IIM-A
-
కోవిడ్ కూడబెట్టిన బంగారం! పసిడి పొదుపుపై ఆసక్తికర అధ్యయనం
బంగారంపై భారతీయులకు ఉన్న ప్రేమ అంతా ఇంతా కాదు. దాన్ని కేవలం ఆభరణాలుగానే కాకుండా పెట్టుబడి సాధనంగా కూడా చూస్తారు. ఇదంతా తెలిసిందే. అయితే కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని అల్లాడిస్తున్న సమయంలో భారతీయుల ఆర్థిక కార్యకలాపాలు, పొదుపు, బంగారు కొనుగోలు వంటి అంశాలపై ఓ ఆసక్తికర అధ్యయనం వెల్లడైంది. కోవిడ్ మహమ్మారి సమయంలో దేశంలోని ఇతర జిల్లాలతో పోల్చితే కోవిడ్ ప్రభావిత జిల్లాల్లోని కుటుంబాలే అత్యధికంగా బంగారం కొనుగోలు చేసినట్లు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ - అహమ్మదాబాద్ (ఐఐఎంఏ) చేపట్టిన అధ్యయనంలో వెల్లడైంది. ‘గోల్డ్ ఇన్ హౌస్‌హోల్డ్ పోర్ట్‌ఫోలియోస్ డూరింగ్ ఎ ప్యాండమిక్: ఎవిడెన్స్ ఫ్రం ఎమర్జెన్సీ ఎకానమీ’ పేరుతో రూపొందించిన అధ్యయన పత్రాన్ని ఐఐఎంఏ ఇటీవల తమ వెబ్సైట్లో ప్రచురించింది. ప్రతి 1000 జనాభాకు నమోదైన కోవిడ్ కేసులతోపాటు మరో సూచిక ఆధారంగా ఈ అధ్యయనం సంక్షోభ తీవ్రతలోని వైవిధ్యాన్ని సంగ్రహించింది. ఆభరణాల రూపంలో బంగారాన్ని వినియోగించే దేశాల్లో భారత్ ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశం. ఒక సగటు భారతీయ కుటుంబం తన మొత్తం హోల్డింగ్‌లలో 11 శాతాన్ని బంగారంపై పెట్టుబడి పెడుతున్నట్లు ఈ అధ్యయన పత్రం పేర్కొంది. దీని ప్రకారం.. ఇతర జిల్లాలతో పోల్చితే కోవిడ్ ప్రభావిత జిల్లాల్లోని కుటుంబాల పొదుపు పోర్ట్‌ఫోలియోలలో బంగారం వాటా గణనీయంగా 6.9 శాతం ఎక్కువగా ఉంది. ఆయా కుటుంబాల వద్ద ఉన్న బంగారం నిల్వలు కోవిడ్‌కి ముందు కంటే మహమ్మారి సమయంలో గణనీయంగా పెరిగాయి. ఇదీ చదవండి ➤ రూ.2,000 నోటు ఉపసంహరణ ఎఫెక్ట్: ఆరేళ్ల గరిష్టానికి బ్యాంక్ డిపాజిట్లు 2020-21 ఆర్థిక సంవత్సరం కోవిడ్ సమయంలో ఇండియా గోల్డ్ పాలసీ సెంటర్ (IGPC), పీపుల్ రీసెర్చ్ ఆన్ ఇండియాస్ కన్స్యూమర్ ఎకానమీ (PRICE) ద్వారా నిర్వహించిన గోల్డ్ వినియోగానికి సంబంధించిన గృహ సర్వే ఆధారంగా ఈ అధ్యయనం చేపట్టారు. దేశంలోని 23 రాష్ట్రాల్లో 160 జిల్లాల్లోని 40,427 కుటుంబాలతో ఈ సర్వే నిర్వహించారు. ఆ డేటా ఆధారంగా దేశంలో 21 రాష్ట్రాల్లోని 142 జిల్లాల్లోని 21,611 కుటుంబాలను శాంపిల్‌గా తీసుకుని అంచనాలను రూపొందించారు. ఆయా కుటుంబాల్లో బంగారంపై పొదుపులో వచ్చిన మార్పులను పోల్చడానికి 2015-16 ఆర్థిక సంవత్సరంలో నిర్వహించిన ‘ప్రైస్’ ముందస్తు ప్రతినిధి సర్వేను ఉపయోగించారు. ఇక జిల్లా స్థాయిలో కోవిడ్ కేసుల సంఖ్యను డెవలప్మెంట్ డేటా ల్యాబ్‌కు చెందిన సోషియో ఎకనామిక్ హై-రిజల్యూషన్ రూరల్-అర్బన్ జియోగ్రాఫిక్ ప్లాట్‌ఫాం ఫర్ ఇండియా (SHRUG) డేటాబేస్ నుంచి తీసుకున్నారు. -
విజయవంతంకాని పసిడి పథకాలు!: సర్వే
అహ్మదాబాద్: పసిడి డిపాజిట్ స్కీమ్సహా బంగారానికి సంబంధించి కేంద్రం ప్రవేశపెట్టిన పలు పథకాలు విజయవంతం కావట్లేదని ఒక అధ్యయనం తేల్చింది. ఇండియా గోల్డ్ పాలసీ సెంటర్ (ఐజీపీసీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ (ఐఐఎం–ఏ) నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం– ఆయా పథకాలు అంతగా విజయవంతం కాకపోవడానికి ప్రజల్లో అవగాహనా రాహిత్యమే ఒక కారణం. సర్వేకు సంబంధించి మరిన్ని వివరాలు చూస్తే– మహారాష్ట్రలోని కొల్హాపూర్, తమిళనాడులోని కోయంబత్తూర్, పశ్చిమబెంగాల్లోని హూగ్లీ, ఉత్తరప్రదేశ్‌లోని షహరాన్పూర్లలో దాదాపు 1,000 మంది అభిప్రాయాలను సర్వేకు ప్రాతిపదికగా తీసుకున్నారు. వెయ్యి మందిలో కేవలం ఐదుగురికి మాత్రమే పసిడి డిపాజిట్ పథకం, గోల్డ్ బాండ్ పథకం, గోల్డ్ కాయిన్ స్కీమ్ వంటి వాటి గురించి అవగాహన ఉంది. ఈ మూడు స్కీములను రెండేళ్ల క్రితమే ప్రభుత్వం ప్రవేశపెట్టింది. తక్షణ గృహ అవసరాలు, రుణ చెల్లింపులకు పసిడి రుణాలను ప్రధానంగా వినియోగించుకుంటున్నట్లు సర్వే పేర్కొందనీ సహాయ్ ఈ సందర్భంగా తెలిపారు. తాము పసిడిపై రుణాలను వ్యాపారానికి, విద్యకు, గృహ మరమత్తులకు వినియోగించుకుంటున్నట్లు సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు సగం మంది తెలిపారు. -
ఫ్లిప్ కార్ట్ బాధిత ఐఐటీలకు ఉద్యోగాలు
న్యూఢిల్లీ : ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ చేతిలో మోసపోయిన ఐఐఎమ్ అహ్మదాబాద్, ఐఐటీ గ్రాడ్యుయేట్లకు శుభవార్త. ఫ్లిప్ కార్ట్ ఎప్పుడు ఉద్యోగాల్లో చేర్పించుకుంటుందో అని కాలం వెల్లబుచ్చుకోకుండా ఐఐటీ గ్రాడ్యుయేట్లు మధ్యంతర కాలంగా తమ ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం కావచ్చని క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(క్యూసీఐ) పేర్కొంది. వారికి తమ సంస్థలో ఉద్యోగాలు కల్పిస్తామని క్యూసీఐ చెప్పింది. ఐఐటీ గ్రాడ్యుయేట్లు ఆరు నెలల నుంచి ఏడాది వరకు తమతో కలిసి పనిచేయొచ్చని క్యూసీఐ చైర్మన్ ఆదిల్ జైనుల్ భాయ్ తెలిపారు. ఐఐఎమ్, ఐఐటీల ప్రాంగణ నియామకాల్లో సెలక్ట్ చేసుకున్న ఐఐటీ గ్రాడ్యుయేట్లకు, ఫ్లిప్ కార్ట్ జాయినింగ్ తేదీలు ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్న సంగతి తెలిసిందే. కంపెనీలో పునర్వ్ వ్యవస్థీకరణ నేపథ్యంలోనే జాయినింగ్ తేదీలు ఇవ్వలేకపోతున్నామని ఫ్లిప్ కార్ట్ వెల్లడించింది. క్యూసీఐ అనేది డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్(డీఐపీపీ) కింద పనిచేసే ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ. ప్రతి ఏడాది చాలామంది యంగ్ గ్రాడ్యుయేట్లను ఇంటర్న్ లుగా తీసుకుని, విశ్లేషణ, పరిశోధన, ఫీల్డ్ వర్క్ ల్లో జాబ్స్ కల్పిస్తుంటోంది. ఇటీవలే పారిశుద్ధ్యం, ఆహార పరిస్థితుల గురించి పరిశీలించడానికి 'స్వచ్చ్ సుర్వేక్షణ' ప్రొగ్రామ్ ను 73 నగరాల్లో క్యూసీఐ చేపట్టింది. గ్రాడ్యుయేట్లు ఆశించిన రీతిలో తాము వేతనాలు చెల్లించలేకపోయిన, దేశానికి అర్ధవంతమైన సహకారం అందించాలనుకున్న వారికి క్యూసీఐ ఆహ్వానం పలుకుతుందని జైనుల్ భాయ్ తెలిపారు. క్యూసీఐలో చేరిన గ్రాడ్యుయేట్లు స్వచ్చ్ భారత్, స్వచ్చ్ సుర్వేక్షణ వంటి పబ్లిక్ ప్రాజెక్టులో తమ వంతు సహకారం అందించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. క్యూసీఐ చేపట్టే వివిధ ప్రాజెక్టుల కోసం ఐఐఎమ్స్, ఐఐటీల నుంచి కొంతమంది యువతను సెలక్ట్ చేసుకుంటుంటారు. 40 నుంచి 50 మంది గ్రాడ్యుయేట్లకు వారి ప్రాజెక్టుల కోసం పనిచేయడానికి అవకాశం ఇస్తుంటారు. అన్ని మంత్రిత్వ శాఖలకు సంబంధించిన ప్రాజెక్టులను క్యూసీఐ చేపడుతుంటోంది.