Fitch Company
-
డిపాజిట్ రేట్ల షాక్: తగ్గనున్న బ్యాంకింగ్ మార్జిన్లు
ముంబై: డిపాజిట్ రేట్ల పెరుగుదల నేపథ్యంలో బ్యాంకులు వచ్చే ఆర్థిక సంవత్సరం (2023-24) మార్జిన్ల ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉందని గ్లోబల్ రేటింగ్ దిగ్గజం-ఫిచ్ తన తాజా నివేదికలో పేర్కొంది. రానున్న మార్చితో ముగిసే 2022-23 ఆర్థిక సంవత్సరంలో సగటు నికర వడ్డీ మార్జిన్ (ఎన్ఐఎం) 3.55 ఉంటే, 2023-24లో ఇది 3.45 శాతానికి తగ్గుతుందన్నది ఫిచ్ అంచనా. సుస్థిర అధిక రుణవృద్ధికి మద్దతు ఇవ్వడానికి పలు బ్యాంకులు భారీగా డిపాజిట్ల సేకరణకు మొగ్గుచూపుతుండడం తాజా ఫిచ్ నివేదిక నేపథ్యం. 2016-17 ఆర్థిక సంవత్సరం నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరంలో సగటు నికర వడ్డీమార్జిన్ 3.1 శాతం అని పేర్కొన్న ఫిచ్, తాజా అంచనా గణాంకాలు అంతకుమించి ఉన్న విషయాన్ని ప్రస్తావించింది. నివేదికలో మరిన్ని విశేషాలు చూస్తే.. ► మార్జిన్లో 10 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) తగ్గుదల అంటే సమీప కాలంలో బ్యాంకుల లాభదాయకతను ప్రభావితం చేసే అవకాశం లేదు. అధిక రుణ వృద్ధి వల్ల అధిక ఫీజు ఆదాయం రూపంలో వస్తుంది. అలాగే ట్రజరీ బాండ్ల ద్వారా లాభాలూ ఒనగూరుతాయి. వెరసి ఆయా అంశాలు తగ్గనున్న మార్జిన్ల ఒత్తిళ్లను సమతూకం చేస్తాయి. అదే విధంగా బ్యాంకింగ్ మూలధన పటిష్టతకూ మద్దతునిస్తాయి. ► ఇక రిటైల్ అలాగే సూక్ష్మ, లఘు, చిన్న, మధ్య (ఎంఎస్ఎంఈ) తరహా పరిశ్రమలకు ఇచ్చే రుణాలపై వడ్డీరేటును నెమ్మదిగా పెంచినా, కార్పొరేట్ రుణ రేటును బ్యాంకులు క్రమంగా పెంచే వీలుంది. ఇది మార్జిన్ల ఒత్తిళ్లను తగ్గించే అంశం. ► 2022-23 ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో రుణ వృద్ధి సగటును 17.5 శాతం ఉంటే, ఆర్థిక సంవత్సరం మొత్తంలో ఈ రేటు 13 శాతంగా నమోదుకావచ్చు. రుణ డిమాండ్ క్రమంగా పుంజుకోవడం దీనికి నేపథ్యం. -
అదానీ రుణ మదింపులో సవరణ
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ దిగ్గజం అదానీ గ్రూప్ రుణాలపై ఫిచ్ గ్రూప్ కంపెనీ క్రెడిట్‌సైట్స్ తాజాగా మాట మార్చింది. అదానీ గ్రూప్ యాజమాన్యంతో చర్చల తదుపరి రెండు కంపెనీల రుణ మదింపులో పొరపాట్లు జరిగినట్లు కొత్తగా జారీ చేసిన నోట్లో పేర్కొంది. అయితే గ్రూప్ అధిక రుణ భారాన్ని మోస్తున్నట్లు తెలియజేసింది. దీంతో తొలుత ఇచ్చి న ఇన్వెస్ట్మెంట్ సిఫారసుల విషయంలో ఎలాంటి మార్పులనూ చేపట్టడంలేదని స్పష్టం చేసింది. అదానీ గ్రూప్‌పై ఆగస్ట్ 23న ప్రకటించిన నివేదికలో రెండు కంపెనీల రుణ మదింపులో పొరపాట్లు జరిగినట్లు క్రెడిట్‌సైట్స్ వెల్లడించింది. గ్రూప్ అత్యంత భారీగా రుణగ్రస్తమైనట్లు గతంలో పేర్కొంది. పరిస్థితులు వికటిస్తే రుణ ఊబిలో కూరుకుపోవడంతోపాటు డిఫాల్ట్ అయ్యే అవకాశమున్నట్లు అభిప్రాయపడింది. కాగా.. తాజా నోట్లో అదానీ గ్రూప్‌నకు అత్యధిక స్థాయిలో రుణాలున్నట్లు మాత్రమే పేర్కొంది. వీటిపై స్పందనగా అదానీ గ్రూప్ నిర్వహణ లాభ నిష్పత్తితో పోలిస్తే నికర రుణభారం మెరుగుపడినట్లు ప్రకటించింది. గ్రూప్‌లోని కంపెనీలు నిలకడగా రుణ భారాన్ని తగ్గించుకుంటున్నట్లు తెలియజేసింది. గత తొమ్మిదేళ్లలో ఇబిటాతో నికర రుణ నిష్పత్తి 7.6 రెట్ల నుంచి 3.2 రెట్లకు తగ్గినట్లు వివరించింది. పొరపాట్లు ఇలా అదానీ గ్రూప్‌లోని అదానీ ట్రాన్స్మిషన్, అదానీ పవర్ రుణాల విషయంలో లెక్కల్లో తప్పులు దొర్లినట్లు క్రెడిట్‌సైట్స్ పేర్కొంది. అదానీ ట్రాన్స్మిషన్ ఇబిటా అంచనాలను తాజాగా రూ. 4,200 కోట్ల నుంచి రూ. 5,200 కోట్లకు సవరించింది. ఇక అదానీ పవర్ స్థూల రుణ అంచనాలను రూ. 58,200 కోట్ల నుంచి రూ. 48,900 కోట్లకు తగ్గించింది. అయితే ఈ సవరణలతో ఇన్వెస్ట్మెంట్ రికమండేషన్స్‌లో ఎలాంటి మార్పులనూ చేపట్టలేదని క్రెడిట్‌సైట్స్ తెలియజేసింది. -
భారత్ ఎకానమీపై మా వైఖరి మారదు
సాక్షి, న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థపై ఇప్పటికిప్పుడు తమ వైఖరిని మార్చుకోబోమని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం– స్టాండెర్డ్ అండ్ పూర్స్ (ఎస్అండ్పీ) స్పష్టం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవ వత్సరం (2020 ఏప్రిల్–2021 మార్చి) తమ క్షీణ అంచనాను 9 శాతంగానే కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. భారత్ ఆర్థిక వ్యవస్థకు ఇంకా కరోనా కష్టాలు కొనసాగుతున్నాయని, స్థూల దేశీయోత్పత్తిపై ఇవి ప్రభావం చూపడానికే అధిక అవకాశాలు ఉన్నాయని సూచించింది. మహమ్మారి కేసులు తగ్గుతున్నాయా? లేదా పెరుగుతున్నా యా? అన్న అంశంపై భవిష్యత్ ఎకానమీ పనితీరు ఆధారపడి ఉంటుందని విశ్లేషించింది. ఎస్అండ్పీ విడుదల చేసిన తాజా నివేదికలో ముఖ్యాంశాలు చూస్తే... వచ్చే ఆర్థిక సంవత్సరం భారత్ 10 శాతం వృద్ధిని నమోదుచేసుకుంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంపై మా అంచనాలను మార్చుకునే ముందు కరోనా కేసుల సంఖ్యలో స్థిరత్వం లేక తగ్గుదల వంటి అంశాలను పరిశీలించాలి. అలాగే మూడవ త్రైమాసికానికి (అక్టోబర్–డిసెంబర్) సంబంధించిన కీలక ఆర్థిక గణాలను పరిగణనలోకి తీసుకోవాలి. రిటైల్ ద్రవ్యోల్బణం సవాలుగా ఉంది. కేంద్రం ప్రకటించిన ఆర్థిక ఉద్దీపనలు విస్తృత ప్రాతిపదికన ఫలితాలను ఇచ్చేలా కనిపించడం లేదు. ఇప్పటికే ప్రకటించిన చర్యలు దిగువ ఆదాయ కుటుంబాలను ఉద్దేశించిన తీసుకున్నవి. మరోవైపు ద్రవ్యోల్బణం తీవ్రత ఆర్బీఐ రేట్ల కోత అవకాశాలను కట్టడి చేస్తున్నాయి. ఖర్చు చేయడం మళ్లీ మొదలవుతుంది: ఫిచ్ కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో భారత్‌లో ఈ ఏడాది వ్యయాలు తగ్గించుకున్న వినియోగదారులు వచ్చే ఏడాది మళ్లీ ఖర్చు చేయడంపై దృష్టి పెట్టనున్నారని, దీంతో 2021లో వినియోగదారుల వ్యయం 6.6 శాతం మేర వృద్ధి చెందే అవకాశం ఉందని ఫిచ్ సొల్యూషన్స్ ఒక నివేదికలో పేర్కొంది. ‘‘ఆహారం, ఆల్కహాల్యేతర పానీయాలపై ఖర్చు చేయడానికి 2020లో కుటుంబాలు తమ బడ్జెట్లో అత్యంత ప్రాధాన్యమిచ్చాయి. రాబోయే రోజుల్లోనూ వీటిపై ఖర్చు చేయడం సానుకూలంగానే ఉండనున్నప్పటికీ 2020తో పోలిస్తే స్వల్పంగా తగ్గొచ్చు’’ అని ఫిచ్ వివరించింది. -
టెలికం రంగం.. ప్రతికూలమే
* రిలయన్స్ జియో ప్రవేశమే ప్రధాన కారణం * రేటింగ్‌ను తగ్గించిన ఫిచ్ సంస్థ న్యూఢిల్లీ: భారత టెలికం రంగంలో రానున్న కాలం సమస్యాత్మకమేనని అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ఫిచ్ పేర్కొంది. ముకేశ్ అంబానీ గ్రూప్‌కు చెందిన రిలయన్స్ జియో ప్రవేశిస్తుండడమే దీనికి ప్రధాన కారణమని పేర్కొంది. అందుకే భారత టెలికాం రంగం అవుట్‌లుక్ రేటింగ్‌ను స్థిరత్వం నుంచి ప్రతికూలానికి తగ్గించామని వివరించింది. రిలయన్స్ జియో ప్రవేశం వల్ల పోటీ మరింత తీవ్రమవుతుందని, అగ్రశ్రేణి నాలుగు కంపెనీల రుణ భారాలపై అధిక ఒత్తిడి తప్పదని పేర్కొంది. టెలికాం రంగం భవిష్యత్‌పై ఫిచ్ ముఖ్యాంశాలు.., * కొత్తగా రంగంలోకి వస్తున్న రిలయన్స్ జియో మార్కెట్ వాటా పెంచుకోవడానికి చౌక డేటా టారిఫ్‌లను ఆఫర్ చేసే అవకాశాలున్నాయి. ఫలితంగా డేటా టారిఫ్‌లు కనీసం 15-20 శాతం వరకూ పడిపోతాయి. * డేటా వినియోగం పెరిగి, వాయిస్ కాల్స్ తగ్గుతాయి. ఫలితంగా వాయిస్‌కు సంబంధించి ఒక్కో వినియోగదారుడి నుంచి వచ్చే సగటు ఆదాయం(ఏఆర్పీయూ) తగ్గిపోయే అవకాశముంది. గత ఏడాది రూ.170గా ఉన్న నెలవారీ ఏఆర్పీయూ 5-6 శాతం తగ్గి రూ.160కు పడిపోవచ్చు. * దండిగా నిధులు, తగినంతగా స్పెక్ట్రమ్ ఉండటంతో రిలయన్స్ జియో వేగవంతమైన డేటా ప్లాన్లను చౌకగా అందించగలుగుతుంది. వచ్చే ఏడాది మొదటి మూడు నెలల కాలంలో రిలయన్స్ జియో 4జీ డేటా సర్వీసులను అందించే అవకాశాలున్నాయి. * టెలికంలో అగ్రస్థానంలో ఉన్న నాలుగు కంపెనీలు తమ వినియోగదారులు రిలయన్స్ జియోకు మారిపోకుండా ఉండడం కోసం డిస్కౌంట్లు, ప్రమోషన్లను ఆఫర్ చేస్తాయి.