కరిగిస్తే.. డిపాజిట్లు ఇవ్వం!
♦ దేవుని బంగారంపై పలు ఆలయ బోర్డుల స్పష్టీకరణ
♦ కేంద్రం ‘బంగారు డిపాజిట్ల పథకం’కు స్పందన అంతంతే
♦ దేశ, సమాజ సేవకే ఈ నిల్వలంటున్న మరికొన్ని ట్రస్టులు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘బంగారు డిపాజిట్ల పథకం’కు రాష్ట్ర ప్రభుత్వాలు, దేవాలయాల బోర్డులనుంచి అంతంత మాత్రంగానే స్పందన వస్తోంది. ప్రస్తుతం దేశంలోని వివిధ ఆలయాల్లో ఉన్న బంగారం నిల్వల విలువ ఒక ట్రిలియన్ అమెరికన్ డాలర్లు (దాదాపు రూ. 6.63 కోట్ల కోట్లు)ఉంటుందని అంచనా. ఈ మొత్తాన్ని లేదా.. ఇందులో కొంతైనా ప్రభుత్వం దగ్గర డిపాజిట్ చేయటం ద్వారా బంగారం సరఫరా పెరిగినట్లవుతుందని కేంద్రం ఆలోచన. ఇందుకు దేవాలయాలతోపాటు, ప్రజలు, వివిధ ఆర్థిక సంస్థల వద్దనున్న 22వేల టన్నుల బంగారాన్ని ‘బంగారు డిపాజిట్ పథకం’లోకి మార్చాలని భావిస్తోంది.
ఇందుకోసం బంగారాన్ని కరిగించి బిస్కెట్ల రూపంలోకి మార్చాల్సి ఉంటుంది. దీనిపై అభిప్రాయం తెలపాలంటూ కొన్ని నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వాలు, ఆలయాల బోర్డులను కోరింది. అయితే బంగారాన్ని ఇచ్చేందుకు బోర్డులకు అభ్యంతరం లేకున్నా.. నగలను కరిగించటంపైనే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. బంగారు ఆభరణాలను కరిగించటం ద్వారా భక్తుల మనోభావాలు దెబ్బతీసినట్లవుతుందని.. మత విశ్వాసాలకు భంగం కలుగుతుందంటున్నాయి. కేరళలోని అనంత పద్మనాభస్వామి ఆలయం, మహారాష్ట్రలోని షిర్డీ సాయి దేవాలయాల బంగారు నిల్వలపై సుప్రీం, బాంబే హైకోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి.
కరిగిస్తే ఏమవుతుంది?
బంగారు విగ్రహాలు, ఆభరణాలకు కరిగించటం ద్వారా వీటి తూకం తగ్గటంతో పాటు నాణ్యమైన బంగారం మాత్రమే పరిగణనలోకి వస్తుంది. అంటే అంతకుముందున్న బంగారంలో చాలా మట్టుకు తరుగుపోతుంది. దీని వల్ల డిపాజిట్‌కు ముందున్న బంగారం బరువుకు.. కరిగించిన తర్వాత ఉన్న బరువుకు తేడా ఉంటుంది. ఈ పథకంపై కేరళలో గురువాయూర్ దేవాలయం తప్ప మిగిలిన ఆలయ బోర్డులు పథకంలో చేరటంపై ఆసక్తి చూపలేదు. కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలు ఈ దిశగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని తెలిపాయి. రాజస్థాన్ ప్రభుత్వం అనాసక్తి కనబరిచినట్లు తెలుస్తోంది.
త్వరలో టీటీడీ భేటీ
ఈ పథకంపై ఏపీ, పశ్చిమ బెంగాల్, గుజరాత్‌లనుంచి అంగీకారం లభించనప్పటికీ.. సానుకూల వాతావరణం కనబడుతోంది. ఈ విషయంలపై తుది నిర్ణయం తీసుకునేందుకు టీటీడీ బోర్డు (టీటీడీ దేవస్థానం వద్ద వివిధ రూపాల్లో 5.5 టన్నుల బంగారం ఉంది) త్వరలోనే భేటీ కానుండగా.. పథకంలో చేరే ఉద్దేశం లేదని బెజవాడ దుర్గమ్మ దేవస్థానం బోర్డు స్పష్టం చేసింది. పశ్చిమ బెంగాల్‌లోని ప్రముఖ దక్షిణేశ్వర్ దేవాలయ బోర్డు తమవద్దనున్న బంగారాన్ని కేంద్రం వద్ద డిపాజిట్ చేసేందుకు సుముఖంగా ఉంది. ‘ఇంత బంగారం గుడిలో పెట్టుకుని ఏం లాభం. సమాజానికి, దేశానికి ఉపయోగ పడితేనే బాగుంటుందని భావిస్తున్నాం. తుది నిర్ణయం తీసుకోకున్నా.. ట్రస్టు సభ్యుల అనుకూలంగానే ఉన్నారు’ అని బోర్డు సభ్యుడొకరు తెలిపారు. గుజరాత్‌లోని ద్వారక బోర్డు కూడా సానుకూల సంకేతాలను పంపించింది. ముంబైలోని ప్రముఖ సిద్ధి వినాయక దేవాలయం కూడా ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగానే ఉంది.
బంగారం డిపాజిట్ అంటే ఏంటి?
ఆభరణాల రూపంలో డిపాజిటర్లు తాకట్టు పెట్టిన బంగారం అసలు విలువ లెక్కగట్టాక రశీదు ఇస్తారు. ఆ తర్వాత దీన్ని కరిగించి బిస్కెట్ల రూపంలోకి మార్చేస్తారు. ఆ తర్వాత ఈ బంగారాన్ని మార్కెట్లోకి తీసుకొస్తారు. తాకట్టు పెట్టిన వ్యక్తి భవిష్యత్తులో కావాలనుకుంటే.. ‘995 నాణ్యత ఉన్న బంగారం’ లేదా డిపాజిట్ చేసిన బంగారం బరువుకు సరిపడా డబ్బులను (మార్కెట్ రేటు) అందజేస్తారు. కానీ డిపాజిట్ చేస్తున్నప్పుడు ఉన్న ఆభరణం మాత్రం కనిపించదు.