నేడు బ్యాంకింగ్ సమ్మె
వేతనాలుసహా పలు సమస్యల పరిష్కారానికి డిమాండ్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల కార్యకలాపాలు మంగళవారం దేశవ్యాప్తంగా నిలిచిపోనున్నాయి. వేతన సంబంధ అంశాలుసహా పలు సమస్యల పరిష్కారానికి యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) గొడుకు కింద పలు యూనియన్ల బ్యాంకింగ్ ఉద్యోగులు సమ్మెబాట పట్టడమే దీనికి కారణం. కాగా ప్రైవేటు రంగంలోని ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్, కొటక్ మహీంద్రా వంటి బ్యాంకులు పనిచేసినా... చెక్ క్లియరెన్సుల విషయంలో కొంత ఇబ్బంది తలెత్తే అవకాశం ఉందని భావిస్తున్నారు. మంగళవారం సమ్మె ప్రభావం గురించి ఎస్బీఐ, పీఎన్బీ, బీఓబీసహా పలు బ్యాంకులు ఇప్పటికే తమ కస్టమర్లకు వివరించాయి. దేశంలోని మొత్తం బ్యాంకింగ్ వ్యాపారంలో 75 శాతం వాటా 27 ప్రభుత్వ రంగ బ్యాంకులది కావడం గమనార్హం.
బీఎంఏ నో..: సమ్మెకు నేతృత్వం వహిస్తున్న యూఎఫ్‌బీయూ 9 యూనియన్లకు నేతృత్వం వహిస్తోంది. దాదాపు 10 లక్షల మందికి సభ్యత్వం ఉన్నట్లు పేర్కొంటోంది. కాగా భారతీయ మజ్దూర్ సంఘ్(బీఎంఏ) అనుబంధ సంఘాలు.. నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్, నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ ఆఫీసర్స్ సమ్మెలో పాల్గొనడంలేదు.
సమ్మె తప్పడం లేదు: ఏఐబీఓసీ
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి బ్యాంక్ మేనేజ్మెంట్ ప్రత్యేకించి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) నుంచి తగిన స్పందన లేకపోవడంతో సమ్మె చేయాల్సి వస్తోందని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (ఏఐబీఓసీ) జనరల్ సెక్రటరీ హర్వీందర్ సింగ్ తెలిపారు. ఫిబ్రవరి 21వ తేదీన ఐబీఏ, బ్యాంక్ యూనియన్లు, చీఫ్ లేబర్ కమిషనర్ మధ్య చర్చలు విఫలమయ్యాయని ఏఐబీఓసీ జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం పేర్కొన్నారు.
డిమాండ్లు ఇవీ...
⇒ బ్యాంకింగ్ రంగంలో పర్మినెంట్ ఉద్యోగాలకు ఔట్సోర్సింగ్ విధానాన్ని ఎంచుకోవడం సరికాదు.
⇒ నవంబర్‌లో పెద్ద నోట్ల రద్దు అనంతరం పనిచేసిన అదనపు గంటలకు సంబంధించి ఉద్యోగులు, అధికారులకు తగిన పరిహారం ఇవ్వాలి.
⇒ బ్యాంక్ ఉద్యోగులకు తదుపరి వేతన సవరణ ప్రక్రియను త్వరగా ప్రారంభించాలి.
⇒ అన్ని విభాగాల్లో తగిన రిక్య్రూట్మెంట్లు జరగాలి.
⇒ మొండిబకాయిల పరిష్కారానికి కఠిన చర్యలు తీసుకోవాలి. టాప్ ఎగ్జిక్యూటివ్‌లను ఇందుకు బాధ్యులుగా చేయాలి. ఉద్దేశపూర్వక ఎగవేతదారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి.