గోల్డ్ బాండ్ల జారీ ఇలా..
ఆర్‌బీఐ మార్గదర్శకాలు
* నేటి నుంచే ఆఫర్..
ముంబై: సావరిన్ గోల్డ్ బాండ్లకు సంబంధించి నిర్వహణా పరమైన మార్గదర్శకాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) జారీచేసింది. గోల్డ్ డిపాజిట్ పథకం, గోల్డ్ కాయిన్ అండ్ బులియన్ స్కీమ్‌లతోపాటు సావరిన్ గోల్డ్ బాండ్లను గురువారం ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్న సంగతి విదితమే. ఆర్‌బీఐ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం...
వాణిజ్య బ్యాంకుల శాఖల్లోనూ, నిర్దేశిత పోస్టాఫీసు శాఖల్లోని బాండ్ల కోసం దరఖాస్తు చేసుకోవొచ్చు. నవంబర్ 5వ తేదీ నుంచీ 20వ తేదీ వరకూ సాధారణ పనివేళల్లో నిర్దిష్ట శాఖలలో బాండ్లకు సంబంధించిన దరఖాస్తును ఇన్వెస్టర్లు సమర్పించాల్సి ఉంటుంది. కావల్సిన అదనపు సమాచారాన్ని అధికారులు అడిగి తెలుసుకుంటారు.
* బాండ్లు చేతికి వచ్చే వరకూ ఇన్వెస్టర్ చెల్లించిన నిర్దిష్ట మొత్తంపై సేవింగ్స్ బ్యాంక్ వడ్డీ రేటును దరఖాస్తుదారుకు చెల్లించడం జరుగుతుంది. దరఖాస్తును దాఖలు చేసిన బ్యాంక్ బ్రాంచీలో సంబంధిత ఇన్వెస్టర్‌కు అకౌంట్ నంబర్ లేకపోతే... సదరు వ్యక్తి అందించిన అకౌంట్ సమాచారం ఆధారంగా ఎలక్ట్రానిక్ ఫండ్ బదలాయింపు ద్వారా వడ్డీ జమవుతుంది.
* తమ తరఫున దరఖాస్తులను తీసుకోవడానికి బ్యాంకులు అవసరమైతే ఎన్‌బీఎఫ్‌సీ, ఎన్‌ఎస్‌సీ ఏజెంట్లు తదితరులను ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉంది.
* అప్లికేషన్‌ను రద్దుచేసుకునే సౌలభ్యం ఉంది. అయితే ఇష్యూ ముగింపు తేదీ 20 వరకూ ఈ వీలు ఉంటుంది. రద్దును పాక్షికంగా అనుమతించరు. పూర్తిగా రద్దుపర్చుకోవాల్సివుం టుంది. అప్లికేషన్ రద్దు చేసుకుంటే... ఇందుకు సంబంధించి వడ్డీ చెల్లింపు ఉండబోదు.
* ఈ బంగారం బాండ్లు 26వ తేదీన జారీ అవుతాయి. బాండ్లపై వడ్డీ రేటు 2.75 శాతం. బాండ్ రేటు గ్రాముకు రూ. 2,684.