Households COVID 19 Vulnerable Districts Bought More Gold IIMA Study - Sakshi
Sakshi News home page

కోవిడ్‌ కూడబెట్టిన బంగారం! పసిడి పొదుపుపై ఆసక్తికర అధ్యయనం

Published Sun, Jul 23 2023 5:43 PM | Last Updated on Sun, Jul 23 2023 5:56 PM

Households Covid 19 vulnerable districts bought more gold IIMA study - Sakshi

బంగారంపై భారతీయులకు ఉన్న ప్రేమ అంతా ఇంతా కాదు. దాన్ని కేవలం ఆభరణాలుగానే కాకుండా పెట్టుబడి సాధనంగా కూడా చూస్తారు. ఇదంతా తెలిసిందే. అయితే కోవిడ్‌ మహమ్మారి ప్రపంచాన్ని అల్లాడిస్తున్న సమయంలో భారతీయుల ఆర్థిక కార్యకలాపాలు, పొదుపు, బంగారు కొనుగోలు వంటి అంశాలపై ఓ ఆసక్తికర అధ్యయనం వెల్లడైంది.

కోవిడ్‌ మహమ్మారి సమయంలో దేశంలోని ఇతర జిల్లాలతో పోల్చితే కోవిడ్‌ ప్రభావిత జిల్లాల్లోని కుటుంబాలే అత్యధికంగా బంగారం కొనుగోలు చేసినట్లు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ - అహమ్మదాబాద్‌ (ఐఐఎంఏ) చేపట్టిన అధ్యయనంలో వెల్లడైంది. ‘గోల్డ్‌ ఇన్‌ హౌస్‌హోల్డ్‌ పోర్ట్‌ఫోలియోస్‌ డూరింగ్‌ ఎ ప్యాండమిక్‌: ఎవిడెన్స్‌ ఫ్రం ఎమర్జెన్సీ ఎకానమీ’ పేరుతో రూపొందించిన అధ్యయన పత్రాన్ని ఐఐఎంఏ ఇటీవల తమ వెబ్‌సైట్‌లో ప్రచురించింది. ప్రతి 1000 జనాభాకు నమోదైన కోవిడ్ కేసులతోపాటు మరో సూచిక ఆధారంగా ఈ అధ్యయనం సంక్షోభ తీవ్రతలోని వైవిధ్యాన్ని సంగ్రహించింది.

ఆభరణాల రూపంలో బంగారాన్ని వినియోగించే దేశాల్లో భారత్‌ ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశం. ఒక సగటు భారతీయ కుటుంబం తన మొత్తం హోల్డింగ్‌లలో 11 శాతాన్ని బంగారంపై పెట్టుబడి పెడుతున్నట్లు ఈ అధ్యయన పత్రం పేర్కొంది. దీని ప్రకారం.. ఇతర జిల్లాలతో పోల్చితే కోవిడ్‌ ప్రభావిత జిల్లాల్లోని కుటుంబాల పొదుపు పోర్ట్‌ఫోలియోలలో బంగారం వాటా గణనీయంగా 6.9 శాతం ఎక్కువగా ఉంది. ఆయా కుటుంబాల వద్ద ఉన్న బంగారం నిల్వలు కోవిడ్‌కి ముందు కంటే మహమ్మారి సమయంలో గణనీయంగా పెరిగాయి.

ఇదీ చదవండి  రూ.2,000 నోటు ఉపసంహరణ ఎఫెక్ట్‌: ఆరేళ్ల గరిష్టానికి బ్యాంక్‌ డిపాజిట్లు

2020-21 ఆర్థిక సంవత్సరం కోవిడ్ సమయంలో ఇండియా గోల్డ్ పాలసీ సెంటర్ (IGPC), పీపుల్ రీసెర్చ్ ఆన్ ఇండియాస్ కన్స్యూమర్ ఎకానమీ (PRICE) ద్వారా నిర్వహించిన గోల్డ్ వినియోగానికి సంబంధించిన గృహ సర్వే ఆధారంగా ఈ అధ్యయనం చేపట్టారు. దేశంలోని 23 రాష్ట్రాల్లో 160 జిల్లాల్లోని 40,427 కుటుంబాలతో ఈ సర్వే నిర్వహించారు.

ఆ డేటా ఆధారంగా దేశంలో 21 రాష్ట్రాల్లోని 142 జిల్లాల్లోని 21,611 కుటుంబాలను శాంపిల్‌గా తీసుకుని అంచనాలను రూపొందించారు. ఆయా కుటుంబాల్లో బంగారంపై పొదుపులో వచ్చిన మార్పులను పోల్చడానికి 2015-16 ఆర్థిక సంవత్సరంలో నిర్వహించిన ‘ప్రైస్‌’ ముందస్తు ప్రతినిధి సర్వేను ఉపయోగించారు. ఇక జిల్లా స్థాయిలో కోవిడ్ కేసుల సంఖ్యను డెవలప్‌మెంట్ డేటా ల్యాబ్‌కు చెందిన సోషియో ఎకనామిక్ హై-రిజల్యూషన్ రూరల్-అర్బన్ జియోగ్రాఫిక్ ప్లాట్‌ఫాం ఫర్ ఇండియా (SHRUG) డేటాబేస్ నుంచి తీసుకున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement