టెలికం రంగం.. ప్రతికూలమే
* రిలయన్స్ జియో ప్రవేశమే ప్రధాన కారణం
* రేటింగ్‌ను తగ్గించిన ఫిచ్ సంస్థ
న్యూఢిల్లీ: భారత టెలికం రంగంలో రానున్న కాలం సమస్యాత్మకమేనని అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ఫిచ్ పేర్కొంది. ముకేశ్ అంబానీ గ్రూప్‌కు చెందిన రిలయన్స్ జియో ప్రవేశిస్తుండడమే దీనికి ప్రధాన కారణమని పేర్కొంది. అందుకే భారత టెలికాం రంగం అవుట్‌లుక్ రేటింగ్‌ను స్థిరత్వం నుంచి ప్రతికూలానికి తగ్గించామని వివరించింది.
రిలయన్స్ జియో ప్రవేశం వల్ల పోటీ మరింత తీవ్రమవుతుందని, అగ్రశ్రేణి నాలుగు కంపెనీల రుణ భారాలపై అధిక ఒత్తిడి తప్పదని పేర్కొంది. టెలికాం రంగం భవిష్యత్‌పై ఫిచ్ ముఖ్యాంశాలు..,
* కొత్తగా రంగంలోకి వస్తున్న రిలయన్స్ జియో మార్కెట్ వాటా పెంచుకోవడానికి చౌక డేటా టారిఫ్‌లను ఆఫర్ చేసే అవకాశాలున్నాయి. ఫలితంగా డేటా టారిఫ్‌లు కనీసం 15-20 శాతం వరకూ పడిపోతాయి.
* డేటా వినియోగం పెరిగి, వాయిస్ కాల్స్ తగ్గుతాయి. ఫలితంగా వాయిస్‌కు సంబంధించి ఒక్కో వినియోగదారుడి నుంచి వచ్చే సగటు ఆదాయం(ఏఆర్‌పీయూ) తగ్గిపోయే అవకాశముంది. గత ఏడాది రూ.170గా ఉన్న నెలవారీ ఏఆర్‌పీయూ 5-6 శాతం తగ్గి రూ.160కు పడిపోవచ్చు.
* దండిగా నిధులు, తగినంతగా స్పెక్ట్రమ్ ఉండటంతో రిలయన్స్ జియో వేగవంతమైన డేటా ప్లాన్‌లను చౌకగా అందించగలుగుతుంది. వచ్చే ఏడాది మొదటి మూడు నెలల కాలంలో రిలయన్స్ జియో 4జీ డేటా సర్వీసులను అందించే అవకాశాలున్నాయి.
* టెలికంలో అగ్రస్థానంలో ఉన్న నాలుగు కంపెనీలు తమ వినియోగదారులు రిలయన్స్ జియోకు మారిపోకుండా ఉండడం కోసం డిస్కౌంట్లు, ప్రమోషన్లను ఆఫర్ చేస్తాయి.