వృద్ధుల పొదుపును పరిరక్షిస్తాం..
చిన్న మొత్తాల వడ్డీ రేట్లపై కేంద్రం హామీ
నవంబర్‌లో గోల్డ్ డిపాజిట్, బాండ్ పథకాలు
న్యూఢిల్లీ: చిన్న పొదుపుదారుల వడ్డీ రేట్ల సమీక్ష సమయంలో ప్రత్యేకించి వృద్ధులు, బాలికల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంటామని ఆర్థికశాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ సోమవారం స్పష్టం చేశారు. చిన్న పొదుపు పథకాలకు సంబంధించి సామాజిక భద్రతా కోణం కీలకమైందని అన్నారు. ఈ అంశాన్ని కేంద్రం ఎప్పుడూ దృష్టిలో ఉంచుకుంటుందని పేర్కొన్నారు. ఇక్కడ జరిగిన ఒక మీడియా సమావేశంలో ఆర్థికశాఖకు చెందిన అత్యున్నత స్థాయి అధికారులు వివిధ అంశాలపై మాట్లాడారు. గోల్డ్ డిపాజిట్, బాండ్ పథకాలు నవంబర్ నుంచీ అమలవుతాయని కూడా ఈ సందర్భంగా దాస్ వెల్లడించారు. దేశంలో భౌతికంగా పసిడి డిమాండ్ తగ్గడానికి ఈ పథకాలు దోహదపడతాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ బడ్జెట్ ప్రతిపాదనలకు అనుగుణంగా అశోకచక్ర చిహ్నంతో పసిడి నాణేలను కూడా త్వరలో ప్రభుత్వం విడుదల చేస్తుందని తెలిపారు.
అంతర్జాతీయంగా సవాళ్లు: అరవింద్
కాగా అంతర్జాతీయంగా దేశం పలు సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఏడాది ప్రారంభం కన్నా ఈ సవాళ్లు తీవ్రంగా ఉన్నాయన్నారు. ఆయా అంశాలను తట్టుకుని దేశం వేగంగా వృద్ధి బాటలో కొనసాగడానికి మరికొంత సమయం పడుతుందన్నారు. పన్ను వసూళ్లు తగ్గినా.. 7.5 శాతం వృద్ధి: రతన్
కాగా సమావేశంలో పాల్గొన్న ఫైనాన్స్ సెక్రటరీ రతన్ వతల్ మాట్లాడుతూ, దేశం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పన్ను వసూళ్ల లక్ష్యాన్ని సాధించలేకపోవచ్చని అభిప్రాయపడ్డారు. జీడీపీ వృద్ధి రేటు 7.5% దాటుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ పన్ను వసూళ్ల లక్ష్యం రూ.14.5 లక్షల కోట్లుకాగా, ఇది దాదాపు రూ.14 లక్షల కోట్లే ఉంటాయన్న అంచనాల నేపథ్యంలో ఫైనాన్స్ కార్యదర్శి తాజా ప్రకటన చేశారు. పన్ను వసూళ్ల లక్ష్యాలు నెరవేరకపోవడం నిర్దేశిత ద్రవ్యలోటుకు విఘాతం కలగజేయదని అన్నారు. పన్ను సంస్కరణలను కొనసాగించడానికి కేంద్రం కట్టుబడి ఉందని కూడా ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. సబ్సిడీ సంస్కరణలను ప్రస్తావిస్తూ... 2012-13లో ఈ వాటా జీడీపీలో 2.5 శాతం అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ శాతం 1.6 శాతానికి తగ్గుతున్నట్లు తెలిపారు.
పొదుపు రేట్లపై ఇదీ సంగతి...
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణంపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపో-ప్రస్తుతం 6.75 శాతం) తగ్గించిన నేపథ్యంలో.. ఈ ప్రయోజనాన్ని ‘రుణ రేటు’ తగ్గింపు రూపంలో కస్టమర్లకు బదలాయించాల్సిన పరిస్థితి బ్యాంకింగ్‌కు ఉత్పన్నమయ్యింది. దీనితో మార్జిన్ల నిర్వహణలో భాగంగా డిపాజిట్ రేట్లనూ తప్పకుండా తగ్గించాల్సి ఉంటుంది. తాజా పరిస్థితుల్లో చిన్న పొదుపులు ఇచ్చే వడ్డీరేటు బ్యాంక్ డిపాజిట్లకన్నా అధికంగా ఉండే పరిస్థితి తలెత్తింది. దీనితో చిన్న పొదుపు మొత్తాలపై రుణ రేటు సైతం తగ్గించాలన్న డిమాండ్ బ్యాంకింగ్ నుంచి వస్తోంది. దీనిపై సమీక్ష జరుపుతామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ ప్రకటన నేపథ్యంలో వ్యక్తమవుతున్న ఆందోళనల నేపథ్యంలో ఆర్థిక కార్యదర్శి తాజా ప్రకటన చేశారు. బ్యాంకుల డిపాజిట్లపై వడ్డీరేట్లు 8.5 శాతం దాటని పరిస్థితి నెలకొంటే.. చిన్న పొదుపులపై రేటు 8.7 శాతం నుంచి 9.3 శాతం వరకూ ఉంటోంది. పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్, సీనియర్ సిటిజన్స్ స్కీమ్, పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్-సురక్షా సమృద్ధి అకౌంట్లు చిన్న పొదుపు పథకాల్లో ఉన్నాయి. భారత స్థూల దేశీయోత్పత్తితో పోల్చితే దేశీయ పొదుపు రేటు రికార్డు స్థాయి 36.8 శాతం. ఇప్పుడు ఈ రేటు 30 శాతానికి పడిపోయింది. పొదుపులపై వడ్డీరేటు తగ్గిస్తే.. మరింత ఈ మొత్తాలు పడిపోవడం ఖాయమన్న ఆందోళనలు ఉన్నాయి.
నెయ్యి, వెన్నపై దిగుమతి సుంకం పెంపు
నెయ్యి, వెన్నలపై దిగుమతి సుంకాలను ప్రస్తుత 30 శాతం నుంచి 40 శాతానికి పెంచినట్లు రెవెన్యూ కార్యదర్శి హాస్‌ముఖ్ ఆదియా తెలిపారు. అంతర్జాతీయంగా కమోడిటీ ధరలు తగ్గడం, ఈ పరిస్థితుల్లో దేశీయ మార్కెట్ ఎదుర్కొంటున్న ఇబ్బందుల పరిష్కారానికి కేంద్రం మరిన్ని చర్యలు తీసుకుంటుందని కూడా ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. తాజా నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని, ఆరు నెలలు అమలవుతుందని కూడా ఆయన అన్నారు. కాగా దేశీయ పరిశ్రమ కేంద్ర చర్యల ప్రయోజనాలను అందిపుచ్చుకునేలా వ్యవస్థను రూపొందించుకోవాలని ఆర్థికశాఖ అధికారులు సూచిస్తున్నారు. కాగా, నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్ చైర్మన్ టీ నంద కుమార్ ఒక ప్రకటన చేస్తూ... కేంద్రం నిర్ణయం హర్షణీయమని, దేశీయ పరిశ్రమకు ప్రయోజనమనీ అన్నారు.