
ముంబై: పసిడి డిపాజిట్ స్కీమ్‌లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక మార్పులు చేసింది. దీనిప్రకారం ఇకపై దాతృత్వం సంస్థలు, ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఈ పథకాన్ని వినియోగించుకోగలుగుతాయి. ఈ మేరకు ఆర్‌బీఐ ఒక ప్రకటన చేసింది. ప్రస్తుతం ఈ స్కీమ్ వ్యక్తులు, జాయింట్ డిపాజిట్లకు మాత్రమే అందుబాటులో ఉంది.
దేశంలో గృహాలు, సంస్థల వద్ద అవసరానికి మించి ఉన్న పసిడిని మార్కెట్‌లోకి తీసుకురావడం, పసిడి దిగుమతులను తగ్గించి దేశాన్ని కరెంట్ అకౌంట్ లోటు తీవ్రత నుంచి తప్పించడం ఉద్దేశ్యంగా 2015లో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. నిర్ధిష్ట కాలపరిమితుల్లో పసిడి డిపాజిట్‌ల ఆ మేరకు విలువపై 2.25 నుంచి 2.50 శాతం శ్రేణిలో వడ్డీ పొందే అవకాశాన్ని ఈ పథకం కల్పిస్తోంది. అయితే అనుకున్నంత స్థాయిలో ఈ పథకం విజయం సాధించలేదని గణాంకాలు పేర్కొంటున్నాయి.