భారత ఆర్థిక వ్యవస్థ రుణ భారం పెరుగుతుందని, ఒకవేళ ఏవైనా పెద్ద ఆర్థిక సమస్యలు ఎదురైతే ఇది మరింత పెరగొచ్చని (దిగువ వైపు రిస్క్) ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. దీంతో సార్వభౌమ రేటింగ్ తగ్గుదల రిస్క్ పొంచి ఉన్నట్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. అదే సమయంలో మధ్య కాలానికి సంబంధించి ద్రవ్య కార్యాచరణను కట్టుబడడం, రుణ భారాన్ని తగ్గించుకునే విషయంలో విశ్వాసం పెరిగినట్లు తెలిపింది. ఇది నిర్ణీత కాలానికి సార్వభౌమ రేటింగ్ పరంగా సానుకూలం అని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది.
చివరిసారిగా 2024 ఆగస్ట్‌లో భారత్‌కు బీబీబీ మైనస్-స్టెబుల్ (స్థిరత్వం) రేటింగ్‌ను కొనసాగిస్తున్నట్టు ఫిచ్ రేటింగ్స్ ప్రకటించింది. పెట్టుబడుల పరంగా ఇది కనిష్ట రేటింగ్. 2006 ఆగస్ట్ నుంచి భారత్‌కు ఇదే రేటింగ్‌ను ఫిచ్ కొనసాగిస్తూ వస్తోంది. 2024–25 సంవత్సరానికి జీడీపీలో ద్రవ్యోలోటును 4.8 శాతానికి కట్టడి చేయనున్నట్టు, 2025–26లో దీన్ని 4.4 శాతానికి తగ్గించుకోనున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ బడ్జెట్‌లో ప్రకటించడం తెలిసిందే. ఆర్థిక వృద్ధి బలహీన పడిన తరుణంలోనూ రుణ భారం తగ్గింపునకు ప్రభుత్వం కట్టుబడి ఉండడాన్ని ఫిచ్ రేటింగ్స్ భారత ప్రైమరీ సావరీన్ అనలిస్ట్ జెరేమీ జూక్ ఈ సందర్భంగా ప్రశంసించారు. అంచనాలు వాస్తవికంగా ఉన్నాయంటూ, వాటిని భారత్ సాధించొచ్చని అభిప్రాయపడ్డారు. అయితే బలహీన ఆర్థిక వృద్ధి నేపథ్యంలో ఆదాయం వసూళ్లు చెప్పుకోతగ్గ స్థాయిలో తగ్గిపోవచ్చని హెచ్చరించారు. దీనికి అదనంగా ఖర్చు నియంత్రణ చర్యలు అవసరం కావొచ్చన్నారు.
వృద్ధి తటస్థం
2025–26 బడ్జెట్ వృద్ధికి తటస్థంగా ఉన్నట్టు ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. పన్నుల తగ్గింపుతో వినియోగానికి ఊతమివ్వడం, స్థిరమైన మూలధన వ్యయాలు అనేవి ద్రవ్యలోటు తగ్గింపు ప్రతికూలతలను భర్తీ చేయొచ్చని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. నియంత్రణల తొలగింపు ద్వారా పెట్టుబడులను ఇతోధికం చేసే విధానం మధ్య కాలానికి వృద్ధి సానుకూలమని, విధానాల కచ్చితమైన అమలుపైనే విజయం ఆధారపడి ఉంటుందని పేర్కొంది. వృద్ధి, ద్రవ్యలోటు తగ్గింపు మధ్య సమతుల్యత అన్నది మరింత సవాలుతో కూడినదిగా తెలిపింది. రానున్న సంవత్సరాల్లో అంచనాల కంటే ఆదాయం తక్కువగా ఉండొచ్చని.. కఠినమైన వ్యయ నియంత్రణలు, మూలధన వ్యయ నియంత్రణల ప్రాముఖ్యాన్ని ఇది తెలియజేస్తున్నట్టు పేర్కొంది. మధ్య కాలానికి ద్రవ్యలోటు పట్ల ప్రభుత్వం గొప్ప స్పష్టత ఇచ్చిందని తెలిపింది. 2031 మార్చి నాటికి జీడీపీలో రుణభారాన్ని 50 శాతానికి తగ్గించుకోనున్నట్టు బడ్జెట్‌లో ప్రకటించడాన్ని గుర్తు చేసింది. 2025 మార్చి నాటికి అంచనాలతో పోలి్చతే 7 శాతం తగ్గనుంది.
ఇదీ చదవండి: ఈసారి వడ్డీ రేట్లు తగ్గింపు..?
సావరీన్ రేటింగ్ యథాతథం
వచ్చే ఏడాదికి ద్రవ్య లోటును జీడీపీలో 4.4 శాతానికి కట్టడి చేసేందుకు ఆర్థిక శాఖ ప్రతిపాదించిన నేపథ్యంలో ఇండియా సావరీన్ రేటింగ్‌ను వెంటనే అప్‌గ్రేడ్ చేయబోమని రేటింగ్స్ దిగ్గజం మూడీస్ స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దే బాటలో సమర్థవంత చర్యలకు తెరతీస్తుండటాన్ని సానుకూలంగా పరిగణిస్తున్నట్లు మూడీస్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ క్రిస్టియన్ డి గజ్‌మన్ పేర్కొన్నారు. అయితే ద్రవ్య లోటు కట్టడి, ఆర్థిక క్రమశిక్షణ తదితరాల కారణంగా మెరుగుపడనున్న రుణ సామర్థ్యం, రుణభారం తదితరాలతో సావరీన్ రేటింగ్ పెంపునకు త్వరపడబోమని తెలియజేశారు. ప్రస్తుతం మూడీస్ దేశీ సావరీన్ రేటింగ్‌ను సుస్థిర ఔట్‌లుక్‌తో బీఏఏఏ3గా కొనసాగిస్తోంది. ఇది కనీస ఇన్వెస్ట్‌మెంట్ గ్రేడ్ రేటింగ్‌కాగా.. తాజా బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి సీతారామన్ ఈ ఏడాది(2024–25) ద్రవ్య లోటు 4.8 శాతానికి పరిమితం కానున్నట్లు అభిప్రాయపడ్డారు. 2025–26లో 4.4 శాతానికి కట్టడి చేసే ప్రణాళికలు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment