ఎన్‌పీఎస్ టైర్1 ఖాతాదారులకు అదనంగా రూ.50,000 పెట్టుబడి మొత్తంపై పన్ను ఆదా ఉందని తెలిసింది. నూతన పన్ను విధానంలోనూ దీన్ని వినియోగించుకోవచ్చా? – జయంతి రామన్
నూతన పన్ను విధానం కింద, ఎన్‌పీఎస్ టైర్1 ఖాతాలో ఇన్వెస్ట్ చేస్తున్నట్టు అయితే, మీరు అదనంగా రూ.50,000 మొత్తంపై పన్ను ఆదా చేసుకునేందుకు అవకాశం లేదు. పాత పన్ను విధానంలో ఉన్న వారే రూ.50,000 మొత్తంపై అదనపు పన్ను ప్రయోజనాన్ని క్లెయిమ్ చేసుకోగలరు.
కాకపోతే మీరు పనిచేసే సంస్థలో మీ తరఫున యాజమాన్యం ఎన్‌పీఎస్ ఖాతాకు జమ చేస్తున్నట్టు అయితే అప్పుడు అదనపు క్లెయిమ్‌కు అవకాశం ఉంది. మీ మూల వేతనం, డీఏలో గరిష్టంగా 10% మేర పన్ను మినహాయింపును పొందొచ్చు. ఒకవేళ మీరు ప్రభుత్వ ఉద్యోగి అయితే మూలవేతనం, డీఏలో 14% పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు.
నా వద్ద 2016–17 సంవత్సరానికి సంబంధించి 20 యూనిట్ల సావరీన్ గోల్డ్ బాండ్లు (ఎస్‌జీబీలు) ఉన్నాయి. 2024 నవంబర్ 17తో వీటి గడువు ముగిసిపోతుంది. నగదు బదులు 20 గ్రాముల బంగారం తీసుకోవచ్చా? – వసంత పరిమి
సావరీన్ గోల్డ్ బాండ్లలో పెట్టుబడుల కాల వ్యవధి ముగిసిన సమయంలో భౌతిక బంగారాన్ని క్లెయిమ్ చేసుకునేందుకు అవకాశం లేదు. భౌతిక బంగారాన్ని కలిగి ఉండడానికి ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చిన సాధనం ఎస్‌జీబీ. ఎస్‌జీబీ కాల వ్యవధి ఎనిమిదేళ్లు. ఐదేళ్ల పాటు పెట్టుబడులకు లాకిన్ ఉంటుంది. ఐదేళ్లు ముగిసిన తర్వాత ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉంది.
లాభంపై పన్ను మినహాయింపు కోరుకునే వారు ఎనిమిదేళ్ల పాటు కొనసాగించాల్సి ఉంటుంది. మెచ్యూరిటీ ముగిసే తేదీకి మూడు రోజుల ముందు 24 క్యారట్ల బంగారం సగటు ధర ఆధారంగా చెల్లింపులు చేస్తారు. ఇన్వెస్టర్ ఎస్‌జీబీ కొనుగోలు సమయంలో ఇచ్చిన బ్యాంక్ ఖాతాతోనే గడువు అనంతరం మెచ్యూరిటీ మొత్తం జమ అవుతుంది.
పన్ను ఆదా ప్రయోజనంతో కూడిన ఈఎల్‌ఎస్‌ఎస్ పథకంలో నాకు పెట్టుబడులు ఉన్నాయి. వీటిని అదే అస్సెట్ మేనేజ్‌మెంట్ నిర్వహించే పన్ను ఆదా ప్రయోజం లేని ఇతర ఈక్విటీ పథకంలోకి మార్చుకోవచ్చా? – రవి గుప్తా
ఇందుకు అవకాశం లేదు. ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్‌ఎస్‌ఎస్) పెట్టుబడులకు మూడేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. కనుక ఈ మూడేళ్ల లాకిన్ పూర్తయిన తర్వాతే సదరు ఈఎల్‌ఎస్‌ఎస్ ఫండ్‌లోని పెట్టుబడులను ఇతర పథకంలోకి మార్చుకునేందుకు వీలుంటుంది. ఒక పథకం నుంచి మరో పథకంలోకి పెట్టుబడులు మళ్లించుకోవడాన్ని స్విచింగ్‌గా పిలుస్తారు. అన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు దీన్ని ఆఫర్ చేస్తున్నాయి.
అదే ఏఎంసీకి చెందిన రెండు పథకాల మధ్య పెట్టుబడులను స్విచింగ్ చేసుకోవచ్చు. బ్యాంక్ ఖాతాలోకి పంపించుకుని, ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఇక్కడ ఏర్పడదు. ఈఎల్‌ఎస్‌ఎస్ ఫండ్స్ గడువులోపు (మూడేళ్లు) స్విచింగ్‌ను అనుమతించడం లేదు. ఒకవేళ ఇన్వెస్టర్ మరణించిన సందర్భంలో.. సంబంధిత పెట్టుబడికి కనీసం ఏడాది ముగిసిన తర్వాతే నామినీ ఉపసంహరించుకోవడానికి అనుమతి ఉంటుంది.
- సమాధానాలు - ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్
Comments
Please login to add a commentAdd a comment