
బ్యాంకు ఉద్యోగులు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సమ్మెకు దిగబోతున్నట్లు తెలిపారు. దాంతో మార్చిలో వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు మూతబడనున్నాయి. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) ఆధ్వర్యంలో మార్చి 24, 25 తేదీల్లో ఈ సమ్మె జరగనుండగా, మార్చి 22, 23 తేదీల్లో వారాంతపు సెలవులు ఉన్నాయి. దాంతో వరుసగా నాలుగు రోజులు సెలవులు వచ్చినట్లయింది. ఆయా తేదీల్లో బ్యాంకింగ్ సేవల కోసం వెళ్లే వినియోగదారులు ఈ విషయాన్ని గమనించాల్సి ఉంది.
సమ్మె ఎందుకంటే..
తొమ్మిది బ్యాంకు యూనియన్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న యూఎఫ్‌బీయూ అనేక డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మెకు పిలుపునిచ్చింది.
ఐదు రోజుల పని వారం: ప్రపంచ బ్యాంకింగ్ విధానాలకు అనుగుణంగా వారానికి ఐదు రోజుల పనిదినాలను ఉద్యోగులు సూచిస్తున్నారు. అయితే ప్రస్తుతం రెండు, నాలుగో శనివారం మాత్రమే సెలవు ఉంది.
తగినన్ని నియామకాలు: తక్కువ సిబ్బందితో నిత్యం బ్యాంకింగ్ కార్యకలాపాలపై ఒత్తిడి పెరుగుతోంది. ఇది ఉద్యోగులపై పనిభారాన్ని పెంచుతుంది. వెంటనే తగినన్ని నియామకాలు చేపట్టాలి.
భద్రతా చర్యలు: బ్యాంకు సిబ్బందిపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో మెరుగైన భద్రతా చర్యలు తీసుకోవాలి.
విధాన సంస్కరణలు: పనితీరు ఆధారిత ప్రోత్సాహకాలను, మైక్రో మేనేజ్‌మెంట్‌పై ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఇదీ చదవండి: నెలకు రూ.82,000 వేతనం.. ఇంటి ఖర్చులు భారం..
బ్యాంకింగ్ సేవలపై ప్రభావం
వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు మూతపడటంతో ఖాతాదారులు తమ ఆర్థిక లావాదేవీలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని మార్కెట్ వర్గాలు సూచిస్తున్నాయి. ఏటీఎంలు, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా పని చేస్తాయని, చెక్ క్లియరెన్స్, లోన్ ప్రాసెసింగ్ వంటి కార్యకలాపాల్లో అంతరాయం ఏర్పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment