విజయవంతంకాని పసిడి పథకాలు!: సర్వే
అహ్మదాబాద్: పసిడి డిపాజిట్ స్కీమ్‌సహా బంగారానికి సంబంధించి కేంద్రం ప్రవేశపెట్టిన పలు పథకాలు విజయవంతం కావట్లేదని ఒక అధ్యయనం తేల్చింది. ఇండియా గోల్డ్ పాలసీ సెంటర్ (ఐజీపీసీ), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అహ్మదాబాద్ (ఐఐఎం–ఏ) నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం– ఆయా పథకాలు అంతగా విజయవంతం కాకపోవడానికి ప్రజల్లో అవగాహనా రాహిత్యమే ఒక కారణం. సర్వేకు సంబంధించి మరిన్ని వివరాలు చూస్తే– మహారాష్ట్రలోని కొల్హాపూర్, తమిళనాడులోని కోయంబత్తూర్, పశ్చిమబెంగాల్‌లోని హూగ్లీ, ఉత్తరప్రదేశ్‌లోని షహరాన్‌పూర్‌లలో దాదాపు 1,000 మంది అభిప్రాయాలను సర్వేకు ప్రాతిపదికగా తీసుకున్నారు.
వెయ్యి మందిలో కేవలం ఐదుగురికి మాత్రమే పసిడి డిపాజిట్ పథకం, గోల్డ్ బాండ్ పథకం, గోల్డ్ కాయిన్ స్కీమ్ వంటి వాటి గురించి అవగాహన ఉంది. ఈ మూడు స్కీములను రెండేళ్ల క్రితమే ప్రభుత్వం ప్రవేశపెట్టింది. తక్షణ గృహ అవసరాలు, రుణ చెల్లింపులకు పసిడి రుణాలను ప్రధానంగా వినియోగించుకుంటున్నట్లు సర్వే పేర్కొందనీ సహాయ్ ఈ సందర్భంగా తెలిపారు. తాము పసిడిపై రుణాలను వ్యాపారానికి, విద్యకు, గృహ మరమత్తులకు వినియోగించుకుంటున్నట్లు సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు సగం మంది తెలిపారు.