న్యూఢిల్లీ: దేశీయ టెలికం రంగంలో కన్సాలిడేషన్ పరిస్థితులు కనిపిస్తున్నాయని రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ తెలిపింది. ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు బలహీన, చిన్న టెలికం కంపెనీలు ఒకదానితో మరొకటి విలీనం కావడమో లేదా పెద్ద సంస్థలు వాటిని కొనుగోలు చేయడమో జరుగుతుందని పేర్కొంది. విలీన, కొనుగోలు మార్గదర్శకాల సడలింపు కోసం టెల్కోలు ఎదురుచూస్తున్నాయని, ఈ ఏడాది ఆఖరుకు మార్గదర్శకాలు వెల్లడి కావొచ్చని ఫిచ్ తెలిపింది. స్పెక్ట్రం, ఎంఅండ్‌ఏ విషయాల్లో స్పష్టత కొరవడటం వల్లే కన్సాలిడేషన్ ఇప్పటివరకూ సాధ్యపడలేదని పేర్కొంది. పెద్ద కంపెనీలతో పోటీ కారణంగా చిన్న టెల్కోలు అర్థవంతమైన స్థాయిలో మార్కెట్ వాటాను దక్కించుకోలేకపోతున్నాయని ఫిచ్ వివరించింది. దీర్ఘకాలికంగా భారత్‌లో 6 టెలికం కంపెనీలు మాత్రమే లాభసాటిగా ఉండగలవని వివరించింది. కన్సాలిడేషన్ వల్ల చిన్న కంపెనీల లాభదాయకత మెరుగుపడుతుందని, ఇన్‌ఫ్రా వ్యయాలతో పాటు డేటా సెగ్మెంట్‌లో పోటీ తగ్గుతుందని వివరించింది.