ఎస్‌బీఐలో 2,780 కిలోల టీటీడీ బంగారం డిపాజిట్‌ | TTD Gold Deposit in SBI | Sakshi
Sakshi News home page

ఎస్‌బీఐలో 2,780 కిలోల టీటీడీ బంగారం డిపాజిట్‌

Published Tue, Aug 29 2017 2:40 AM | Last Updated on Mon, Aug 20 2018 9:18 PM

ఎస్‌బీఐలో 2,780 కిలోల టీటీడీ బంగారం డిపాజిట్‌ - Sakshi

ఎస్‌బీఐలో 2,780 కిలోల టీటీడీ బంగారం డిపాజిట్‌

సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి చెందిన 2,780 కిలోల బంగారాన్ని 2.5% వడ్డీ కింద ఎస్‌బీఐలో దీర్ఘకాలిక ప్రాతిపదికన ఆలయ అధికారులు డిపాజిట్‌ చేశారు. 12 ఏళ్ల కాలపరిమితితో డిపాజిట్‌ చేసిన ఈ బంగారం విలువ ప్రస్తుతం రూ.700 కోట్లకుపైగా ఉంటుందని అంచనా. సోమవారం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో ఫైనాన్షియల్‌ అడ్వైయిజర్, చీఫ్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ ఒ.బాలాజీని ఎస్‌బీఐ ఉన్నతాధికారులు కలసి ఈ మేరకు డిపాజిట్‌ పత్రాలను అందజేశారు. కేంద్ర ప్రభుత్వం గోల్డ్‌ మానిటైజేషన్‌ పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత 2017 ఫిబ్రవరిలో టీటీడీ తన స్వల్పకాలిక డిపాజిట్లు అన్నింటినీ దీర్ఘకాలిక డిపాజిట్లుగా మార్చాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇప్పటికే ఎస్‌బీఐలో స్వల్పకాలిక డిపాజిట్లుగా ఉన్న 2,075 కిలోల బంగారాన్ని దీర్ఘకాలిక డిపాజిట్లుగా మార్చుకుంది.

దీంతోపాటు ఈ ఏడాది మేలో ముంబై మింట్‌కు పంపించిన బంగారు నగలను కరిగించి శుద్ధి చేశారు. అనంతరం 705 కిలోల స్వచ్ఛమైన బంగారాన్ని తిరిగి టీటీడీకి అందజేశారు. దీనిని కూడా కలిపి మొత్తం 2,780 కిలోల బంగారాన్ని దీర్ఘకాలిక ప్రాతిపదికన డిపాజిట్‌ చేశారు. ఈ సందర్భంగా ఎస్‌బీఐ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ మణి పల్వేశన్‌ మాట్లాడుతూ.. టీటీడీ బంగారాన్ని తమ బ్యాంకులో డిపాజిట్‌ చేయడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. భవిష్యత్‌లోనూ ఇదే విధమైన సంబంధాలను కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో ఎస్‌బీఐ జనరల్‌ మేనేజర్‌ ఆర్‌వీ దేశ్‌పాండే, డీజీఎం కులకర్ణి, ఏజీఎంలు మధుమోహన్‌పాత్రో, పూర్ణచంద్రుడు తదితరులు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement