భారత్‌ సావరిన్‌ రేటింగ్‌ యథాతథం | Fitch Affirms India at BBB Outlook Negative | Sakshi
Sakshi News home page

భారత్‌ సావరిన్‌ రేటింగ్‌ యథాతథం

Published Wed, Nov 17 2021 8:49 AM | Last Updated on Wed, Nov 17 2021 9:04 AM

Fitch Affirms India at BBB Outlook Negative - Sakshi

Fitch affirms India's sovereign rating: భారత్‌ సావరిన్‌ రేటింగ్‌ను యథాతథంగా నెగటివ్‌ అవుట్‌లుక్‌తో ‘బీబీబీ మైనస్‌’ వద్ద కొనసాగిస్తున్నట్లు అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్జజ సంస్థ– ఫిచ్‌ మంగళవారం స్పష్టం చేసింది. మధ్య కాలికంగా వృద్ధికి అవరోధాలు తగ్గినట్లు కూడా పేర్కొంది. అంతర్జాతీయంగా ఎదురయ్యే ఒడిదుడుకులను తట్టుకునే సామర్థ్యం భారత్‌కు ఉందని పేర్కొంది. ఈ సందర్భంగా దేశానికి ఉన్న దాదాపు 600కుపైగా బిలియన్‌ డాలర్ల విదేశీ మారకపు నిల్వలను ప్రస్తావించింది. ప్రభుత్వ రుణ భారం, బలహీన ఫైనాన్షియల్‌ వ్యవస్థ, వ్యవస్థాగత అంశాలకు సంబంధించి కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ దేశం వీటిని తట్టుకుని నిలబడగలదని పేర్కొంది. కోవిడ్‌–19 సవాళ్ల నుంచి దేశం వేగంగా రికవరీ అవుతోందని, మధ్య కాలిక వృద్ధి పటిష్టతకు, ఫైనాన్షియల్‌ రంగంపై ఒత్తిడి తగ్గడానికి ఆయా అంశాలు దోహదపడతాయని వివరించింది.  

8.7 శాతం వృద్ధి అంచనా 
2022 మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశం 8.7 శాతం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు నమోదవుతుందన్న అంచనాలను ఫిచ్‌ వెలువరించింది. 2023 మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 10 శాతానికి చేరుతుందని అంచనావేసింది. మెబిలిటీసహా పలు ఇండికేటర్లు కరోనా సవాళ్ల ముందస్తు స్థాయికి చేరుతున్నాయని పేర్కొంది. కోవిడ్‌–19 కేసులు పెరిగినప్పటికీ, దీనవల్ల నష్టం గతంలో కన్నా తక్కువగానే ఉంటుందని భావిస్తున్నట్లు వెల్లడించింది. విస్తృత వ్యాక్సినేషన్‌ దీనికి కారణమని తెలిపింది.  

చెత్త రేటింగ్‌కు ఒక అంచె ఎక్కువ... 
ప్రస్తుతం ఫిచ్‌ దేశానికి ఇస్తున్న రేటు చెత్త (జంక్‌) స్టేటస్‌కు ఒక అంచె ఎక్కువ. భారత్‌ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి తన అవుట్‌లుక్‌ను ‘నెగటివ్‌’ నుంచి ‘స్టేబుల్‌’కు అప్‌గ్రేడ్‌ చేస్తున్నట్లు మరో అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజ సంస్థ మూడీస్‌ అక్టోబర్‌లో పేర్కొంది. ఆర్థిక, ఫైనాన్షియల్‌ వ్యవస్థలకు సవాళ్లు తగ్గడం దీనికి కారణంగా పేర్కొంది. అయితే సావరిన్‌ రేటింగ్‌ను మాత్రం యథాతథంగానే కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం భారత్‌కు మూడీస్‌ ‘బీఏఏ3’ రేటింగ్‌ను ఇస్తోంది. ఇది కూడా జంక్‌ (చెత్త) స్టేటస్‌కు ఇది ఒక అంచె ఎక్కువ. 13 సంవత్సరాల తర్వాత నవంబర్‌ 2017లో భారత్‌ సావరిన్‌ రేటింగ్‌ను మూడీస్‌ ‘బీఏఏ3’ నుంచి ‘బీఏఏ2’కు అప్‌గ్రేడ్‌ చేసింది. అయితే గత ఏడాది తిరిగి ‘బీఏఏ2’ నుంచి ‘బీఏఏ3’కు డౌన్‌గ్రేడ్‌ చేసింది. పాలసీల్లో అమల్లో సవాళ్లు, ద్రవ్యలోటు తీవ్రత వంటి అంశాలను దీనికి కారణంగా చూపింది. మరో రేటింగ్‌ దిగ్గజ సంస్థలు ఎస్‌అండ్‌పీ కూడా భారత్‌కు చెత్త స్టేటస్‌కన్నా ఒక అంచె అధిక రేటింగ్‌నే ఇస్తోంది. భారత్‌ దిగ్గజ రేటింగ్‌ సంస్థల రేటింగ్‌ తీరు పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది.  భారత్‌ ఆర్థిక మూలస్తంభాల పటిష్టతను రేటింగ్‌ సంస్థలు పట్టించుకోవడంలేదన్నది వారి ఆరోపణ.    

ప్రాముఖ్యత ఎందుకు? 
అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థలు ఇచ్చే సావరిన్‌ రేటింగ్‌ ప్రాతిపదికగానే ఒక దేశంలో  పెట్టుబడుల నిర్ణయాలను ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారులు తీసుకుంటారు. ప్రతి యేడాదీ ఆర్థికశాఖ అధికారులు గ్లోబల్‌ రేటింగ్‌ దిగ్గజ సంస్థల ప్రతినిధులతో సమావేశం అవుతారు. దేశ ఆర్థిక పరిస్థితులను వివరించి, రేటింగ్‌ పెంపునకు విజ్ఞప్తి చేస్తారు.
- న్యూఢిల్లీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement