న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ దిగ్గజం అదానీ గ్రూప్ రుణాలపై ఫిచ్ గ్రూప్ కంపెనీ క్రెడిట్‌సైట్స్ తాజాగా మాట మార్చింది. అదానీ గ్రూప్ యాజమాన్యంతో చర్చల తదుపరి రెండు కంపెనీల రుణ మదింపులో పొరపాట్లు జరిగినట్లు కొత్తగా జారీ చేసిన నోట్‌లో పేర్కొంది. అయితే గ్రూప్ అధిక రుణ భారాన్ని మోస్తున్నట్లు తెలియజేసింది. దీంతో తొలుత ఇచ్చి న ఇన్వెస్ట్‌మెంట్ సిఫారసుల విషయంలో ఎలాంటి మార్పులనూ చేపట్టడంలేదని స్పష్టం చేసింది.
అదానీ గ్రూప్‌పై ఆగస్ట్ 23న ప్రకటించిన నివేదికలో రెండు కంపెనీల రుణ మదింపులో పొరపాట్లు జరిగినట్లు క్రెడిట్‌సైట్స్ వెల్లడించింది. గ్రూప్ అత్యంత భారీగా రుణగ్రస్తమైనట్లు గతంలో పేర్కొంది. పరిస్థితులు వికటిస్తే రుణ ఊబిలో కూరుకుపోవడంతోపాటు డిఫాల్ట్ అయ్యే అవకాశమున్నట్లు అభిప్రాయపడింది.
కాగా.. తాజా నోట్‌లో అదానీ గ్రూప్‌నకు అత్యధిక స్థాయిలో రుణాలున్నట్లు మాత్రమే పేర్కొంది. వీటిపై స్పందనగా అదానీ గ్రూప్ నిర్వహణ లాభ నిష్పత్తితో పోలిస్తే నికర రుణభారం మెరుగుపడినట్లు ప్రకటించింది. గ్రూప్‌లోని కంపెనీలు నిలకడగా రుణ భారాన్ని తగ్గించుకుంటున్నట్లు తెలియజేసింది. గత తొమ్మిదేళ్లలో ఇబిటాతో నికర రుణ నిష్పత్తి 7.6 రెట్ల నుంచి 3.2 రెట్లకు తగ్గినట్లు వివరించింది.
పొరపాట్లు ఇలా
అదానీ గ్రూప్‌లోని అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ పవర్ రుణాల విషయంలో లెక్కల్లో తప్పులు దొర్లినట్లు క్రెడిట్‌సైట్స్ పేర్కొంది. అదానీ ట్రాన్స్‌మిషన్ ఇబిటా అంచనాలను తాజాగా రూ. 4,200 కోట్ల నుంచి రూ. 5,200 కోట్లకు సవరించింది. ఇక అదానీ పవర్ స్థూల రుణ అంచనాలను రూ. 58,200 కోట్ల నుంచి రూ. 48,900 కోట్లకు తగ్గించింది. అయితే ఈ సవరణలతో ఇన్వెస్ట్‌మెంట్ రికమండేషన్స్‌లో ఎలాంటి మార్పులనూ చేపట్టలేదని క్రెడిట్‌సైట్స్ తెలియజేసింది.
Comments
Please login to add a commentAdd a comment