత బాండ్ల చెల్లింపులపై (రిడెంప్షన్లు) భారాన్ని కూడా ప్రభుత్వం తగ్గించుకుంటోంది. తాజా నిర్ణయంతో గోల్డ్ బాండ్ స్కీమ్ మరింత ఆకర్షణీయంగా మారుతుందంటున్నారు విశ్లేషకులు!
బంగారం దిగుమతులపై కస్టమ్స్ సుంకాన్ని ఈ ఏడాది బడ్జెట్లో 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. దీంతో పసిడి ధరలు ఒక్కసారిగా రూ. 5,000 మేర పడిపోయాయి. దీంతో గత కొద్ది రోజులుగా బంగారం షాపులు కళకళలాడిపోతున్నాయి. మళ్లీ ధర పెరిగిపోతుందేమోనన్న ఆత్రుతతో పసిడి ప్రియులు ఇన్వెస్ట్‌మెంట్ కోసం కూడా పుత్తడి కొనుగోళ్లకు ఆసక్తి చూపుతుండటంతో డిమాండ్ పుంజుకుందని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నారు. ధర భారీగా తగ్గడం వల్ల ఈ ఆరి్థక సంవత్సరంలో కొత్తగా విడుదల చేసే గోల్డ్ బాండ్లకు కూడా గిరాకీ ఉంటుందని భావిస్తున్నారు. దేశంలో భౌతిక రూపంలో బంగారం డిమాండ్‌ను తగ్గించడంతో పాటు ప్రజల పొదుపు మొత్తాలను పసిడిలోకి కాకుండా ఆరి్థకపరమైన సాధనాల్లోకి మళ్లించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2015లో గోల్డ్ బాండ్ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. ఇప్పటిదాకా వీటి ద్వారా ప్రభుత్వం రూ. 72,274 కోట్ల నిధులను సమీకరించింది.
అప్పట్లో గ్రాము రూ.3,100...
2015 నుంచి 2017 వరకు మూడేళ్లలో జారీ చేసిన గోల్డ్ బాండ్లకు గ్రాము రేటు రూ.3,100 నుంచి రూ.3,500 స్థాయిలో ఉంది. తాజా బడ్జెట్‌కు ముందు గ్రాము మేలిమి బంగారం ధర రూ.7,200 పలికింది. గోల్డ్ బాండ్ గడువు వ్యవధి (మెచ్యూరిటీ) 8 ఏళ్లు. అంటే, గతంలో జారీ చేసిన బాండ్ల గడువు తీరుతుండటంతో ఇప్పుడు ప్రభుత్వం తిరిగి చెల్లింపులు జరపాల్సి ఉంటుంది. రేటు రెట్టింపునకు పైగా పెరిగిపోవడంతో ప్రభుత్వ ఖజానాపై భారం కూడా భారీగా ఉంటుంది. దిగుమతి సుంకం తగ్గింపుతో ఒక్కో గ్రాముపై రేటు భారీగా దిగొ చ్చింది. అంతర్జాతీయంగా పసిడి ధరల ట్రెండ్ ప్రస్తుత స్థాయిలోనే కొనసాగితే, బాండ్ రిడెంప్షన్లపై సర్కారు చెల్లింపులు తగ్గుతాయి.
130 శాతం రాబడి...
గోల్డ్ బాండ్ల గడువు తీరిన తర్వాత, రిడెంప్షన్ తేదీకి ముందు 24 క్యారెట్ల బంగారం 3 రోజుల సగటు ధర ప్రకారం రూపాయిల్లో చెల్లించాల్సి ఉంటుంది. గోల్డ్ బాండ్ స్కీమ్ కింద ఎనిమిదేళ్ల క్రితం 2016 ఆగస్ట్‌లో జారీ చేసిన సిరీస్–1 బాండ్ల గడువు ఈ నెలలోనే ముగుస్తుంది. అప్పట్లో ఒక్కో గ్రాముకు రూ.3,119 చొప్పున ఇన్వెస్టర్లు చెల్లించారు. దీనికి వార్షికంగా 2.75 శాతం వడ్డీ కూడా జమవుతుంది (ప్రస్తుతం వడ్డీ 2.5 శాతంగా ఉంది). తాజా రేటు ప్రకారం రూ. 6,900–7,000 స్థాయిలో రిడెంప్షన్ ధర ఉండొచ్చని అంచనా. దీని ప్రకారం చూస్తే, వడ్డీ కూడా కలిపితే ఇన్వెస్టర్లకు 130 శాతం లాభాలు వస్తున్నట్లు లెక్క. అయితే, ప్రభుత్వ గ్యారంటీ ఉండటం, వార్షికంగా 12–13 శాతం రాబడులు పక్కాగా లభిస్తుండటంతో గోల్డ్ బాండ్లకు వన్నె తగ్గదని నిపుణులు అంటున్నారు.
– సాక్షి, బిజినెస్ డెస్క్
సెప్టెంబర్‌లో మరో విడత!
బడ్జెట్లో సుంకం కోత నిర్ణయం నేపథ్యంలో తాజా గోల్డ్ బాండ్ల జారీని ప్రభుత్వం వాయిదా వేస్తూ వచి్చంది. చివరిగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎస్‌జీబీలను జారీ చేశారు. గత రెండు ఆరి్థక సంవత్సరాల్లో ఏటా నాలుగు సార్లు చొప్పున ఎస్‌జీబీలను కేంద్రం అందించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి విడత బాండ్లను సెపె్టంబర్‌లో జారీ చేయొచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నారు. గ్రాము ధర ప్రస్తుత ట్రెండ్ ప్రకారం రూ. 7,000కు అటుఇటుగా నిర్ణయించే అవకాశం ఉండటంతో ఇన్వెస్టర్ల నుంచి భారీ గా డిమాండ్ ఉంటుందని రిద్దిసిద్ధి బులియన్స్ ఎండీ పృధ్విరాజ్ కొఠారి అభిప్రాయపడ్డారు. ఈ ఆరి్థక సంవత్సరంలో మూడు విడతల్లో బాండ్ల జారీ ఉంటుందని అంచనా. తద్వారా ప్రభుత్వం రూ.18,500 కోట్లను సమీకరించే అవకాశం ఉంది. అమెరికాలో వడ్డీరేట్ల కోత సంకేతాలు, భౌగోళిక–రాజకీయ ఉద్రికతలతో అంతర్జాతీయంగా బంగారం ధరలు మరింత ఎగబాకే అవకాశాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment