సోమవారం నుంచి గోల్డ్ బాండ్స్ ట్రేడింగ్
ముంబై: ఫిబ్రవరి 8, మార్చి 29న జారీ అయిన గోల్డ్ బాండ్లు సోమవారం (ఆగస్టు 29) నుంచి స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ట్రేడ్ కానున్నాయి. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. మొదటి విడత జారీ అయిన సావరిన్ గోల్డ్ బాండ్ల ట్రేడింగ్ ఇప్పటికే ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. 2015 అక్టోబర్ 30న పసిడి బాండ్ల పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. ఇప్పటికి నాలుగు దఫాలుగా పసిడి బాండ్ల జారీ పక్రియ జరిగింది.
చివరి దశలో జారీ చేసిన పసిడి బాండ్లు ఎప్పుడు ట్రేడవుతాయన్న విషయాన్ని తర్వాత ప్రకటిస్తామని ఆర్‌బీఐ పేర్కొంది. కాగా ఐదవ విడత పసిడి బాండ్ల జారీ ప్రక్రియను వచ్చే నెల్లో ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. బాండ్లకు సంబంధించి తొలి పెట్టుబడిపై వార్షిక స్థిర వడ్డీరేటు 2.75 శాతం. ఆరు నెలలకు ఒకసారి వడ్డీ చెల్లింపులు ఉంటాయి. రెండు గ్రాముల నుంచి 500 గ్రాముల వరకూ విలువైన బాండ్ల కొనుగోలుకు వీలుంది. బాండ్ల కాలపరిమితి ఎనిమిదేళ్లు. ఐదేళ్ల తరవాత ఎగ్జిట్ ఆఫర్ ఉంటుంది.