ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసే సమయంలో కొన్ని సార్లు చిరిగిన నోట్లు వస్తుంటాయి. ఈ చిరిగిన నోట్లను బయట దుకాణదారులకు ఇస్తే తీసుకోరు. దీంతో ఆందోళన మొదలవుతుంది. ఇప్పుడు ఏం చేయాలనే ప్రశ్న మెదులుతుంది. మీకు కూడా అలాంటి సంఘటన జరిగితే చింతించాల్సి పని లేదు. చిరిగిన నోట్లను సులభంగా మార్చుకోవచ్చు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిబంధనల ప్రకారం.. ఏటీఎం నుంచి చిరిగిన నోట్లు బయటకు వస్తే వాటిని మార్చేందుకు బ్యాంకు నిరాకరించకూడదు. నోట్లను మార్చుకోవడానికి బ్యాంకులో సుదీర్ఘ ప్రక్రియ ఉండదు. నిమిషాల్లో నోట్లు మార్చుకోవచ్చు. చిరిగిన నోట్లు ఏ ఏటీఎం నుండి వచ్చాయో ఆ ఏటీఎంకి లింక్ చేసిన బ్యాంక్‌కి తీసుకెళ్లి డబ్బు విత్‌డ్రా చేసిన తేదీ, సమయం, విత్ డ్రా చేసిన ఏటీఎం వివరాలతో ఫారం నింపి అందజేయాలి.
ఏటీఎంలో వచ్చినవే కాకుండా ఇతర చిరిగిపోయిన, పాడైపోయిన నోట్లను కూడా బ్యాంక్ బ్రాంచ్ లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయాల్లో సులభంగా మార్చుకోవచ్చు. అయితే దీనికి పరిమితిని నిర్ణయించారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. ఒక వ్యక్తి ఒకసారికి గరిష్టంగా 20 నోట్లను మార్చుకోవచ్చు. అలాగే వాటి విలువ రూ. 5000 మించకూడదు. మార్పిడి చేసుకునే చిరిగిన, పాడైన నోట్లపై ముఖ్యమైన సమాచారం కచ్చితంగా ఉండాలి.
దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అత్యాధునిక నోట్ సెట్టింగ్ మెషీన్‌లతో బ్యాంకులోని నోట్ల నాణ్యతను తనిఖీ చేస్తుందని తెలిపింది. దీంతో చిరిగిన లేదా దెబ్బతిన్న నోట్లు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఒకవేళ ఖాతాదారుడికి ఏటీఎం నుంచి చిరిగిన నోట్లు వస్తే, బ్యాంకుకు చెందిన ఏదైనా బ్రాంచ్‌కైనా వెళ్లి వాటిని మార్చుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment