Indian telecom sector
-
దేశీ టెల్కోల్లో..టెక్‌చల్!
న్యూఢిల్లీ: దేశీ టెలికం సంస్థల్లో వాటాలు దక్కించుకోవడంపై అమెరికన్ టెక్నాలజీ దిగ్గజాలు దృష్టి పెడుతున్నాయి. పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో భాగమైన జియో ప్లాట్‌ఫామ్స్‌లో మైక్రోసాఫ్ట్; వొడాఫోన్ ఐడియాపై గూగుల్ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే వీటి వివరాలు వెల్లడవుతాయని పరిశ్రమవర్గాల సమాచారం. మైక్రోసాఫ్ట్–జియో జోడీ.. రిలయన్స్ ఇండస్ట్రీస్ డిజిటల్, టెలికం వ్యాపార విభాగాన్ని విడగొట్టి ఏర్పాటు చేసిన జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. తాజాగా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్, అబుధాబికి చెందిన ముబాదలా ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కూడా రంగంలోకి దిగాయి. జియో ప్లాట్‌ఫామ్స్‌లో మైక్రోసాఫ్ట్ సుమారు 2.5% వాటాల కోసం దాదాపు 2 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయవచ్చని సమాచారం. దేశీయంగా అతి పెద్ద టెలికం సేవల సంస్థల్లో ఒకటైన జియో కూడా జియో ప్లాట్‌ఫామ్స్‌లో భాగమే. ఇప్పటిదాకా ఫేస్బుక్, సిల్వర్ లేక్, విస్టా ఈక్విటీ పార్ట్నర్స్, జనరల్ అట్లాంటిక్, కేకేఆర్ వంటి దిగ్గజాలు దాదాపు 10 బిలియన్ డాలర్లపైగా ఇన్వెస్ట్ చేసింది. ఈ పెట్టుబడుల ఊతంతో జియోను విదేశాల్లో లిస్టింగ్ చేసే యోచనలో కూడా రిలయన్స్ ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే రిలయన్స్ జియో, మైక్రోసాఫ్ట్ మధ్య ఒక భాగస్వామ్యం ఉంది. క్లౌడ్ సేవల మైక్రోసాఫ్ట్ అజూర్‌కు సంబంధించి ఒప్పందం ఉంది. మరోవైపు, జియోలో పెట్టుబడులు పెట్టడంపై ముబాదలా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా వచ్చిన పెట్టుబడులను బట్టి జియో ప్లాట్‌ఫామ్స్ సంస్థ విలువ దాదాపు రూ. 5.61 లక్షల కోట్లుగా ఉంది. వొడా–గూగుల్ జట్టు.. ఆర్థిక సంక్షోభ పరిస్థితులతో సతమతమవుతున్న వొడాఫోన్ ఐడియాలో ఇన్వెస్ట్ చేయాలని సెర్చి ఇంజిన్ దిగ్గజం గూగుల్ ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. దాదాపు 5 శాతం వాటాలు కొనుగోలు చేయాలని యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, ప్రస్తుతం ఇందుకు సంబంధించిన చర్చలు ప్రాథమిక స్థాయిలోనే ఉన్నాయని వివరించాయి. మరోపక్క, గూగుల్ మాతృసంస్థ అల్ఫాబెట్ కూడా అటు జియోలోనూ వాటాలు కొనుగోలు చేసేందుకు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇప్పటికీ ఇవి జరుగుతూనే ఉన్నప్పటికీ, డీల్ విషయంలో మాత్రం ప్రత్యర్థి సంస్థలతో పోటీలో గూగుల్ వెనుకబడిందనేది పరిశ్రమవర్గాల మాట. వేల కోట్ల నష్టాలు, రుణాల భారంతో మనుగడ ప్రశ్నార్థకంగా మారిన వొడాఫోన్ ఐడియాలో ఒకవేళ గూగుల్ గానీ ఇన్వెస్ట్ చేసిన పక్షంలో కంపెనీకి గణనీయంగా ఊరట లభించనుంది. టెలికం శాఖ గణాంకాల ప్రకారం లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల బాకీల కింద కేంద్రానికి వొడాఫోన్ ఐడియాకు దాదాపు రూ. 53,000 కోట్లు కట్టాల్సి ఉంది. వొడాఫోన్ ఐడియాలో ఇన్వెస్ట్ చేసిన పక్షంలో జియో సహా ఫేస్‌బుక్‌తో కూడా గూగుల్ పోటీ ఎదుర్కొనాల్సి రానుంది. భారత్ కోసం ప్రత్యేక ప్రణాళికలు వేస్తూనే ఉన్న గూగుల్.. తమ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్, మొబైల్ పేమెంట్స్ సేవలు మొదలైన మార్గాల్లో దేశీ మార్కెట్లో కార్యకలాపాలు సాగిస్తోంది. ఎయిర్‌టెల్‌లోనూ విదేశీ పెట్టుబడులు.. టెలికం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్‌లో కూడా ఇటీవలే అంతర్జాతీయ దిగ్గజాలు ఇన్వెస్ట్ చేశాయి. ప్రమోటరు సంస్థ భారతి టెలికం ఇందులో 2.75 శాతం వాటాలను విక్రయించింది. అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు సొసైటీ జనరల్, బ్లాక్‌రాక్, నోర్జెస్ బ్యాంక్, ఫిడిలిటీ ఇన్వెస్ట్మెంట్స్ మొదలైనవి వీటిని కొనుగోలు చేశాయి. యాక్సిస్ మ్యూచువల్ ఫండ్, హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ వంటి సంస్థలూ వాటాలను దక్కించుకున్నాయి. ఈ షేర్ల విక్రయం ద్వారా భారతి టెలికం రూ. 8,433 కోట్లు సమీకరించింది. -
ఎయిర్‌సెల్ దివాలా!
న్యూఢిల్లీ: టెలికం రంగంలో తీవ్ర పోటీ నేపథ్యంలో ఎయిర్‌సెల్ దివాలా ప్రకటించింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో కంపెనీ ఈ మేరకు పిటీషన్ దాఖలు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కొత్త సంస్థ (జియో) రాకతో పోటీ తీవ్రమవడం, చట్ట.. నియంత్రణ సంస్థలపరమైన సవాళ్లు, పెరిగిపోయిన రుణభారం, భారీ నష్టాలు మొదలైన వాటి కారణంగా ’వ్యాపారంపైనా, పరపతిపైనా గణనీయంగా ప్రతికూల ప్రభావం’ పడినట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. దివాలా చట్టం 2016లోని సెక్షన్ 10 కింద ఎయిర్‌సెల్ సెల్యులార్, డిష్‌నెట్ వైర్లెస్, ఎయిర్‌సెల్ లిమిటెడ్ సంస్థలు కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రక్రియ చేపట్టాలంటూ దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపింది. అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి.. వైర్లెస్ వ్యాపారాన్ని ఇతర టెల్కోలో విలీనం చేయడానికి ప్రయత్నించినా సాధ్యపడలేదని ఎయిర్‌సెల్ తెలిపింది. అటుపైన రుణపునర్వ్యవస్థీకరణ, నిధుల సమీకరణ అంశాలపై రుణదాతలు, షేర్హోల్డర్లతో సుదీర్ఘ చర్చలు జరిపినా ఏకాభిప్రాయం కుదరలేదని వివరించింది. వ్యూహాత్మక రుణ పునర్వ్యవస్థీకరణ పథకం కూడా పనిచేయకపోవడంతో.. దివాలా చట్టం కింద పరిష్కార ప్రక్రియ ఒక్కటే తగిన మార్గంగా విశ్వసిస్తున్నట్లు ఎయిర్‌సెల్ తెలిపింది. సీఐఆర్‌పీ అనేది.. కంపెనీని విక్రయించే ప్రక్రియ కాబోదని ఎయిర్‌సెల్ స్పష్టం చేసింది. ఉద్యోగులతో పాటు రుణదాతలు, సరఫరా సంస్థలు మొదలైన వర్గాల ప్రయోజనాలను పరిరక్షించేలా మెరుగైన పరిష్కారమార్గాన్ని కనుగొనే ఉద్దేశంతోనే దీనివైపు మొగ్గు చూపినట్లు పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ నిరంతరాయంగా సర్వీసులు అందించేందుకు ప్రయత్నిస్తూనే ఉంటామన్న ఎయిర్‌సెల్.. ’’ప్రస్తుత కష్టకాలంలో’’ తమకు మద్దతుగా నిలవాలంటూ కస్టమర్లకు విజ్ఞప్తి చేసింది. మలేసియా కోటీశ్వరుడు ఆనంద్ కృష్ణన్ సంస్థ మ్యాక్సిస్ కమ్యూనికేషన్స్ .. 2005లో 1 బిలియన్ డాలర్లతో ఎయిర్‌సెల్‌లో మెజారిటీ వాటాలు కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఎయిర్‌సెల్‌లో మ్యాక్సిస్కి 74 శాతం వాటా ఉండగా.. రూ. 15,500 కోట్ల మేర రుణభారం పేరుకుపోయింది. -
టెలికం రంగం.. ప్రతికూలమే
* రిలయన్స్ జియో ప్రవేశమే ప్రధాన కారణం * రేటింగ్‌ను తగ్గించిన ఫిచ్ సంస్థ న్యూఢిల్లీ: భారత టెలికం రంగంలో రానున్న కాలం సమస్యాత్మకమేనని అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ఫిచ్ పేర్కొంది. ముకేశ్ అంబానీ గ్రూప్‌కు చెందిన రిలయన్స్ జియో ప్రవేశిస్తుండడమే దీనికి ప్రధాన కారణమని పేర్కొంది. అందుకే భారత టెలికాం రంగం అవుట్‌లుక్ రేటింగ్‌ను స్థిరత్వం నుంచి ప్రతికూలానికి తగ్గించామని వివరించింది. రిలయన్స్ జియో ప్రవేశం వల్ల పోటీ మరింత తీవ్రమవుతుందని, అగ్రశ్రేణి నాలుగు కంపెనీల రుణ భారాలపై అధిక ఒత్తిడి తప్పదని పేర్కొంది. టెలికాం రంగం భవిష్యత్‌పై ఫిచ్ ముఖ్యాంశాలు.., * కొత్తగా రంగంలోకి వస్తున్న రిలయన్స్ జియో మార్కెట్ వాటా పెంచుకోవడానికి చౌక డేటా టారిఫ్‌లను ఆఫర్ చేసే అవకాశాలున్నాయి. ఫలితంగా డేటా టారిఫ్‌లు కనీసం 15-20 శాతం వరకూ పడిపోతాయి. * డేటా వినియోగం పెరిగి, వాయిస్ కాల్స్ తగ్గుతాయి. ఫలితంగా వాయిస్‌కు సంబంధించి ఒక్కో వినియోగదారుడి నుంచి వచ్చే సగటు ఆదాయం(ఏఆర్పీయూ) తగ్గిపోయే అవకాశముంది. గత ఏడాది రూ.170గా ఉన్న నెలవారీ ఏఆర్పీయూ 5-6 శాతం తగ్గి రూ.160కు పడిపోవచ్చు. * దండిగా నిధులు, తగినంతగా స్పెక్ట్రమ్ ఉండటంతో రిలయన్స్ జియో వేగవంతమైన డేటా ప్లాన్లను చౌకగా అందించగలుగుతుంది. వచ్చే ఏడాది మొదటి మూడు నెలల కాలంలో రిలయన్స్ జియో 4జీ డేటా సర్వీసులను అందించే అవకాశాలున్నాయి. * టెలికంలో అగ్రస్థానంలో ఉన్న నాలుగు కంపెనీలు తమ వినియోగదారులు రిలయన్స్ జియోకు మారిపోకుండా ఉండడం కోసం డిస్కౌంట్లు, ప్రమోషన్లను ఆఫర్ చేస్తాయి. -
టెలికం రంగంలో ఇక కన్సాలిడేషన్: ఫిచ్
న్యూఢిల్లీ: దేశీయ టెలికం రంగంలో కన్సాలిడేషన్ పరిస్థితులు కనిపిస్తున్నాయని రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ తెలిపింది. ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు బలహీన, చిన్న టెలికం కంపెనీలు ఒకదానితో మరొకటి విలీనం కావడమో లేదా పెద్ద సంస్థలు వాటిని కొనుగోలు చేయడమో జరుగుతుందని పేర్కొంది. విలీన, కొనుగోలు మార్గదర్శకాల సడలింపు కోసం టెల్కోలు ఎదురుచూస్తున్నాయని, ఈ ఏడాది ఆఖరుకు మార్గదర్శకాలు వెల్లడి కావొచ్చని ఫిచ్ తెలిపింది. స్పెక్ట్రం, ఎంఅండ్ఏ విషయాల్లో స్పష్టత కొరవడటం వల్లే కన్సాలిడేషన్ ఇప్పటివరకూ సాధ్యపడలేదని పేర్కొంది. పెద్ద కంపెనీలతో పోటీ కారణంగా చిన్న టెల్కోలు అర్థవంతమైన స్థాయిలో మార్కెట్ వాటాను దక్కించుకోలేకపోతున్నాయని ఫిచ్ వివరించింది. దీర్ఘకాలికంగా భారత్‌లో 6 టెలికం కంపెనీలు మాత్రమే లాభసాటిగా ఉండగలవని వివరించింది. కన్సాలిడేషన్ వల్ల చిన్న కంపెనీల లాభదాయకత మెరుగుపడుతుందని, ఇన్ఫ్రా వ్యయాలతో పాటు డేటా సెగ్మెంట్లో పోటీ తగ్గుతుందని వివరించింది.