
‘బంగారం’ లాంటి పథకం..!
- పసిడి డిపాజిట్‌తో లాభాలు అధికమే
- ఆభరణాలు పెడితే ప్రతికూలతలూ ఉన్నాయ్
ప్రజలు, సంస్థల దగ్గర ఉత్పాదకత లేకుండా పడి ఉన్న పసిడిని చలామణిలోకి తెచ్చేందుకు ప్రభుత్వం మరోసారి బంగారం డిపాజిట్ స్కీమ్‌ను ప్రకటించింది. 1999లో ఈ తరహా పథకాన్నే ప్రవేశపెట్టినప్పటికీ .. అప్పట్లో దీనికి అంతగా ఆదరణ దక్కలేదు. గోల్డ్ డిపాజిట్ చేసేవారికి పన్నులపరంగా ప్రయోజనాలు లభించేలా చూస్తామంటున్నప్పటికీ, గతానికి భిన్నంగా 1% కన్నా ఎక్కువ వడ్డీ రేటు ఇస్తే తప్ప ఇది వర్కవుట్ కాదంటున్నారు విశ్లేషకులు. ఈ వడ్డీ కూడా నగదు రూపంలో ఉంటుందా.. పసిడి రూపంలో ఉంటుందా అన్నది తేలాల్సి ఉంది. స్కీముపై ప్రస్తుతం ముసాయిదా మార్గదర్శకాలనే ప్రకటించింది ప్రభుత్వం. వీటిపై జూన్ 2 లోగా ప్రజలు, సంబంధిత వర్గాల అభిప్రాయాలను తెలుసుకుని ఆ తర్వాత తుది నిబంధనలను ఖరారు చేయనుంది. దీనివల్ల వచ్చే ప్రయోజనాలు, ఇందులోని ప్రతికూలతల్లో కొన్ని..
ప్రయోజనాలు..
- గతంలో కనీసం 500 గ్రాములు డిపాజిట్ చేయాల్సి ఉండేది. ఇప్పుడు కనిష్టంగా 30 గ్రాముల బంగారమైనా డిపాజిట్ చేయొచ్చు.
- ఉత్తినే బ్యాంకు లాకర్లలోనో.. ఇంట్లో బీరువాల్లోనో ఉంచే బదులు డిపాజిట్ చేయడం వల్ల ఏడాదికి ఎంతో కొంత వడ్డీ రూపంలో ఆదాయం లభిస్తుంది. ఈలోగా బంగారం రేటు పెరి గితే ఆ ప్రయోజనం ఉండనే ఉంటుంది.
- మీ బంగారం మీ అకౌంట్లోనే ఉంటుంది. అమ్మకుండానే వడ్డీ ఆదాయం వస్తుంది. పైగా దీనిపై పన్ను కూడా ఉండదు.
- ఇలా వచ్చే ఆదాయాన్ని ఏ రికరింగ్ డిపాజిట్ స్కీమో లేదా ఏ పెన్షన్ స్కీములోనో ఇన్వెస్ట్ చేస్తే అదనంగా మరికాస్త ప్రయోజనమూ దక్కుతుంది.
ప్రతికూలతలూ ఉంటాయ్ ..
- మీరు ఆభరణాలు డిపాజిట్ చేస్తే బంగారం మీ అకౌంట్లోనే ఉంటుంది కానీ.. ఆభరణాల రూపంలో ఉండదు. వాటిని కరిగించేసి ఆ మేర పసిడి బరువును మాత్రమే మీ ఖాతాలో చూపిస్తుంది బ్యాంకు. దీనివల్ల బంగారంపై మీకు వడ్డీ ఆదాయం వచ్చినా.. ఆ ఆభరణాన్ని అలాగే మీరు వాడుకోలేరు.
- డిపాజిట్ చేసిన బంగారం మొత్తాన్ని కాల వ్యవధి తీరాక విత్‌డ్రా చేసుకున్నాక.. మరోసారి అభరణాలు చేయించుకోవాలంటే ఆ మేర మేకింగ్ చార్జీలు వగైరాలు మళ్లీ తప్పకపోవచ్చు.
రెండు వారాల లాభాలకు బ్రేక్...
విదేశీ మార్కెట్లలో నెగటివ్ ధోరణుల కారణంగా ఇటు దేశీ బులియన్ మార్కెట్లోనూ పసిడి, వెండి రేట్లు గత వారం తగ్గాయి. పసిడి రెండు వారాల పరుగుకు బ్రేక్ పడింది. వారం ప్రారంభంలో కొనుగోళ్ల మద్దతుతో పుత్తడి రేట్లు పుంజుకున్నప్పటికీ .. వారాంతానికల్లా తగ్గాయి. సురక్షితమైన ఇన్వెస్ట్‌మెంట్ సాధనంగా అంతర్జాతీయంగా డాలర్‌కు డిమాండ్ పెరగడం, ఇటు దేశీయంగా జ్యుయెలర్లు, రిటైలర్ల నుంచి బంగారానికి డిమాండ్ తగ్గడం వంటివి పసిడి పరుగుకు బ్రేక్ వేసినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. పెరుగుతున్న ఈక్విటీ మార్కెట్ల వైపు నిధులు మళ్లడం కూడా పసిడిపై ప్రభావం చూపిందని తెలిపాయి.
అంతర్జాతీయంగా చూస్తే వారంలో బంగారం ధర 1.7 శాతం క్షీణించింది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో వారాంతానికి పసిడి ధర 10 గ్రాములకు రూ.350 మేర తగ్గి, మేలిమి బంగారం రేటు రూ.27,450, ఆభరణాల బంగారం ధర రూ. 27,300 వద్ద ముగిసింది. అటు వెండి కూడా లాభనష్టాల్లో ఊగిసలాడి ఆఖరుకు కిలోకి రూ. 850 తగ్గి రూ. 38,800 వద్ద క్లోజయ్యింది.