రాజకీయ నాయకుల ఒత్తిడి, జోక్యంతో తన కంపెనీని కోల్పోయానని, తక్కువ మొత్తానికి అమ్మేసుకున్నానని ఎయిర్‌సెల్ వ్యవస్థాపకుడు చిన్నకన్నన్ శివశంకరన్ పేర్కొన్నారు. దశాబ్దం క్రితంతో పోలిస్తే నేటి భారతదేశం చాలా భిన్నంగా ఉందని చెప్పారు.
అప్పట్లో వ్యాపారాలు తీవ్రమైన ఒత్తిళ్లను ఎదుర్కొన్నాయని ఒక పాడ్‌కాస్ట్ షోలో మాట్లాడుతూ చెప్పారు. ఆ సమయంలో ఎవరైనా విజయవంతమైతే అదొక సమస్యగా ఉండేదన్నారు. ‘రాజకీయ నాయకులు జోక్యం చేసుకున్నారు.. నేను నా కంపెనీని కోల్పోయాను’ అని చెప్పుకొచ్చారు. తాను కేవలం రూ.3,400 కోట్లకే కంపెనీని అమ్ముకోవాల్సి వచ్చిందని, అదే ఏటీఅండ్‌టీకి అమ్మి ఉంటే తనకు 8 బిలియన్ డాలర్లు ఆదాయం వచ్చేదని చెప్పారు. ఇప్పట్లా అప్పుడు లేదు. ఒక పారిశ్రామికవేత్త తన కంపెనీని ఒక నిర్దిష్ట వ్యక్తికే విక్రయించాలని ఒత్తిడిని ఎదుర్కోవలసి వచ్చిందని గుర్తు చేసుకున్నారు.
2010లో జరిగిన వేలంలో 3జీ స్పెక్ట్రమ్ వేలంలో ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక, కేరళ, కోల్‌కతా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, పంజాబ్, తమిళనాడు, యూపీ ఈస్ట్, పశ్చిమబెంగాల్ వంటి 13 సర్కిళ్లలో స్పెక్ట్రమ్ కోసం ఎయిర్‌సెల్ రూ. 6,500 కోట్లు చెల్లించింది. 2012 నవంబర్ నాటికి ఈ సంస్థ సుమారు 5 మిలియన్ల 3G వినియోగదారులను కలిగి ఉంది. 3జీలో కీలక పాత్ర పోషించిన ఎయిర్ సెల్ 3జీ టారిఫ్ ను అప్పట్లో భారీగా తగ్గించింది. 2011లో భారతీ ఎయిర్‌టెల్‌తో కలిసి యాపిల్ ఐఫోన్ 4 లాంచ్ భాగస్వామి అయింది.
ఆర్థిక సమస్యల కారణంగా ఎయిర్ సెల్ 2018 ఫిబ్రవరిలో మార్కెట్ నుంచి నిష్క్రమించింది. 2006లో మాక్సిస్ బెర్హాద్ 74 శాతం వాటాను కొనుగోలు చేయడం ద్వారా ఎయిర్ సెల్ ను స్వాధీనం చేసుకుంది. 2011లో తన వాటాను మ్యాక్సిస్ బెర్హాద్ కు విక్రయించాలని తనపై ఒత్తిడి తెచ్చారని చిన్నకన్నన్ శివశంకరన్ ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment