క్రెడిట్ కార్డ్‌ క్లోజింగ్‌.. ఆర్బీఐ రూల్స్‌ తెలుసా? | How to close credit card what are the RBI rules | Sakshi
Sakshi News home page

క్రెడిట్ కార్డ్‌ క్లోజింగ్‌.. ఆర్బీఐ రూల్స్‌ తెలుసా?

Published Thu, Aug 15 2024 7:06 PM | Last Updated on Thu, Aug 15 2024 8:11 PM

How to close credit card what are the RBI rules

ఈరోజుల్లో చాలా మందికి ఒకటి మించి క్రెడిట్‌ కార్డులు ఉండటం సాధారణమైపోయింది. బ్యాంకులు, ప్రవేటు సంస్థలు ఇబ్బడిముబ్బడిగా క్రెడిట్‌ కార్డులు జారీ చేస్తుండటంతో అవసరం లేకున్నా కొన్ని సార్లు క్రెడిట్‌ కార్డులు తీసుకుంటుంటారు. వీటికి వార్షిక రుసుములు లేకపోతే సమస్య లేదు కానీ, ఒక వేళ రుసుము చెల్లించాల్సి ఉంటే అవసరం లేనివాటిని క్లోజ్‌ చేసుకోవడం మంచిది. అయితే వీటిని ఎలా క్లోజ్‌ చేసుకోవాలి.. ఆర్బీఐ నిబంధనలు ఏమిటీ అన్న విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం..

ఆర్బీఐ నిబంధనలు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం.. కస్టమర్ క్రెడిట్ కార్డ్‌ను క్లోజ్‌ చేయాలని అభ్యర్థిస్తే.. సదరు బ్యాంకు, సంస్థ దానిని 7 రోజుల్లోపు అమలు చేయాలి. కార్డును జారీ చేసే బ్యాంకు లేదా సంస్థ అలా చేయలేకపోతే, 7 రోజుల వ్యవధి తర్వాత, దానిపై రోజుకు రూ. 500 జరిమానాను కస్టమర్‌కు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మీ క్రెడిట్ కార్డ్‌లో ఎలాంటి బకాయిలు ఉండకూడదు.

క్రెడిట్ కార్డును క్లోజ్‌ చేయండిలా..

» ఏదైనా క్రెడిట్ కార్డ్‌ని మూసివేసే ముందు దాని బకాయిలన్నింటినీ చెల్లించాలి. బకాయిలు ఎంత చిన్న మొత్తం అయినప్పటికీ, బకాయి మొత్తాన్ని చెల్లించే వరకు క్రెడిట్ కార్డ్ క్లోజ్‌ చేసేందుకు వీలుండదు.

» క్రెడిట్ కార్డ్‌ను మూసివేయాలనే తొందరలో చాలా మంది తమ రివార్డ్ పాయింట్‌లను రీడీమ్ చేయడం మర్చిపోతుంటారు. కార్డ్‌ను మూసివేసేటప్పుడు రివార్డ్ పాయింట్‌లను తప్పనిసరిగా రీడీమ్ చేసుకోండి

» కొంతమంది బీమా ప్రీమియం, ఓటీటీ నెలవారీ ఛార్జ్ వంటి పునరావృత చెల్లింపుల కోసం క్రెడిట్ కార్డ్‌పై స్టాండింగ్ సూచనలను పెట్టుకుంటుంటారు. కార్డ్‌ను మూసివేయడానికి ముందు, దానిపై అలాంటి సూచనలేవీ లేవని నిర్ధారించుకోండి.

» అన్నీ సరిచూసుకున్నాక క్రెడిట్ కార్డ్ బ్యాంక్‌ను సంప్రదించాలి. క్రెడిట్ కార్డ్‌ మూసివేయడానికి గల కారణాన్ని అడిగితే తెలియజేయాల్సి ఉంటుంది. అనంతరం క్రెడిట్ కార్డ్‌ క్లోజింగ్‌ అభ్యర్థన తీసుకుంటారు. ఒకవేళ బ్యాంక్ ఈమెయిల్ పంపమని అడగవచ్చు. కత్తిరించిన కార్డ్‌ ఫోటోను కూడా ఈమెయిల్ చేయమని అడగవచ్చు.

» క్రెడిట్ కార్డు క్లోజ్‌ చేస్తున్నప్పుడు చేయాల్సిన అతి ముఖ్యమైన పని ఏమిటంటే దానిని ఆ మూల నుంచి ఈ మూల వరకూ క్రాస్‌గా కత్తిరించడం. అలా కాకుండా కార్డును ఎక్కడపడితే అక్కడ పడేయకండి. మీ కార్డు తప్పుడు చేతుల్లోకి వెళితే, దుర్వినియోగం చేసే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement