
దీపావళికి పుత్తడి పథకాలు: ప్రధాని
దీపావళి పండుగ సందర్భంగా బంగారం డిపాజిట్ స్కీమ్‌తో సహా పుత్తడి సంబంధిత పలు పథకాలు ప్రారంభిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు.
న్యూఢిల్లీ: దీపావళి పండుగ సందర్భంగా బంగారం డిపాజిట్ స్కీమ్‌తో సహా పుత్తడి సంబంధిత పలు పథకాలు ప్రారంభిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. బంగారం డిపాజిట్ స్కీమ్ ఆర్థిక అభివృద్ధికి కొత్త దిశను నిర్దేశిస్తుందన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. దీంతోపాటు సావరిన్ గోల్డ్ బాండ్స్, ఆశోక చక్రతో కూడిన బంగారు నాణేలను ధన్‌తేరాస్ రోజు కల్లా అందుబాటులోకి తెస్తామని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నెలవారీ రేడియో ప్రసంగం(మన్ నీ బాత్)లో ఆయన ఈ వివరాలు వెల్లడించారు.
సామాజిక జీవితంలో భాగం
మన దేశంలో సామాజిక జీవితంలో బంగారం ఒక భాగమైందని పేర్కొన్నారు.ఆర్థిక భరోసానిచ్చేదిగా, సంక్షోభ సమయాల్లో ఆదుకునేదిగానూ పుత్తడికి ముఖ్యమైన స్థానం ఉందని వివరించారు. పుత్తడి పట్ల ప్రజలకున్న ప్రేమను ఎవరూ తగ్గించలేరని చెప్పారు. అయితే బంగారాన్ని వృధా సొమ్ములుగా వదిలివేయడం ఈ కాలానికి తగదనిహితవు పలికారు. బంగారంలో పరోక్షంగా పెట్టుబడి చేయాలని సూచించారు. బంగారం దేశ ఆర్థిక ఆస్తిగా మారుతోందని, ప్రతి భారతీయుడు ఈ గోల్డ్ డిపాజిట్ స్కీమ్‌లో పాలుపంచుకునేలా చేయాలని సూచించారు. పుత్తడికి సంబంధించి బడ్జెట్‌లో ప్రతిపాదించినట్లుగా గోల్డ్ స్కీమ్‌ను తెస్తున్నందుకు సంతోషంగా ఉందని వివరించారు. బంగారం కొనుగోళ్లకు శుభప్రదంగా భావించే ధన్‌తేరస్ రోజు ఈ బంగారం స్కీమ్‌లు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు.
గోల్డ్ డిపాజిట్ స్కీమ్‌లో మీ దగ్గరున్న బంగారాన్ని ఏ బ్యాంక్‌లోనైనా డిపాజిట్ చేసి, ఆ డిపాజిట్లపై వడ్డీని పొందవచ్చని మోదీ చెప్పారు. గతంలో బంగారాన్ని లాకర్లలో దాచుకునేవారని, ఇలా దాచుకునేందుకు బ్యాంక్‌లకు కొంత మొత్తం చెల్లించాల్సి ఉండేదని చెప్పారు. ఇప్పుడు అలా కాదని, బంగారాన్ని డిపాజిట్ చేసి, దానిపై వడ్డీ పొందవచ్చని వివరించారు. ఇలా బంగారం ఒక ఆస్తి అని వివరించారు. బంగారాన్ని ఇంట్లో ఉంచుకోవదన్దని, బ్యాంకులో డిపాజిట్ చేయాలని సూచించారు.
ఇలా డిపాజిట్ చేయడం వల్ల భద్రతకు భద్రత, వడ్డీకి వడ్డీ కూడా లభిస్తుందని తన 35నిమిషాల ప్రసంగంలో మోదీ వివరించారు. ఇక పుత్తడి బాండ్ల పథకం గురించి వివరిస్తూ.. బంగారం విలువకు సమానమైన పత్రం ఈ బాండ్ల కొనుగోలు ద్వారా లభిస్తుందని, బంగారం కొని, దాని భద్రతపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఈ కాగితాన్ని ఎవరూ తస్కరించలేరన్నారు. పసిడి విలువకు సమానంగా వుండే ఈ పత్రాన్ని అవసరమైనపుడు నగదులోకి మార్చుకుని, పుత్తడిని కొనుక్కోవచ్చన్నారు. ఈ పథకం వచ్చే కొద్దివారాల్లో ప్రారంభమవుతుందని వెల్లడించారు.
అశోక చక్ర తో కూడిన బంగారు నాణాలను కూడా అందుబాటులోకి తెస్తున్నామని వివరించారు. మనకు స్వాతంత్య్రం వచ్చి 70 వసంతాలొచ్చినా, ఇప్పటికీ విదేశాలు తయారు చేసే బంగారు నాణాలే మనకు దిక్కని వాపోయారు. 5,10, 20 గ్రాముల్లో అశోక చక్ర చిహ్నంతో కూడిన బంగారు నాణేలు అందిస్తామని చెప్పారు. నిరుపయోగంగా ఉన్న రూ.20,000 టన్నుల బంగారంలో కొంత భాగాన్ని సమీకరించేందుకు ప్రభుత్వం ఈ స్కీమ్‌లు తెస్తోందని వివరించారు.