త్వరలో సముచిత స్థాయికి వడ్డీ రేట్లు
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ
న్యూఢిల్లీ: వడ్డీ రేట్లు నెమ్మదిగా సముచిత స్థాయికి చేరగలవని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. రుణాలపై ఏకంగా 14–15 శాతం వడ్డీ రేట్లు ఉంటే .. ప్రపంచ మార్కెట్‌లో భారత్ పోటీపడలేదని, పరిశ్రమ ఇంత భారీ వడ్డీ రేట్లతో పెట్టుబడులు పెట్టలేదని ఆయన పేర్కొన్నారు. రిజర్వ్ బ్యాంక్ కీలక పాలసీ రేట్లను పావు శాతం మేర తగ్గించి ఆరు శాతానికి చేర్చిన నేపథ్యంలో జైట్లీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బ్యాంకింగ్ నియంత్రణ (సవరణ) బిల్లు 2017పై లోక్‌సభలో చర్చ సందర్భంగా జైట్లీ ఈ విషయాలు తెలిపారు. స్థిర వడ్డీ రేటు ఆఫర్ చేస్తూ ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీ ప్రత్యేక పింఛను పథకం అందుబాటులోకి తెచ్చిందని ఆయన చెప్పారు.
పింఛను ఫండ్‌లు సురక్షితమైన పెట్టుబడి సాధనాలని తెలిపారు. బ్యాంకుల కన్నా కేవలం 1–1.5% వడ్డీ అదనంగా ఇచ్చే చిట్ ఫండ్ సంస్థల మోసాల్లో చిక్కుకోకుండా.. ఇన్వెస్టర్లకు స్థిరమైన వడ్డీ రేటు లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని జైట్లీ తెలిపారు. ఇక ఎస్‌బీఐ రూ. కోటి కన్నా తక్కువ బ్యాలెన్స్ ఉండే పొదుపు ఖాతాలపై వడ్డీ రేటును తగ్గించడాన్ని ఆయన సమర్ధించారు.
బ్యాంకు చర్యలకు ఆ చట్టమే అడ్డంకి: మొండిబాకీల పరిష్కారంపై బ్యాంకుల అధికారులు నిజాయితీగా నిర్ణయాలు తీసుకోవడానికి.. అవినీతి నిరోధక చట్టంలోని నిబంధనలే ప్రతిబంధకాలుగా ఉంటున్నాయని జైట్లీ తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల అధికారులు నిజాయితీగా సమస్యను పరిష్కరించాలనుకుంటున్నా.. తమ నిర్ణయాలపై తర్వాత రోజుల్లో విచారణ సంస్థల నుంచి ఎలాంటి ప్రశ్నలొస్తాయోనన్న ఆందోళన వారిని వెనక్కి లాగుతున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పేరుకుపోతున్న మొండిబాకీల సమస్య పరిష్కారానికి రాజకీయపార్టీలన్నీ ఏకం కావాలని జైట్లీ సూచించారు. ఉద్దేశపూర్వక ఎగవేతదారుల విషయంలో బ్యాంకులు కచ్చితంగా, కఠినంగా వ్యవహరిస్తాయని, మరిన్ని డిఫాల్టర్ల కేసులను దివాలా కోర్టుకు పంపాలని బ్యాంకులను ఆర్‌బీఐ ఆదేశించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.