న్యూఢిల్లీ: సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2021–22లో నాల్గవ విడత గోల్డ్ బాండ్ల జారీ సోమవారం నుంచీ ప్రారంభమైంది. 16వ తేదీ వరకూ నాలుగు రోజులు ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. ఇష్యూ ధర గ్రాముకు రూ.4,807. ఆన్‌లైన్‌లో దరఖాస్తుదారులు, డిజిటల్ విధానంలో చెల్లింపుదారులకు ధరలో గ్రాముకు రూ.50 తగ్గుతుంది. అంటే గ్రాముకు ధర రూ.4,757 మాత్రమే. ప్రభుత్వ క్యాలెండర్ ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ 2021 వరకూ మొత్తం ఆరు దఫాలుగా గోల్డ్ బాండ్ స్కీమ్ అమలు జరుగుతుంది. దేశంలో బంగారానికి భౌతికంగా ఉన్న డిమాండ్‌ను దేశీయ పొదుపుల్లోకి మార్చడానికి ఉద్దేశించి 2015 నవంబర్లో గోల్డ్ బాండ్ స్కీమ్‌ను కేంద్రం ప్రవేశపెట్టింది.
బ్యాంకులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్, బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల ద్వారా గోల్డ్ బాండ్ కొనుగోలు చేసుకోవచ్చు. బాండ్ కాల వ్యవధి ఎనిమిదేళ్లు. ఒక ఇన్వెస్టర్ లేదా హిందూ అవిభాజ్య కుటుంబం ఒక గ్రాము నుంచి గరిష్టంగా 4 కిలోగ్రాముల వరకు కొనుగోలు చేసుకోవచ్చు. ట్రస్ట్‌లకు ఈ పరిమితి 20 కిలో గ్రాములు. 2015 నవంబర్ నుంచి 2021 మార్చి నాటికి ఈ పథకం కింద 63.32 టన్నుల పరిమాణానికి సంబంధించి బంగారం బాండ్లను జారీ చేయడం ద్వారా రూ.25,702 కోట్ల సమీకరించింది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ 12 ఇష్యూల్లో భాగంగా రూ.16,049 కోట్ల బాండ్లను (32.35 టన్నులు) జారీ చేసింది. అంటే ఇప్పటి వరకు మొత్తం బంగారం బాండ్ల జారీలో సగానికి పైగా గత ఆర్థిక సంవత్సరంలో నమోదయ్యాయి.
చదవండి: Ola Electric Vehicles : ఏడాది కోటి ఎలక్ట్రిక్ బైక్స్ తయారీ
Comments
Please login to add a commentAdd a comment