
‘వందే భారత్’ రైలులో ప్రయాణించాలని ఎవరికి ఉండదు చెప్పండి? ఆధునిక సౌకర్యాలతో తళతళలాడుతున్న ఈ రైలు ఎక్కాలని చాలామంది తహతహలాడిపోతుంటారు. అయితే ఈ రైలులోని కొన్ని సాంకేతిక విషయాలు తెలియక కొందరు చిక్కుల్లో పడుతున్నారు.
సాధారణంగా మన ఇంట్లో ఎవరైనా రైలు ప్రయాణానికి బయలుదేరినప్పుడు వారిని దిగబెట్టేందుకు తోడుగా ఎవరో ఒకరు వెళుతుంటారు. ఇదేవిధంగా ఒక భర్త తన భార్యను వందేభారత్ రైలు ఎక్కించేందుకు వెళ్లాడు. ఆమె తన సీటులో కూర్చున్నాక భర్త కూడా ఆమె పక్కనే కూర్చున్నాడు. అయితే ఇంతలో వారుంటున్న కోచ్ డోర్ ఆటోమేటిక్‌గా క్లోజ్ అయిపోయింది. మరి అప్పుడేం జరిగింది?
వివరాల్లోకి వెళితే ఒక మహిళ తన కుమార్తె దగ్గర ఉండేందుకు తొలిసారిగా వందే భారత్ రైలులో గుజరాత్‌లోని వడోదర నుంచి ముంబైకి బయలుదేరింది. ఆ మహిళకు తోడుగా స్టేషన్ వరకూ ఆమె భర్త వచ్చాడు. లగేజీని ఆమె కూర్చున్న సీటు దగ్గర ఉంచి, కాసేపు కూర్చున్నాడు. ఇంతలో రైలు తలుపులు మూసుకుపోయిన శబ్ధం వినిపించింది. ఆ వ్యక్తి రైలు దిగకముందే డోర్ మూసుకుపోయింది. దీంతో ఆ వ్యక్తి టీసీతో మాట్లాడి రైలును ఆపాలనుకున్నాడు. అయితే అప్పటికే ఆలస్యం కావడంతో రైలు వేగం అందుకుంది. దీంతో ఆ వ్యక్తి తనకు ఇష్టం లేకపోయినా తదుపరి స్టేషన్ వచ్చే వరకు ప్రయాణించవలసి వచ్చింది. అతని కుమార్తె తన ‘ఎక్స్’ హ్యాండిల్‌లో ఈ విషయాన్ని తెలియజేసింది.
ఈ పోస్ట్‌ను ఇప్పటివరకూ కొన్ని లక్షలమంది వీక్షించారు. ఈ పోస్ట్ చూసిన ఒక యూజర్.. ‘అతను స్టేషన్‌లోని నో పార్కింగ్ జోన్‌లో పెట్టిన తన కారు గురించి ఆందోళన చెందుతున్నాడేమోనని’ రాయగా, మరొక యూజర్ ‘ఇది అతనికి అందమైన జ్ఞాపకంగా మిగులుతుందని’ రాశాడు. మరో యూజర్ ‘అతనింకా ఆటోమేటిక్ డోర్‌కు అలవాటుపడలేదని’ పేర్కొన్నాడు.
My mother is travelling for the first time in Vande Bharat from Vadodara to Mumbai today to visit me. As it is going to be a longer stay, she had two big bags to travel with. (1/4)
— Kosha (@imkosha) April 2, 2024