Gold deposit
-
చైనాలో భారీ బంగారు నిక్షేపం.. ఇక ఇదే టాప్!
చైనాలో భారీ బంగారు నిక్షేపం బయటపడింది. సుమారు 1,000 మెట్రిక్ టన్నుల అత్యంత నాణ్యమైన ఖనిజం ఉన్నట్లు భావిస్తున్న ఈ బంగారు నిక్షేపాన్ని సెంట్రల్ చైనాలోని హునాన్ ప్రావిన్స్ ఈశాన్య ప్రాంతంలో ఉన్న పింగ్జియాంగ్ కౌంటీలో కనుగొన్నట్లు జియోలాజికల్ బ్యూరో ఆఫ్ హునాన్ ప్రావిన్స్ ధ్రవీకరించింది.చైనీస్ స్టేట్ మీడియా ప్రకారం.. ఈ నిక్షేపంలోని బంగారు అంచనా విలువ 600 బిలియన్ యువాన్లు. అంటే భారత కరెన్సీలో సుమారు రూ. 6,91,473 కోట్లు. ఇది దక్షిణాఫ్రికాలోని సౌత్ డీప్ మైన్‌లో లభించిన 930 మెట్రిక్ టన్నులను అధిగమించి ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు నిల్వగా ఉండవచ్చు.ఈ నిక్షేపం వెలికితీతకు మైనింగ్ కార్మికులు, యంత్రాంగం తీవ్రంగా కష్టపడ్డారు. ప్రాథమిక అన్వేషణలో 2 కిలోమీటర్ల లోతులో 300 మెట్రిక్ టన్నుల బంగారాన్ని కలిగి ఉన్న 40 బంగారు సొరంగాలు సిరలు బయటపడ్డాయి. అధునాతన 3డీ మోడలింగ్ టెక్నాలజీని వినియోగించి మరింత ఎక్కువ లోతుకు వెళ్లి నిక్షేపాన్ని కనుగొన్నట్లు అధికారులు తెలిపారు.మైనింగ్ టెక్నాలజీ ప్రకారం.. చైనాలో ఈ బంగారు నిక్షేపం బయటపడటానికి ముందు ప్రపంచంలోని అతిపెద్ద బంగారు నిక్షేపాలు ఇవే..1. సౌత్ డీప్ గోల్డ్ మైన్ - సౌత్ ఆఫ్రికా 2. గ్రాస్బర్గ్ గోల్డ్ మైన్ - ఇండోనేషియా 3. ఒలింపియాడా గోల్డ్ మైన్ - రష్యా 4. లిహిర్ గోల్డ్ మైన్ - పాపువా న్యూ గినియా 5. నోర్టే అబియర్టో గోల్డ్ మైన్ - చిలీ 6. కార్లిన్ ట్రెండ్ గోల్డ్ మైన్ - యూఎస్ఏ 7. బోడింగ్టన్ గోల్డ్ మైన్ - వెస్ట్రన్ ఆస్ట్రేలియా 8. ఎంపోనెంగ్ గోల్డ్ మైన్ - సౌత్ ఆఫ్రికా 9. ప్యూబ్లో వీజో గోల్డ్ మైన్ - డొమినికన్ రిపబ్లిక్ 10. కోర్టెజ్ గోల్డ్ మైన్ - యూఎస్ఏ -
గోల్డ్ డిపాజిట్ స్కీమ్ కింద 6.4 టన్నుల సేకరణ
గోల్డ్ డిపాజిట్ (మోనిటైజింగ్) స్కీమ్ కింద ప్రభుత్వం 6.4 టన్నుల పసిడిని సేకరించినట్లు లోక్‌సభలో ఆర్థికశాఖ సహాయమంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ ఒక లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. ఇళ్లు, దేవాలయాలు, సంస్థల్లో ఉపయోగించకుండా ఉన్న పసిడిని తిరిగి మార్కెట్లోకి తీసుకుని వచ్చి, వినియోగంలోకి తీసుకురావడం, దిగుమతులను తగ్గించడం లక్ష్యంగా కేంద్రం ఈ పథకాన్ని 2015 నవంబర్‌లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దీనికింద 2017 ఫిబ్రవరి 17 నాటికి 6,410 కేజీల పసిడిని సేకరించినట్లు మంత్రి వెల్లడించారు. ప్రస్తుత ధర ప్రకారం సేకరించిన బంగారం విలువ రూ.1,850 కోట్లు. 2015 నవంబర్లోనే ప్రకటించిన సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ ప్రకారం ఇప్పటివరూ ఏడు విడతల బాండ్స్ జారీ జరిగినట్లు మంత్రి తెలిపారు. ఢిల్లీ విమానాశ్రయంలో నకిలీ బంగారం... 2016 డిసెంబర్ 31వ తేదీ వరకూ గడచిన నాలుగేళ్లలో ఢిలీవిమానాశ్రమంలో పట్టుబడిన పసిడిలో 91 కేజీలు నకిలీదిగా గుర్తించినట్లు మరో ప్రశ్నకు సమాధానంగా ఆర్థికశాఖ సహాయమంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ తెలిపారు. ఢిల్లీ కస్టమ్స్ వాలెట్లో ఉంచిన 1,681.60 కేజీల్లో 91 కేజీలను కల్తీదిగా గుర్తించినట్లు వివరించారు. స్మార్ట్‌ఫోన్‌తో పన్ను చెల్లింపులు! స్మార్ట్‌ఫోన్ ద్వారా నిమిషాల్లోనే పాన్ నంబరు అందించే విధంగా ఆదాయ పన్ను శాఖ ప్రత్యేక మొబైల్ యాప్ తయారీపై కసరత్తు చేస్తోంది. అలాగే ఆన్లైన్లో సత్వరం పన్ను చెల్లింపులు, రిటర్నుల ట్రాకింగ్ మొదలైన సదుపాయాలకు ఒక యాప్‌ను అభివృద్ధి చేసింది. ఆర్థికశాఖ సహాయమంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ లోక్‌సభలో ఈ విషయాన్ని తెలిపారు. సీఎస్ఆర్ నిబంధనల ఉల్లంఘనలకు నోటీసులు కంపెనీల చట్టాల ప్రకారం కార్పొరేట్ సామాజిక బాధ్యతల (సీఎస్ఆర్) నిబంధనలను ఉల్లంఘించిన 1,018 కంపెనీలకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ తెలిపారు. మూడు సంవత్సరాల వార్షిక సగటు నికర లాభంలో కనీసం 2 శాతాన్ని లాభదాయక కంపెనీలు సీఎస్ఆర్ కార్యకలాపాలకు వినియోగించాల్సి ఉంటుంది. 2014 ఏప్రిల్ 1వ తేదీ నుంచీ సీఎస్ఆర్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ‘క్లీన్ మనీ’కి 8.38 లక్షల మంది జవాబు పెద్ద నోట్ల రద్దు అనంతరం అనుమానాస్పద డిపాజిట్ల పరిశోధన బాటలో చేపట్టిన ‘క్లీన్ మనీ’ పథకం కింద 18 లక్షల మందికి ఆదాయపు పన్ను శాఖ ఎస్ఎంఎస్/ఈ మెయిల్ ప్రశ్నలను పంపితే, వారిలో 8.38 లక్షల మంది సమాధానం పంపినట్లు మంత్రి గంగ్వార్ లోక్‌సభలో తెలిపారు. మిగిలిన వారిపై తగిన చర్యలకు ఆదాయపు పన్ను శాఖ సమాయత్తం అవుతున్నట్లు పేర్కొన్నారు. -
‘పసిడి డిపాజిట్’కు స్పందన కరువు
ఇప్పటిదాకా వచ్చిన డిపాజిట్లు 400 గ్రాములే బాండ్ల పథకంలో రూ. 145 కోట్ల పెట్టుబడులు న్యూఢిల్లీ: కేంద్రం ఇటీవల అట్టహాసంగా ప్రారంభించిన బంగారం డిపాజిట్ పథకానికి అంతంత మాత్రం స్పందనే కనిపిస్తోంది. దీని కింద ఇప్పటిదాకా 400 గ్రాముల మేర మాత్రమే పసిడి డిపాజిట్లు వచ్చాయి. వజ్రాభరణాల ఎగుమతి ప్రోత్సాహక మండలి జీజేఈపీసీ ఉత్తరాది రీజియన్ చైర్మన్ అనిల్ శంఖ్వాల్ ఈ విషయం తెలిపారు. ప్రస్తుతమున్న 13,000 మంది బీఐఎస్ సర్టిఫైడ్ జ్యుయలర్లందరూ కూడా పసిడి కలెక్షన్ ఏజెంట్లుగా వ్యవహరించేందుకు అనుమతులిస్తే ఈ ప్రయోగం విజయవంతం అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. పసిడి డిపాజిట్లు మరింత పెరిగేందుకు తీసుకోతగిన మరిన్ని చర్యల గురించి పరిశ్రమ ప్రతినిధులు గురువారం ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్‌తో సమావేశమయ్యారు. రిజర్వ్ బ్యాంక్, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్), ఎంఎంటీసీ, ఇతర ప్రైవేట్ బ్యాంకుల ప్రతినిధులు కూడా ఇందులో పాల్గొన్నారు. బంగారం టెస్టింగ్ సెంటర్లను మరింతగా పెంచడంపై చర్చించారు. బీఐఎస్‌లో నమోదు చేసుకున్న జ్యుయలర్లను పసిడి కలెక్షన్ ఏజెంట్లుగా వ్యవహరించేందుకు అనుమతించాలని ఈ సందర్భంగా తాము కోరినట్లు పీపీ జ్యుయలర్స్ సీఈవో రాహుల్ గుప్తా చెప్పారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3.5 లక్షల మంది ఆభరణాల వర్తకులు ఉండగా, వీరిలో 13,000 మందికి బీఐఎస్ సర్టిఫికేషన్ ఉందని ఆయన వివరించారు. ఈ సంస్థలకు టెస్టింగ్ అనుమతులు ఇచ్చేందుకు ఆర్థిక శాఖ సూత్రప్రాయంగా అంగీకరించిందని పేర్కొన్నారు. పసిడి డిపాజిట్ పథకమిదీ.. దేశీయంగా ప్రజల వద్ద దాదాపు రూ. 52 లక్షల కోట్ల విలువ చేసే 20,000 టన్నుల మేర పసిడి నిరుపయోగంగా ఉంటోందని అంచనా. ఈ బంగారాన్ని మార్కెట్లోకి రప్పించడం ద్వారా పసిడి దిగుమతుల భారాన్ని తగ్గించే దిశగా కేంద్రం ఈ నెల 5న పసిడి డిపాజిట్ పథకం ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీని కింద తమ వద్ద ఉన్న పసిడిని బ్యాంకుల్లో డిపాజిట్ చేసేవారికి వార్షికంగా 2.50 శాతం మేర వడ్డీ లభిస్తుంది. గోల్డ్ బాండ్స్ పథకం నేటితో ఆఖరు.. ఈ నెల 5న ప్రవేశపెట్టిన పసిడి బాండ్ల పథకం నేటితో(శుక్రవారం) ముగియనుంది. ఇప్పటిదాకా ఈ స్కీము కింద రూ. 145 కోట్ల మేర బాండ్ల కొనుగోళ్లు జరిగాయని, అంతిమంగా రూ. 150 కోట్ల లెక్క తేలవచ్చని ప్రభుత్వ రంగ బ్యాంకు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. నవంబరు 5న గోల్డ్ బాండ్స్ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. కనిష్టంగా 2 గ్రాముల నుంచి గరిష్టంగా 500 గ్రాముల దాకా పసిడి విలువను ప్రతిబింబించే బాండ్లను కొనుగోలుదారులు తీసుకోవచ్చు. గోల్డ్ బాండ్స్‌పై 2.75 శాతం వార్షిక వడ్డీ రేటు ఉంటుంది. -
పసిడి డిపాజిట్ స్కీమ్...
-
వృద్ధుల పొదుపును పరిరక్షిస్తాం..
చిన్న మొత్తాల వడ్డీ రేట్లపై కేంద్రం హామీ నవంబర్‌లో గోల్డ్ డిపాజిట్, బాండ్ పథకాలు న్యూఢిల్లీ: చిన్న పొదుపుదారుల వడ్డీ రేట్ల సమీక్ష సమయంలో ప్రత్యేకించి వృద్ధులు, బాలికల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంటామని ఆర్థికశాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ సోమవారం స్పష్టం చేశారు. చిన్న పొదుపు పథకాలకు సంబంధించి సామాజిక భద్రతా కోణం కీలకమైందని అన్నారు. ఈ అంశాన్ని కేంద్రం ఎప్పుడూ దృష్టిలో ఉంచుకుంటుందని పేర్కొన్నారు. ఇక్కడ జరిగిన ఒక మీడియా సమావేశంలో ఆర్థికశాఖకు చెందిన అత్యున్నత స్థాయి అధికారులు వివిధ అంశాలపై మాట్లాడారు. గోల్డ్ డిపాజిట్, బాండ్ పథకాలు నవంబర్ నుంచీ అమలవుతాయని కూడా ఈ సందర్భంగా దాస్ వెల్లడించారు. దేశంలో భౌతికంగా పసిడి డిమాండ్ తగ్గడానికి ఈ పథకాలు దోహదపడతాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ బడ్జెట్ ప్రతిపాదనలకు అనుగుణంగా అశోకచక్ర చిహ్నంతో పసిడి నాణేలను కూడా త్వరలో ప్రభుత్వం విడుదల చేస్తుందని తెలిపారు. అంతర్జాతీయంగా సవాళ్లు: అరవింద్ కాగా అంతర్జాతీయంగా దేశం పలు సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఏడాది ప్రారంభం కన్నా ఈ సవాళ్లు తీవ్రంగా ఉన్నాయన్నారు. ఆయా అంశాలను తట్టుకుని దేశం వేగంగా వృద్ధి బాటలో కొనసాగడానికి మరికొంత సమయం పడుతుందన్నారు. పన్ను వసూళ్లు తగ్గినా.. 7.5 శాతం వృద్ధి: రతన్ కాగా సమావేశంలో పాల్గొన్న ఫైనాన్స్ సెక్రటరీ రతన్ వతల్ మాట్లాడుతూ, దేశం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పన్ను వసూళ్ల లక్ష్యాన్ని సాధించలేకపోవచ్చని అభిప్రాయపడ్డారు. జీడీపీ వృద్ధి రేటు 7.5% దాటుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ పన్ను వసూళ్ల లక్ష్యం రూ.14.5 లక్షల కోట్లుకాగా, ఇది దాదాపు రూ.14 లక్షల కోట్లే ఉంటాయన్న అంచనాల నేపథ్యంలో ఫైనాన్స్ కార్యదర్శి తాజా ప్రకటన చేశారు. పన్ను వసూళ్ల లక్ష్యాలు నెరవేరకపోవడం నిర్దేశిత ద్రవ్యలోటుకు విఘాతం కలగజేయదని అన్నారు. పన్ను సంస్కరణలను కొనసాగించడానికి కేంద్రం కట్టుబడి ఉందని కూడా ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. సబ్సిడీ సంస్కరణలను ప్రస్తావిస్తూ... 2012-13లో ఈ వాటా జీడీపీలో 2.5 శాతం అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ శాతం 1.6 శాతానికి తగ్గుతున్నట్లు తెలిపారు. పొదుపు రేట్లపై ఇదీ సంగతి... రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణంపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపో-ప్రస్తుతం 6.75 శాతం) తగ్గించిన నేపథ్యంలో.. ఈ ప్రయోజనాన్ని ‘రుణ రేటు’ తగ్గింపు రూపంలో కస్టమర్లకు బదలాయించాల్సిన పరిస్థితి బ్యాంకింగ్‌కు ఉత్పన్నమయ్యింది. దీనితో మార్జిన్ల నిర్వహణలో భాగంగా డిపాజిట్ రేట్లనూ తప్పకుండా తగ్గించాల్సి ఉంటుంది. తాజా పరిస్థితుల్లో చిన్న పొదుపులు ఇచ్చే వడ్డీరేటు బ్యాంక్ డిపాజిట్లకన్నా అధికంగా ఉండే పరిస్థితి తలెత్తింది. దీనితో చిన్న పొదుపు మొత్తాలపై రుణ రేటు సైతం తగ్గించాలన్న డిమాండ్ బ్యాంకింగ్ నుంచి వస్తోంది. దీనిపై సమీక్ష జరుపుతామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ ప్రకటన నేపథ్యంలో వ్యక్తమవుతున్న ఆందోళనల నేపథ్యంలో ఆర్థిక కార్యదర్శి తాజా ప్రకటన చేశారు. బ్యాంకుల డిపాజిట్లపై వడ్డీరేట్లు 8.5 శాతం దాటని పరిస్థితి నెలకొంటే.. చిన్న పొదుపులపై రేటు 8.7 శాతం నుంచి 9.3 శాతం వరకూ ఉంటోంది. పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్, సీనియర్ సిటిజన్స్ స్కీమ్, పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్-సురక్షా సమృద్ధి అకౌంట్లు చిన్న పొదుపు పథకాల్లో ఉన్నాయి. భారత స్థూల దేశీయోత్పత్తితో పోల్చితే దేశీయ పొదుపు రేటు రికార్డు స్థాయి 36.8 శాతం. ఇప్పుడు ఈ రేటు 30 శాతానికి పడిపోయింది. పొదుపులపై వడ్డీరేటు తగ్గిస్తే.. మరింత ఈ మొత్తాలు పడిపోవడం ఖాయమన్న ఆందోళనలు ఉన్నాయి. నెయ్యి, వెన్నపై దిగుమతి సుంకం పెంపు నెయ్యి, వెన్నలపై దిగుమతి సుంకాలను ప్రస్తుత 30 శాతం నుంచి 40 శాతానికి పెంచినట్లు రెవెన్యూ కార్యదర్శి హాస్ముఖ్ ఆదియా తెలిపారు. అంతర్జాతీయంగా కమోడిటీ ధరలు తగ్గడం, ఈ పరిస్థితుల్లో దేశీయ మార్కెట్ ఎదుర్కొంటున్న ఇబ్బందుల పరిష్కారానికి కేంద్రం మరిన్ని చర్యలు తీసుకుంటుందని కూడా ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. తాజా నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని, ఆరు నెలలు అమలవుతుందని కూడా ఆయన అన్నారు. కాగా దేశీయ పరిశ్రమ కేంద్ర చర్యల ప్రయోజనాలను అందిపుచ్చుకునేలా వ్యవస్థను రూపొందించుకోవాలని ఆర్థికశాఖ అధికారులు సూచిస్తున్నారు. కాగా, నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్ చైర్మన్ టీ నంద కుమార్ ఒక ప్రకటన చేస్తూ... కేంద్రం నిర్ణయం హర్షణీయమని, దేశీయ పరిశ్రమకు ప్రయోజనమనీ అన్నారు. -
ఇక పసిడికీ వడ్డీ వస్తుంది..
- గోల్డ్ బాండ్, డిపాజిట్ పథకాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం - మెటల్‌కు దేశీయంగా డిమాండ్‌ను తగ్గించే ప్రయత్నం - బీరువాలకే పరిమితమవుతున్న కనకం మార్కెట్లోకి వచ్చే ఏర్పాటు న్యూఢిల్లీ: బంగారం బాండ్, పసిడి డిపాజిట్ (మోనిటైజేషన్) పథకాలకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది. మెటల్‌గా (ఫిజికల్ గోల్డ్) పసిడి డిమాండ్‌ను తగ్గించడానికి, ఇళ్లలో, సంస్థల్లో బీరువాలకే పరిమితమవుతున్న పసిడిని వ్యవస్థలోకి తీసుకువచ్చి, ఆర్జన సామర్థ్యం సమకూర్చడం, తద్వారా దేశ ఆర్థిక పటిష్టత ఈ నిర్ణయం ప్రధాన లక్ష్యాలు. కేబినెట్ సమావేశం అనంతరం ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఈ విషయాన్ని ప్రకటించారు. పసిడికి ప్రత్యామ్నాయంగా ఫైనాన్షియల్ అసెట్‌ను అభివృద్ధి చేయడానికి సావరిన్ గోల్డ్ బాండ్(ఎస్జీబీ) స్కీముని ప్రారంభించాలని ఈ ఏడాది బడ్జెట్ ప్రతిపాదించింది. ఇందుకనుగుణంగా తాజా పథకాలకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. పసిడి నిల్వల నిధి ఏర్పాటు... తాజా బంగారం పథకాల నేపథ్యంలో పసిడి ధరల్లో మార్పుల ఇబ్బందులను ఎదుర్కొనడానికి ఒక పసిడి నిల్వల నిధి ఏర్పాటు కానున్నట్లు కేబినెట్ సమావేశం అనంతరం వెలువడిన ఒక ప్రకటన తెలిపింది. ఈ పథకాల వల్ల వచ్చే లాభ, నష్టాలను ఈ ఫండ్ నిర్వహిస్తుంది. 2015-16 నుంచీ ప్రభుత్వ మార్కెట్ రుణ ప్రణాళికలో భాగంగా ఈ సావరిన్ గోల్డ్ బాండ్లు జారీ అవుతాయి. బాండ్ల ధర ఎలా ఉండాలన్న అంశాన్ని ఆర్థికమంత్రిత్వశాఖతో సంప్రదింపులతో ఆర్బీఐ నిర్ణయిస్తుంది. ప్రస్తుతం కడ్డీలు, నాణేల రూపంలో దాదాపు 300 టన్నుల పసిడి ఫిజికల్‌గా కొనుగోళ్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించి పెట్టుబడులలో కొంత బాండ్లలోకి వస్తాయని భావిస్తున్నారు. భారత ప్రభుత్వం తరఫున ఆర్బీఐ ఈ బాండ్లను జారీ చేస్తుంది. కనుక ఈ బాండ్లకు సావరిన్ (ప్రభుత్వ) గ్యారెంటీ ఉంటుంది. అందువల్ల బాండ్లు సావరిన్ రుణాల కిందకు వస్తాయి. తద్వారా 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచీ ద్రవ్య లోటు లక్ష్యం పరిధిలో ఇవి ఉంటాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.6 లక్షల కోట్లు ప్రభుత్వ రుణ ప్రణాళిక. ఇందులో దాదాపు రూ.3.6 లక్షల కోట్ల రుణ సమీకరణ సెప్టెంబర్ కల్లా పూర్తవుతుంది. గోల్డ్ బాండ్ స్కీమ్‌కు కూడా కేపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వర్తిస్తుంది. గోల్డ్ బాండ్, డిపాజిట్ స్కీమ్‌లను పరిశ్రమ సమాఖ్య స్వాగతించింది. గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ వల్ల పారదర్శకత పెరుగుతుందని, లక్షలాది కుటుంబాలు ప్రయోజనం పొందే అవకాశం ఉందని, గోల్డ్ సేవింగ్స్‌ను ఆర్థిక పెట్టుబడుల రూపంలోకి మరల్చే సామర్థ్యం దీనికి ఉందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇండియా మేనేజింగ్ డెరైక్టర్ సోమసుందరమ్ పీఆర్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం చర్య వల్ల బంగారం దిగుమతులు తగ్గుతాయని, పరిశ్రమ వృద్ధికి దోహదపడుతుందని ఆల్ ఇండియా జెమ్స్, జ్యువెల్లరీ ట్రేడ్ ఫెడరేషన్ మాజీ డెరైక్టర్ బచ్‌రాజ్ బమల్వా పేర్కొన్నారు. డిపాజిట్ స్కీమ్ ఇలా.. - ప్రజలు తమ వద్ద అదనంగా ఉన్న పసిడిని బ్యాంకుల్లో స్వల్ప (1-3 సంవత్సరాలు), మధ్య (5-7 సంవత్సరాలు), దీర్ఘకాలిక కాలాలకు (12-15 సంవత్సరాలు) డిపాజిట్ చేసుకోవచ్చు. - బంగారం రూపంలో వడ్డీని గుణించి, మెచ్యూరిటీ తరువాత నగదు రూపంలో అసలు, వడ్డీలను చెల్లిస్తారు. అంతర్జాతీయంగా కొన్ని దేశాల్లో పసిడి డిపాజిట్ విలువపై 0.75 శాతం నుంచి 2శాతం వరకూ వడ్డీ ఉంది. - స్వల్పకాలిక డిపాజిట్లపై వడ్డీరేటు ఆయా బ్యాంకులు నిర్ణయిస్తాయి. మధ్యకాలిక, దీర్ఘకాలిక డిపాజిట్లపై వడ్డీరేటు (బ్యాంకుల సేవలను ఫీజులు సహా) ఆర్బీఐతో సంప్రదించి కాలానుగుణంగా ప్రభుత్వం ప్రకటిస్తుంది. - దేశంలో అదనపు పసిడి దాదాపు 20,000 టన్నులు ఉంటుందని అంచనా. తాజా పథకం వల్ల దాదాపు రూ.5,40,000 కోట్లు బ్యాంకింగ్ వ్యవస్థలోకి వస్తాయని అంచనా. - స్థిర డిపాజిట్ల తరహాలోనే ఈ మూడు కాలాల పసిడి డిపాజిట్లకు లాక్-ఇన్-పీరియడ్ బ్రేకింగ్‌కు వీలుంటుంది. అయితే ముందస్తు ఉపసంహరణల విషయంలో (కొంతభాగం ఉపసంహరణ సహా) కొంత జరిమానా అమలవుతుంది. - వ్యక్తులు లేదా వ్యవస్థలు కనీసం 30 గ్రాములు డిపాజిట్ చేయాలి. డిపాజిట్‌కు సంబంధించి లభించే వడ్డీని ఆదాయపు పన్ను, కేపిటల్ గెయిన్స్ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఇచ్చే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. - ఇదేమీ బ్లాక్ మనీ వంటి అంశాలకు దారితీసే ప్రొడక్ట్ కాదు. సాధారణ పన్ను నిబంధనలు అన్నీ ఈ డిపాజిట్ స్కీమ్‌కూ వర్తిస్తాయి. - ధరలు పెరిగితే ఈ డిపాజిట్ వల్ల డిపాజిట్‌దారుకు ప్రయోజనం చేకూరుతుంది. అలాగే డిపాజిట్ చేసిన పసిడి విలువకు సంబంధించి వడ్డీ కూడా పొందవచ్చు. - డిపాజిట్ కాల వ్యవధి పూర్తయిన తరువాత, డిపాజిట్‌దారు అప్పటి పసిడి వాస్తవ విలువను పొందవచ్చు. స్వల్పకాలిక డిపాజిట్ అయితే ఫిజికల్ గోల్డ్‌ను పొందే వీలుంది. రెండు సందర్భాల్లో వడ్డీ లభిస్తుంది. డిపాజిట్ చేసిన పసిడి విలువ తగ్గితే... తగ్గిన విలువే లభిస్తుంది. అయితే వడ్డీ ఇక్కడ కస్టమర్‌కు కలిసి వచ్చే అంశం. - డిపాజిట్‌గా వచ్చిన పసిడిని వేలానికి, అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పసిడి నిల్వల భర్తీలకు వినియోగిస్తారు. అశోక్ చక్రతో కూడిన ఇండియన్ గోల్డ్ కాయిన్ తయారీలో సైతం దీనిని వినియోగిస్తారు. దిగుమతులు తగ్గించడం, దేశీయంగా సరఫరాల మెరుగు లక్ష్యంగా ఆభరణ వర్తకులకు కూడా ఈ పసిడిని అమ్మే వెసులబాటును బ్యాంకులకు కల్పిస్తారు. అయితే ఆయా సందర్భాల్లో నో-యువర్-కస్టమర్ నిబంధనలను బ్యాంకుల తప్పనిసరిగా పాటించాలి. - పసిడి డిపాజిట్ పథకం అమలు తేదీ తత్సబంధ అంశాలకు సంబంధించి త్వరలో నోటిఫికేషన్ వెలువడుతుంది. - డిపాజిట్ స్కీమ్ అమల్లో బ్యాంకులకు ప్రోత్సాహకాలు ఉంటాయి. గోల్డ్ బాండ్ల స్వరూపం... - గోల్డ్ బాండ్ పథకం వార్షిక గరిష్ట పరిమితి వ్యక్తికి 500 గ్రాములు. 5 నుంచి 7 సంవత్సరాల కాలపరిమితితో ఈ బాండ్ల జారీ జరుగుతుంది. ఈ స్కీమ్ ప్రకారం, పసిడిని ఫిజికల్‌గా కాకుండా, భారత పౌరులు గోల్డ్ బాండ్ల రూపంలో కొనుగోలు చేయవచ్చు. - 5, 10.50, 100 గ్రాముల చొప్పున ఈ గోల్డ్ బాండ్లు జారీ అవుతాయి. వాటి కాలవ్యవధి 5 నుంచి 7 ఏళ్లు వుంటుంది. దాంతో బంగారం ధరల మధ్యకాలిక ఒడిదుడుకుల నుంచి పెట్టుబడిదారుకు ఊరట లభిస్తుంది. - గోల్డ్ బాండ్ల విషయంలో వడ్డీ రేటు, మార్కెట్లో అప్పటి బంగారం ధర ప్రాతిపదికన ఉంటుంది. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీ, పోస్టాఫీసుల ద్వారా బాండ్లను మార్చుకుని, డబ్బు తిరిగి తీసుకునే వీలుంటుంది. - భారత పౌరులు, సంస్థలకు మాత్రమే ఈ బాండ్లను ఆఫర్ చేస్తారు. ఇన్వెస్టర్లు మెచ్యూరిటీ కంటే ముందస్తుగా వీటిని అమ్మేందుకు వీలుగా ఎక్స్ఛేంజీలపై ఈ బాండ్లు ట్రేడవుతాయి. -
‘బంగారం’ లాంటి పథకం..!
- పసిడి డిపాజిట్‌తో లాభాలు అధికమే - ఆభరణాలు పెడితే ప్రతికూలతలూ ఉన్నాయ్ ప్రజలు, సంస్థల దగ్గర ఉత్పాదకత లేకుండా పడి ఉన్న పసిడిని చలామణిలోకి తెచ్చేందుకు ప్రభుత్వం మరోసారి బంగారం డిపాజిట్ స్కీమ్‌ను ప్రకటించింది. 1999లో ఈ తరహా పథకాన్నే ప్రవేశపెట్టినప్పటికీ .. అప్పట్లో దీనికి అంతగా ఆదరణ దక్కలేదు. గోల్డ్ డిపాజిట్ చేసేవారికి పన్నులపరంగా ప్రయోజనాలు లభించేలా చూస్తామంటున్నప్పటికీ, గతానికి భిన్నంగా 1% కన్నా ఎక్కువ వడ్డీ రేటు ఇస్తే తప్ప ఇది వర్కవుట్ కాదంటున్నారు విశ్లేషకులు. ఈ వడ్డీ కూడా నగదు రూపంలో ఉంటుందా.. పసిడి రూపంలో ఉంటుందా అన్నది తేలాల్సి ఉంది. స్కీముపై ప్రస్తుతం ముసాయిదా మార్గదర్శకాలనే ప్రకటించింది ప్రభుత్వం. వీటిపై జూన్ 2 లోగా ప్రజలు, సంబంధిత వర్గాల అభిప్రాయాలను తెలుసుకుని ఆ తర్వాత తుది నిబంధనలను ఖరారు చేయనుంది. దీనివల్ల వచ్చే ప్రయోజనాలు, ఇందులోని ప్రతికూలతల్లో కొన్ని.. ప్రయోజనాలు.. - గతంలో కనీసం 500 గ్రాములు డిపాజిట్ చేయాల్సి ఉండేది. ఇప్పుడు కనిష్టంగా 30 గ్రాముల బంగారమైనా డిపాజిట్ చేయొచ్చు. - ఉత్తినే బ్యాంకు లాకర్లలోనో.. ఇంట్లో బీరువాల్లోనో ఉంచే బదులు డిపాజిట్ చేయడం వల్ల ఏడాదికి ఎంతో కొంత వడ్డీ రూపంలో ఆదాయం లభిస్తుంది. ఈలోగా బంగారం రేటు పెరి గితే ఆ ప్రయోజనం ఉండనే ఉంటుంది. - మీ బంగారం మీ అకౌంట్లోనే ఉంటుంది. అమ్మకుండానే వడ్డీ ఆదాయం వస్తుంది. పైగా దీనిపై పన్ను కూడా ఉండదు. - ఇలా వచ్చే ఆదాయాన్ని ఏ రికరింగ్ డిపాజిట్ స్కీమో లేదా ఏ పెన్షన్ స్కీములోనో ఇన్వెస్ట్ చేస్తే అదనంగా మరికాస్త ప్రయోజనమూ దక్కుతుంది. ప్రతికూలతలూ ఉంటాయ్ .. - మీరు ఆభరణాలు డిపాజిట్ చేస్తే బంగారం మీ అకౌంట్లోనే ఉంటుంది కానీ.. ఆభరణాల రూపంలో ఉండదు. వాటిని కరిగించేసి ఆ మేర పసిడి బరువును మాత్రమే మీ ఖాతాలో చూపిస్తుంది బ్యాంకు. దీనివల్ల బంగారంపై మీకు వడ్డీ ఆదాయం వచ్చినా.. ఆ ఆభరణాన్ని అలాగే మీరు వాడుకోలేరు. - డిపాజిట్ చేసిన బంగారం మొత్తాన్ని కాల వ్యవధి తీరాక విత్‌డ్రా చేసుకున్నాక.. మరోసారి అభరణాలు చేయించుకోవాలంటే ఆ మేర మేకింగ్ చార్జీలు వగైరాలు మళ్లీ తప్పకపోవచ్చు. రెండు వారాల లాభాలకు బ్రేక్... విదేశీ మార్కెట్లలో నెగటివ్ ధోరణుల కారణంగా ఇటు దేశీ బులియన్ మార్కెట్లోనూ పసిడి, వెండి రేట్లు గత వారం తగ్గాయి. పసిడి రెండు వారాల పరుగుకు బ్రేక్ పడింది. వారం ప్రారంభంలో కొనుగోళ్ల మద్దతుతో పుత్తడి రేట్లు పుంజుకున్నప్పటికీ .. వారాంతానికల్లా తగ్గాయి. సురక్షితమైన ఇన్వెస్ట్మెంట్ సాధనంగా అంతర్జాతీయంగా డాలర్‌కు డిమాండ్ పెరగడం, ఇటు దేశీయంగా జ్యుయెలర్లు, రిటైలర్ల నుంచి బంగారానికి డిమాండ్ తగ్గడం వంటివి పసిడి పరుగుకు బ్రేక్ వేసినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. పెరుగుతున్న ఈక్విటీ మార్కెట్ల వైపు నిధులు మళ్లడం కూడా పసిడిపై ప్రభావం చూపిందని తెలిపాయి. అంతర్జాతీయంగా చూస్తే వారంలో బంగారం ధర 1.7 శాతం క్షీణించింది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో వారాంతానికి పసిడి ధర 10 గ్రాములకు రూ.350 మేర తగ్గి, మేలిమి బంగారం రేటు రూ.27,450, ఆభరణాల బంగారం ధర రూ. 27,300 వద్ద ముగిసింది. అటు వెండి కూడా లాభనష్టాల్లో ఊగిసలాడి ఆఖరుకు కిలోకి రూ. 850 తగ్గి రూ. 38,800 వద్ద క్లోజయ్యింది.