
కోల్‌కతా: జనవరి నెలలో ఇంజినీరింగ్ ఉత్పత్తుల ఎగుమతులు 7 శాతం పెరిగి 9.42 బిలియన్ డాలర్లుగా (రూ.82వేల కోట్లు) ఉన్నట్టు ‘ఇంజినీరింగ్ ఎగుమతుల ప్రోత్సాహక మండలి’ (ఈఈపీసీ) ప్రకటించింది. ముఖ్యంగా అమెరికాకు 18 శాతం అధికంగా 1.62 బిలియన్ డాలర్ల (రూ.14వేల కోట్లు) విలువైన ఇంజినీరింగ్ ఎగుమతులు జరిగినట్టు తెలిపింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024 ఏప్రిల్ నుంచి 2025 జనవరి మధ్య కాలంలో మొత్తం ఇంజినీరింగ్ ఎగుమతులు క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చి చూస్తే 10 శాతం ఎగసి 97 బిలియన్ డాలర్లకు (రూ.8.43 లక్షల కోట్లు) చేరినట్టు ఈఈపీసీ వెల్లడించింది. ఈ కాలంలో యూఎస్‌కు ఇంజినీరింగ్ ఎగుమతులు 9 శాతం పెరిగి 15.60 బిలియన్ డాలర్లుగా (రూ.1.37 లక్షల కోట్లు) ఉన్నట్టు తెలిపింది. ముఖ్యంగా యూఏఈకి ఎగుమతుల్లో పటిష్ట వృద్ధి నమోదైంది. జనవరిలో 56 శాతం పెరిగి 610 మిలియన్ డాలర్లుకు చేరగా.. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జనవరి మధ్యకాలంలో చూసినా 45 శాతం ఎగసి 6.87 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు ఈఈపీసీ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. జర్మనీ, మెక్సికో, టర్కీ, దక్షిణాఫ్రికా, ఫ్రాన్స్, జపాన్, నేపాల్, బంగ్లాదేశ్‌లకు జనవరి నెలలో ఇంజనీరింగ్ ఎగుమతులు పెరిగాయి. అదే సమయంలో యూకే, సౌదీ అరేబియా, మలేషియా, చైనా, ఇటలీ, స్పెయిన్‌లకు తగ్గాయి. జనవరి నెలకు దేశ మొత్తం వస్తు ఎగుమతుల్లో ఇంజినీరింగ్ ఉత్పత్తుల వాటా 25.86 శాతంగా ఉంది.
ఇదీ చదవండి: టాటా డిస్‌ప్లే చిప్స్ వస్తున్నాయ్..
సవాళ్ల మధ్య రాణించిన ఎగుమతులు..
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలకుతోడు వాణిజ్య రక్షణాత్మక ధోరణులు కొనసాగుతున్న తరుణంలోనూ దేశ ఇంజినీరింగ్ రంగం ఎగుమతుల పరంగా బలమైన వృద్ధిని చూపించినట్టు ఈఈపీసీ పేర్కొంది. అయితే, అంతర్జాతీయ వాణిజ్య విధానాల్లో వస్తున్న మార్పులు దేశ వ్యాపార సంస్థలపై అసాధారణ స్థాయిలో ఒత్తిళ్లను పెంచే ప్రమాదం లేకపోలేదని ఈఈపీసీ ఇండియా ఛైర్మన్ పంకజ్ చద్దా పేర్కొన్నారు. కార్మిక శాఖ పరిధిలో పనిచేసే ఈఈపీసీ ఇండియా.. ఎగుమతులను సులభతరం చేయడంతోపాటు, ఎంఎస్‌ఎంఈలు ప్రమాణాలను పెంచుకోవడానికి, అంతర్జాతీయ సరఫరా వ్యవస్థతో అనుసంధానం కావడానికి సేవలు అందిస్తుంటుంది. యూఎస్ తాజా టారిఫ్‌లు రానున్న రోజుల్లో ఎగుమతిదారులు ఎదుర్కోనున్న సవాళ్లను తెలియజేస్తున్నట్టు ఈఈపీసీ ఛైర్మన్ చద్దా పేర్కొన్నారు. ఎగుమతిదారులు పోటీతత్వాన్ని కొనసాగించేందుకు రుణ సాయం, టెక్నాలజీ పరంగా ప్రభుత్వం నుంచి మద్దతు కొనసాగాల్సి ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment