న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ చమురు కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లాభాలు ఆర్జిస్తాయని ఫిచ్ రేటింగ్స్ అంచనా వేసింది. గతేడాది ఇవి భారీ నష్టాలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. చము రు ధరలు బ్యారెల్‌కు 78.8 డాలర్లకు క్షీణించడాన్ని సానుకూలంగా ప్రస్తావించింది. దీంతో 2022–23 ఆర్థిక సంవత్సరం నష్టాలను.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో వచ్చే లాభాలతో భర్తీ చేసుకోగలవని తెలిపింది. గతేడాది ఏప్రిల్ నుంచి ప్రభుత్వరంగ సంస్థలైన ఐవోసీ, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ పెట్రోల్ ధరలను ఒకే స్థాయిలో కొసాగిస్తూ వస్తున్నాయి. అంతర్జాతీయంగా రేట్లు పెరిగినప్పటికీ, దేశీయంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు సవరించకపోవడంతో అవి నష్టాల పాలయ్యాయి. చమురు ధరలు గణనీయంగా తగ్గిన తర్వాత నుంచి తిరిగి అవి లాభాలను చూస్తున్నాయి.
5 శాతం పెరగొచ్చు
గడిచిన ఆర్థిక సంవత్సరంలో పెట్రోలియం డిమాండ్ 10 శాతం పెరగ్గా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5–6 శాతం మేర పెరగొచ్చని ఫిచ్ రేటింగ్స్ అంచనా వేసింది. అంతేకాదు మధ్య కాలానికి సైతం దేశంలో పెట్రోల్ డిమాండ్ 5–6 శాతం మేర పెరగొచ్చని పేర్కొంది. భారత్ జీడీపీ వచ్చే కొన్నేళ్లపాటు 6–7 శాతం మేర వృద్ధి చెందొచ్చని అంచనా వేసింది. ప్రభుత్వం మౌలిక సదుపాయాలపై వ్యయాలను పెంచుతూ ఉండడం, పారిశ్రామిక కార్యకలాపాలు పుంజుకోవడం పెట్రోల్ వినియోగానికి సానుకూలంగా పేర్కొంది. ‘‘స్థూల రిఫైనింగ్ మార్జిన్లు 2023–24లో మోస్తరు స్థాయికి దిగొస్తాయి. అయినప్పటికీ స్థూల మార్జిన్లు సగటు స్థాయిలకు ఎగువనే ఉండొచ్చని అంచనా వేస్తున్నాం’’అని ఫిచ్ రేటింగ్స్ వివరించింది.
మోస్తరు స్థాయిలో ధరలు
చమురు ధరలు 2022–23 గరిష్టాల నుంచి చూసుకుంటే మోస్తరు స్థాయిలో, ఎగువవైపే కొనసాగొచ్చని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. దీనివల్ల చమురు ఉత్పత్తి సంస్థలైన ఓఎన్‌జీసీ, ఆయిల్ ఇండియాలకు మంచి నగదు ప్రవాహాలు సమకూరతాయని పేర్కొంది. భారత నూతన గ్యాస్ ధరల విధానం వల్ల ఈ సంస్థలకు నగదు ప్రవాహాల్లో ఉన్న అస్థిరతలు తగ్గుతాయని తెలిపింది. ఉత్పత్తికి సంబంధించి ఈ సంస్థలకు అధిక మూలధన నిధులు అవసరం కొనసాగుతుందని అంచనా వేసింది. దేశ చమురు ఉత్పత్తి 2022–23లో 1.7 శాతం తగ్గినట్టు వివరించింది. ఓఎన్‌జీసీ ఉత్పత్తి 1 శాతం తగ్గగా, ఆయిల్ ఇండియా ఉత్పత్తి 5 శాతం పెరిగినట్టు తెలిపింది. పెట్రోలియం ఉత్పత్తులకు డిమాండ్ బలంగా ఉండడం, దేశీయంగా ఉత్పత్తి స్థిరంగా ఉండడంతో 2023–24లోనూ చమురు దిగుమతులు అధికంగానే ఉంటాయని ఫిచ్ రేటింగ్స్ పేర్కొంది.
ఆయిల్ కంపెనీలకు ఇక మీదట లాభాలే.. మరి డీజిల్,పెట్రోల్ ధరలు తగ్గేనా?
Published Tue, Jul 4 2023 7:57 AM | Last Updated on Tue, Jul 4 2023 9:14 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment