బంగారానికీ ఎక్స్ఛేంజ్!
⇒జాతీయ పసిడి విధానం అవసరం
⇒పసిడి పొదుపు ఖాతాలు రావాలి..
⇒అలంకారప్రాయంగా ఉన్న 22 వేల టన్నుల పుత్తడిని చలామణీలోకి తేవాలి
⇒ప్రభుత్వానికి డబ్ల్యూజీసీ-ఫిక్కీ నివేదిక
న్యూఢిల్లీ: భారతీయుల వద్ద అలంకారప్రాయంగా మాత్రమే ఉంటున్న 22,000 టన్నుల పైచిలుకు బంగారాన్ని ఉపయోగంలోకి తెచ్చే దిశగా పలు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి ఫిక్కీ-డబ్ల్యూజీసీ ఒక నివేదికలో సూచించాయి. ఇందులో భాగంగా జాతీయ పసిడి విధానాన్ని రూపొందించాలని పేర్కొన్నాయి. స్టాక్ ఎక్స్చేంజీల తరహాలో బంగారానికీ ఎక్స్చేంజీని ఏర్పాటు చేయాలని, పసిడి పొదుపు ఖాతాలు వంటి పెట్టుబడి సాధనాలు అందుబాటులోకి తేవాలని తెలిపాయి.
పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ, వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) ఈ మేరకు రూపొందించిన నివేదికను మంగళవారం విడుదల చేశాయి. అటు దిగుమతి, ఎగుమతుల నిర్వహణ కోసం గోల్డ్ బోర్డును ఏర్పాటు చేయడం, అధీకృత రిఫైనరీల ఏర్పాటు, పసిడి స్వచ్ఛత నిర్ధారణకు సర్టిఫికేషన్‌ను తప్పనిసరి చేయడం, బ్యాంకులకు ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా పసిడిని చలామణీలోకి తేవడం తదితర అంశాలను సైతం ప్రభుత్వం పరిశీలించవచ్చని నివేదిక పేర్కొంది.
గడిచిన అయిదేళ్లుగా బంగారం వినియోగం సగటున 895 టన్నుల మేర ఉంటోందని వివరించింది. ఇళ్లలో నిరుపయోగంగా ఉన్న పసిడిలో చాలా తక్కువ పరిమాణాన్ని బైటికి తేగలిగినా.. పుత్తడి దిగుమతులను గణనీయంగా తగ్గించుకోవచ్చని డబ్ల్యూజీసీ, ఫిక్కీ పేర్కొన్నాయి. ఆర్థిక వృద్ధికి వనరులను సమకూర్చుకోవడానికి ఈ చర్యలు అనివార్యమని డబ్ల్యూజీసీ ఎండీ సోమసుందరం పీఆర్ అభిప్రాయపడ్డారు.
నివేదికలో ముఖ్యాంశాలు..
పోత్సాహకాలు ఇవ్వడం ద్వారా బ్యాంకులను కూడా ఈ ప్రక్రియలో భాగస్వాములను చేయాలి. బంగారం ఆధారిత పెట్టుబడి పథకాలు మరిన్ని ఆవిష్కరించేలా ప్రోత్సహించాలి. ఇప్పుడున్న వాటి గురించి అవగాహన పెంచే ప్రయత్నం చేయాలి. ‘బ్రాండెడ్ ఇండియా గోల్డ్ కాయిన్స్’ను ప్రభుత్వం తయారు చేయించవచ్చు. పసిడి అమ్మకాలకు అధీకృత డీలర్లను ఎంపిక చేయొచ్చు.
గోల్డ్ డిపాజిట్ స్కీమ్‌లను (జీడీఎస్) మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి. వడ్డీ వస్తుందంటే బంగారాన్ని డిపాజిట్ చేయడానికి చాలా మంది ముందుకు వచ్చే అవకాశాలున్నాయని సర్వే చెబుతోంది. బ్యాంకులు కనీస డిపాజిట్ పరిమాణాన్ని తగ్గించాలి. సులభంగా అర్థమయ్యే పసిడి పొదుపు పథకాలు ప్రవేశపెట్టాలి. ఈక్విటీ ఆధారిత సేవింగ్స్ స్కీమ్‌ల తరహాలోనే గోల్డ్ సేవింగ్స్ మ్యూచువల్ ఫండ్స్‌కి కూడా ఆదాయ పన్ను ప్రయోజనాలు లభించేలా చూడాలి. బంగారం ఆధారిత పింఛను, బీమా పథకాలనూ ప్రవేశపెట్టవచ్చు.
పసిడిని నగదుపరమైన ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడానికి భారతీయ వినియోగదారులు సిద్ధంగా ఉన్నారు. ఇందుకోసం ధర, నాణ్యత నిర్ధారణ మొదలైన వాటికి సరైన ప్రమాణాలను ఉండేలా చూడగలిగితే మరింత బంగారం చలామణీలోకి రావడానికి వీలుంటుంది.
పసిడికి జాతీయ స్థాయిలో ధరల విధానం ఉండేలా గోల్డ్ ఎక్స్చేంజీని ఏర్పాటు చేయాలి. దీని వల్ల రేట్లలో పారదర్శకత పెరుగుతుంది. బంగారం డిమాండ్, సరఫరాలను అంచనా వేయడం సాధ్యపడుతుంది. పసిడి ఎక్స్చేంజీ కోసం అత్యంత పటిష్టమైన వాల్ట్‌ను నిర్మించాల్సి ఉంటుంది.
సంతులిత, సమ్మిళిత పసిడి విధానాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించేలా గోల్డ్ బోర్డును ఏర్పాటు చేయాలి. బంగారం దిగుమతుల నిర్వహణ, ఎగుమతులకు ఊతమిచ్చే చర్యలు రూపొందించడం, దేశీ పసిడి మార్కెట్ సమర్థంగా పనిచేసేలా చూడటం వంటి బాధ్యతలు అప్పగించాలి.
అన్ని రకాల బంగారానికి నాణ్యతా సర్టిఫికేషన్‌ను తప్పనిసరి చేసేలా మార్గదర్శకాలు రూపొందించాలి.
ప్రపంచ మార్కెట్లో పుత్తడి పరుగు..
ముంబై/న్యూయార్క్: అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్‌లో, దీనికి అనుగుణంగా దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్‌లో మంగళవారం రాత్రి పసిడి పరుగులు తీసింది. వెండి కూడా దీనిని అనుసరించింది. కడపటి సమాచారం అందే సరికి న్యూయార్క్‌లో నెమైక్స్ కమోడిటీ మార్కెట్‌లో చురుగ్గా ట్రేడవుతున్న ఔన్స్ బంగారం (31.1గ్రా) కాంట్రాక్ట్ ధర క్రితం ముగింపుతో పోల్చితే 38 డాలర్లు (3 శాతానికి పైగా) ఎగిసి 1,233 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇది ఐదు వారాల గరిష్ట స్థాయి.
వెండి కూడా ఇదే బాటలో దాదాపు 5.5 శాతం పెరుగుదలతో 17 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇదే ట్రెండ్‌ను అనుసరిస్తూ మంగళవారం రాత్రి దేశీయంగా మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో 10 గ్రాముల పసిడి ఫ్యూచర్స్ కాంట్రాక్టు ధర క్రితం ధర కంటే రూ.823 అధికంగా (3% పైగా) రూ.27,184 వద్ద ట్రేడవుతోంది. వెండి కేజీ కాంట్రాక్ట్ ధర రూ.2,005 (5% పైగా) అధికంగా రూ.38,600 వద్ద ట్రేడవుతోంది.
దేశీయ స్పాట్ ధరపై ప్రభావం!
ప్రపంచ మార్కెట్లో ట్రెండ్‌కు అనుగుణంగా బుధవారం దేశీయ స్పాట్ మార్కెట్‌లలో పసిడి, వెండి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని బులియన్ ట్రేడర్లు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రధాన ఈక్విటీ మార్కెట్లు క్షీణించడం, డాలర్ మారకం రేటు తగ్గుదల వంటి అంశాలు ఈ విలువైన లోహాల ధరలు అధికంగా పెరగడానికి కారణమని విశ్లేషకులు చెపుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్‌లలో సోమవారం నాడు 100 బిలియన్ డాలర్ల సంపద హరించుకుపోయింది.
10 ప్రధాన దేశాల కరెన్సీలతో పోలిస్తే డాలర్ మారకం విలువ నెల కనిష్ట స్థాయికి పడిపోయింది. వచ్చే వారంలో ఫెడరల్ రిజర్వ్ కీలక సమావేశం, కనిష్ట స్థాయికి క్రూడ్ ధరలు తగ్గడం వంటి అంశాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు ఎగబాకడం గమనార్హం. బంగారం దిగుమతులపై భారత్ కొంత సరళతరం విధానం పాటిస్తున్నట్లు వచ్చిన వార్తలతో ఈ మెటల్ రేటు పెరగడం ప్రారంభమైనట్లు బులియన్ నిపుణులు చెబుతున్నారు.