
ఇప్పుడు తగ్గినా, తర్వాత పెరుగుతుంది
అమెరికా కేంద్ర బ్యాంకు వడ్డీ రేట్లు పెంచుతుందన్న అంచనాలు బలపడటంతో బంగారం ధర ఇప్పుడు క్షీణిస్తున్నా...
బంగారంపై నిపుణుల అంచనాలు
హైదరాబాద్: అమెరికా కేంద్ర బ్యాంకు వడ్డీ రేట్లు పెంచుతుందన్న అంచనాలు బలపడటంతో బంగారం ధర ఇప్పుడు క్షీణిస్తున్నా, తదుపరి నెలల్లో నెమ్మదిగా పెరుగుతుందని విశ్లేషకులు అంటున్నారు. అమెరికా వడ్డీ రేట్ల పెంపు అంచనాలతో శుక్రవారం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు పుత్తడి ధర ఏడువారాల కనిష్టస్థాయి 1,088 డాలర్ల వద్దకు పడిపోయింది.
ఈ ఏడాది జూలైలో ఐదున్నరేళ్ల కనిష్టస్థాయి అయిన 1,077 డాలర్లకు తగ్గిన తర్వాత, అటునుంచి నెమ్మదిగా 1,200 డాలర్ల వరకూ పెరిగిన బంగారం హఠాత్తుగా రెండు వారాల నుంచి క్షీణిస్తూ వస్తోంది. స్వల్పకాలికంగా ఈ ధర 1,070 డాలర్ల స్థాయికి దిగివచ్చినా, తర్వాతి నెలల్లో పుత్తడి పుంజుకుంటుందని, ఇండియా, చైనాల్లో డిమాండ్ ఇందుకు కారణమవుతుందని నిపుణులు అంచనావేస్తున్నారు.
బంగారం గత మూడేళ్ల నుంచి ఇది 1,300-1,070 డాలర్ల శ్రేణిలో కదులుందన్న అంశాన్ని వీరు గుర్తుచేస్తున్నారు. అలాగే ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు అంశం ఇప్పటికే బంగారం ధరలో ఇమిడిపోయినందున, సమీప భవిష్యత్తులో పుత్తడి భారీగా తగ్గే అవకాశం లేదని వారన్నారు.
పటిష్టంగానే డిమాండ్...
వివిధ కేంద్ర బ్యాంకుల నుంచి బంగారానికి డిమాండ్ పటిష్టంగానే వుందని, అలాగే చైనా, భారత్‌ల్లో పుత్తడి వినియోగం తగ్గలేదని, ఈ అంశాలు తిరిగి ధరల పెరుగుదలకు దోహదపడుతుందని విశ్లేషకులు చెప్పారు. చైనాలో ఈ ఏడాది రెండో త్రైమాసికంలో డిమాండ్ తగ్గినా, మూడో త్రైమాసికంలో డిమాండ్ 3 శాతం వృద్ధిచెందింది. షాంఘై స్టాక్ మార్కెట్ పతనం ఫలితంగా అక్కడ తిరిగి బంగారంపై ఆకర్షణ పెరుగుతోందని విశ్లేషకులు చెప్పారు.
ఇదే రీతిలో భారత్‌లో ఆభరణాల వినియోగం మెరుగుపడటంతో మూడో త్రైమాసికంలో డిమాండ్ 5 శాతం వృద్ధితో 193 టన్నులకు చేరింది. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బంగారం డిపాజిట్ స్కీము విజయవంతమైతే, భారత్‌కు దిగుమతులు తగ్గి, అంతర్జాతీయంగా బంగారం ధర బలహీనపడే రిస్క్ వుంటుందని విశ్లేషకులు హెచ్చరించారు. విదేశీ రిజర్వుల్ని వివిధీకరించే దిశగా చైనా, రష్యా కేంద్ర బ్యాంకులు మరింత బంగారాన్ని కొనుగోలు చేయవచ్చని, ఈ ప్రక్రియ కూడా ధరల పెరుగుదలకు దోహదపడుతుందని విశ్లేషకులు వివరించారు.
మూడోవారమూ తగ్గింది...
అంతర్జాతీయ మార్కెట్లో ప్రతికూల అంశాల కారణంగా దేశీయంగా బంగారం ధర వరుసగా మూడోవారమూ క్షీణించింది. ప్రపంచ మార్కెట్లో ధర 4.7 శాతం తగ్గడంతో ముంబై బులియన్ మార్కెట్లో 99.9 స్వచ్ఛతగల 10 గ్రాముల పుత్తడిధర అంతక్రితం వారంతో పోలిస్తే రూ. 710 తగ్గుదలతో రూ. 26,110 వద్ద ముగిసింది. 99.5 స్వచ్ఛతగల పుత్తడి అంతేమొత్తం క్షీణించి రూ. 25,960 వద్ద క్లోజయ్యింది.