ఆ నోట్లు శ్రీవారి హుండీలో వేసినా చెల్లవు
ఈవో సాంబశివరావు వెల్లడి
సాక్షి, తిరుమల: కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన రూ.500, రూ.1000 పాత నోట్లు శ్రీవారి హుండీలో సమర్పించినా చెల్లవని శుక్రవారం టీటీడీ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గడువు డిసెంబర్ 31వ తేదీ నుండి మార్చి 1వ తేదీ వరకు మొత్తం రూ.8.29 కోట్లు లభించాయని శుక్రవారం టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబ శివరావు వెల్లడించారు. పాత పెద్ద నోట్ల నిల్వ విషయంపై ఇప్పటికే పలుమార్లు కేంద్ర ప్రభుత్వం, రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సంప్రదింపులు చేశామన్నారు. నిబంధనల ప్రకారం వాటి మార్పిడికి అవకాశం లేదని నిపుణులు తేల్చారని ఈవో వెల్లడించారు. గడిచిన 61 రోజుల్లో మొత్తం రూ.8.29 కోట్లు టీటీడీ ఖజానాలో నిల్వ ఉంచామన్నారు. వీటి మార్పిడి కోసం చివరి అవకాశంగా మరోసారి సంప్రదింపులు జరుపుతామన్నారు. వారి నుంచి తదుపరి ఉత్తర్వులు అందాకే ఉన్న కరెన్సీనోట్లను ఏమి చేయాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
ఫిబ్రవరిలో తగ్గిన శ్రీవారి హుండీ కానుకలు
ఫిబ్రవరిలో శ్రీవారి హుండీ ద్వారా మొత్తం రూ.69.20 కోట్లు కానుకలు లభించాయి. 2016 ఫిబ్రవరిలో రూ.76.52 కోట్లు లభించాయి. పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో గత ఏడాది కంటే ఈసారి ఫిబ్రవరిలో రూ.7.32 కోట్లు తక్కువగా లభించాయి.
సేవా టికెట్లు డిప్ పద్ధతిపై కేటాయించే యోచన
తిరుమల ఆలయంలో గర్భాలయ మూలమూర్తికి నిర్వహించే అర్చన, తోమాల సేవలకు సంబంధించి ఇంటర్నెట్ కోటాలో టికెట్లు పరిమితంగా ఉండగా అపరిమిత మైన డిమాండ్ ఉండడంతో డిప్ పద్ధతిలో టికెట్లు కేటాయించాలని యోచిస్తున్నామని టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు వెల్లడించారు. కంప్యూటర్ ద్వారా ఈ డిప్ పద్ధతిని నిర్వహించేందుకు ఐటీ నిపుణులతో సంప్రదింపులు చేస్తున్నామని శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో భక్తులు అడిగిన ప్రశ్నకు ఈవో బదులిచ్చారు.
48,690 ఆర్జిత సేవా టికెట్ల విడుదల
శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించి జూన్æ 1వ తేదీ నుంచి 30వ తేది వరకు మొత్తం 48,690 టికెట్లు విడుదల చేసినట్టు ఈవో సాంబశివరావు తెలిపారు. సేవా టికెట్లకు భక్తుల స్పందన విశేషంగా ఉందని పేర్కొన్నారు.