
2024లో 6 శాతం పెరిగిన మిలియనీర్లు; 85,698కి చేరిక
191 మంది బిలియనీర్లు
నైట్ ఫ్రాంక్ ‘వెల్త్ రిపోర్ట్ 2025’లో వెల్లడి
న్యూఢిల్లీ: సంపద సృష్టి దన్నుతో దేశీయంగా కుబేరుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. 2024లో 10 మిలియన్ డాలర్లకు పైగా సంపద ఉన్న వ్యక్తుల (హెచ్‌ఎన్‌డబ్ల్యూఐ) సంఖ్య 6 శాతం పెరిగి 85,698కి చేరింది. 2028 నాటికి ఇది 93,753కి చేరుతుందని అంచనా. ఇక అపర కుబేరుల్లాంటి బిలియనీర్ల సంఖ్య మరో 26 పెరిగి 191కి చేరింది. 2019లో బిలియనీర్ల సంఖ్య 7గా ఉండేది.
నైట్ ఫ్రాంక్ విడుదల చేసిన ’ది వెల్త్ రిపోర్ట్ 2025’లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. హెచ్‌ఎన్‌డబ్ల్యూఐల జనాభా పెరుగుతుండటమనేది దీర్ఘకాలికంగా పటిష్టమైన ఆర్థిక వృద్ధి, పెట్టుబడులకు అవకాశాలు పెరుగుతుండటం, లగ్జరీ మార్కెట్ విస్తరిస్తుండటం తదితర అంశాలను సూచిస్తోందని నివేదిక పేర్కొంది. భారతీయ బిలియనీర్ల మొత్తం సంపద సుమారు 950 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా. ఈ విషయంలో అమెరికా (5.7 ట్రిలియన్ డాలర్లు), చైనా (1.34 ట్రిలియన్ డాలర్లు) తర్వాత భారత్ మూడో స్థానంలో ఉంది.
హెచ్‌ఎన్‌డబ్ల్యూఐల విషయంలో భారత్ నాలుగో స్థానంలో ఉంది. అమెరికా (9,05,413 మంది) అగ్రస్థానంలో, చైనా (4,71,634 మంది), జపాన్ (1,22,119 మంది) తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. అంతర్జాతీయంగా చూస్తే 3.7 శాతం మంది హెచ్‌ఎన్‌డబ్ల్యూఐలు భారత్‌లో ఉన్నారు. ‘ఎంట్రప్రెన్యూర్‌షిప్, కొత్త పరిశ్రమల దన్నుతో భారత్‌లో హెచ్‌ఎన్‌డబ్ల్యూఐల సంఖ్య అసాధారణంగా వృద్ధి చెందుతోంది. దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలను, ఆరి్థకంగా ఒడిదుడుకులను తట్టుకుని నిలబడగలిగే సామర్థ్యాలను దేశీయంగా పెరుగుతున్న సంపద సూచిస్తోంది’ అని నైట్ ఫ్రాంక్ ఇండియా
సీఎండీ శిశిర్ బైజల్ తెలిపారు.
హ్యాండ్‌బ్యాగ్‌లపై మక్కువ ..
రియల్ ఎస్టేట్ నుంచి గ్లోబల్ ఈక్విటీల వరకు సంపన్నుల పెట్టుబడుల ధోరణులు కూడా మారుతున్నాయి. ఇందుకు సంబంధించిన నైట్ ఫ్రాంక్ లగ్జరీ ఇన్వెస్ట్‌మెంట్ ఇండెక్స్ (కేఎఫ్‌ఎల్‌ఐఐ) ప్రకారం గతేడాది అయిదు సాధనాలకు మాత్రమే డిమాండ్ నెలకొంది. అభిరుచులను బట్టి సంపన్నులు పెట్టుబడులు పెట్టే 10 సాధనాలను (లగ్జరీ కలెక్టబుల్స్) ఈ సూచీ మదింపు చేస్తుంది. దీని ప్రకారం లగ్జరీ హ్యాండ్ బ్యాగ్‌ల ధరలు 2.8 శాతం పెరగ్గా, ఆభరణాలు 2.3 శాతం, నాణేలు 2.1 శాతం, వాచీలు 1.7 శాతం, క్లాసిక్ కార్లు 1.2 శాతం పెరిగాయి. లగ్జరీ పెట్టుబడి సాధనంగా ఉండే ఆర్ట్ ధరలు అత్యధికంగా 18.3 శాతం పడిపోయాయి.
2023లో రెండంకెల స్థాయిలో వృద్ధి చెందిన ఈ విభాగంలో ధరలు, ప్రస్తుతం కోవిడ్–19 సంక్షోభ స్థాయి కన్నా దిగువకు తగ్గిపోయాయి. ఇక వైన్ రేట్లు 9.1 శాతం, ఫరి్నచర్ ధరలు 2.8 శాతం, రంగుల డైమండ్లు 2.2 శాతం తగ్గాయి. అరుదైన విస్కీ రేట్లు 9 శాతం క్షీణించాయి. 2022 వేసవి నాటి గరిష్ట స్థాయి నుంచి 19.3 శాతం పడిపోయాయి. లగ్జరీ కలెక్టబుల్స్ దీర్ఘకాలంలో ఇన్వెస్టర్లకు మెరుగైన రాబడులు అందించినట్లు నైట్ ఫ్రాంక్ గ్లోబల్ హెడ్ (రీసెర్చ్) లియామ్ బెయిలీ తెలిపారు. ‘వీటిలో 2005లో 1 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టి ఉంటే, కేఎఫ్‌ఎల్‌ఐఐ ప్రకారం వాటి విలువ ప్రస్తుతం 5.4 మిలియన్ డాలర్లుగా ఉండేది. అదే మొత్తాన్ని ఎస్‌అండ్‌పీ 500లో ఇన్వెస్ట్ చేసి ఉంటే 5 మిలియన్ డాలర్లే అయ్యేది‘ అని పేర్కొన్నారు.
దేశీయంగా
లగ్జరీ ఇళ్లలో ఢిల్లీ టాప్.. లగ్జరీ హౌసింగ్ సెగ్మెంట్‌లో ఢిల్లీ, బెంగళూరులో రేట్లు గణనీయంగా పెరిగాయి. ఇందుకు సంబంధించిన ప్రైమ్ ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ ఇండెక్స్ (పీఐఆర్‌ఐ) 2023తో పోలిస్తే 2024లో 3.6 శాతం పెరిగింది. దీని ప్రకారం విలాసవంతమైన నివాస గృహాల ధరలు 6.7 శాతం పెరగడంతో అంతర్జాతీయంగా టాప్ 100 నగరాల్లో ఢిల్లీ 37వ స్థానం నుంచి 18వ స్థానానికి ఎగబాకింది. బెంగళూరు 59వ ర్యాంకు నుంచి 40వ ర్యాంకుకు పెరగ్గా, ముంబై మాత్రం 13 ర్యాంకులు తగ్గి 21 స్థానానికి పడిపోయింది. అంతర్జాతీయ స్థాయిలో 18.4 శాతం రేట్ల వృద్ధితో సియోల్ అగ్రస్థానంలోనూ, మనీలా (17.9 శాతం), దుబాయ్ (16.9 శాతం) వరుసగా రెండు, మూడు స్థానాల్లోనూ ఉన్నాయి. మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆరి్థక వృద్ధి, లగ్జరీ ప్రాపర్టీలకు డిమాండ్ దన్నుతో హై–ఎండ్ రియల్ ఎస్టేట్ విభాగంలో ఈ నగరాలు ఆకర్షణీయంగా మారడాన్ని తాజా ర్యాంకులు సూచిస్తున్నట్లు బైజల్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment