
న్యూఢిల్లీ: టెలికం రంగంలో తీవ్ర పోటీ నేపథ్యంలో ఎయిర్‌సెల్ దివాలా ప్రకటించింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)లో కంపెనీ ఈ మేరకు పిటీషన్ దాఖలు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కొత్త సంస్థ (జియో) రాకతో పోటీ తీవ్రమవడం, చట్ట.. నియంత్రణ సంస్థలపరమైన సవాళ్లు, పెరిగిపోయిన రుణభారం, భారీ నష్టాలు మొదలైన వాటి కారణంగా ’వ్యాపారంపైనా, పరపతిపైనా గణనీయంగా ప్రతికూల ప్రభావం’ పడినట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. దివాలా చట్టం 2016లోని సెక్షన్ 10 కింద ఎయిర్‌సెల్ సెల్యులార్, డిష్‌నెట్ వైర్‌లెస్, ఎయిర్‌సెల్ లిమిటెడ్ సంస్థలు కార్పొరేట్ ఇన్‌సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రక్రియ చేపట్టాలంటూ దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపింది.
అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి..
వైర్‌లెస్ వ్యాపారాన్ని ఇతర టెల్కోలో విలీనం చేయడానికి ప్రయత్నించినా సాధ్యపడలేదని ఎయిర్‌సెల్ తెలిపింది. అటుపైన రుణపునర్‌వ్యవస్థీకరణ, నిధుల సమీకరణ అంశాలపై రుణదాతలు, షేర్‌హోల్డర్లతో సుదీర్ఘ చర్చలు జరిపినా ఏకాభిప్రాయం కుదరలేదని వివరించింది. వ్యూహాత్మక రుణ పునర్‌వ్యవస్థీకరణ పథకం కూడా పనిచేయకపోవడంతో.. దివాలా చట్టం కింద పరిష్కార ప్రక్రియ ఒక్కటే తగిన మార్గంగా విశ్వసిస్తున్నట్లు ఎయిర్‌సెల్ తెలిపింది. సీఐఆర్‌పీ అనేది.. కంపెనీని విక్రయించే ప్రక్రియ కాబోదని ఎయిర్‌సెల్ స్పష్టం చేసింది. ఉద్యోగులతో పాటు రుణదాతలు, సరఫరా సంస్థలు మొదలైన వర్గాల ప్రయోజనాలను పరిరక్షించేలా మెరుగైన పరిష్కారమార్గాన్ని కనుగొనే ఉద్దేశంతోనే దీనివైపు మొగ్గు చూపినట్లు పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ నిరంతరాయంగా సర్వీసులు అందించేందుకు ప్రయత్నిస్తూనే ఉంటామన్న ఎయిర్‌సెల్.. ’’ప్రస్తుత కష్టకాలంలో’’ తమకు మద్దతుగా నిలవాలంటూ కస్టమర్లకు విజ్ఞప్తి చేసింది. మలేసియా కోటీశ్వరుడు ఆనంద్ కృష్ణన్ సంస్థ మ్యాక్సిస్ కమ్యూనికేషన్స్ .. 2005లో 1 బిలియన్ డాలర్లతో ఎయిర్‌సెల్‌లో మెజారిటీ వాటాలు కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఎయిర్‌సెల్‌లో మ్యాక్సిస్‌కి 74 శాతం వాటా ఉండగా.. రూ. 15,500 కోట్ల మేర రుణభారం పేరుకుపోయింది.