మరింత వృద్ధిని సాధిస్తాం..
న్యూయార్క్: ఆర్థిక వృద్ధి జోరును పెంచడానికి భారత్ పలు కీలకమైన సంస్కరణలను అమల్లోకి తెస్తోందని, వ్యవస్థాగత మార్పులు చేస్తోందని అరుణ్ జైట్లీ చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో సాధించిన దానికంటే (7.6 శాతం) ఈ ఆర్థిక సంవత్సరంలో మరింత మెరుగైన వృద్ధిని సాధిస్తామన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. సీఐఐ, ఏషియా సొసైటీ పాలసీ ఇన్‌స్టిట్యూట్‌లు సోమవారం ఇక్కడ నిర్వహించిన మేక్ ఇన్ ఇండియా, ద న్యూ డీల్ పేరిట జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ప్రస్తుతం అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నాయని, భారత్ దీనికి అతీతం కాదని, అయినప్పటికీ భారత్ మంచి వృద్ధినే సాధిస్తోందని వివరించారు. రానున్న వారాల్లో దివాలా కోడ్ పార్లమెంటు ఆమోదం పొందగలదని, మొండిబకాయిల సమస్యకు సంబంధించి చట్ట రూపకల్పన కూడా తుది దశలో ఉందని చెప్పారు. వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) బిల్లు తుది దశలో ఉందని, .. ఇలా చేయగలిగింది చేస్తున్నామని చెప్పారు.
ప్రపంచ పరిస్థితులు ఆందోళనకరం
అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని భారత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. రెండేళ్ల దాకా ఇదే పరిస్థితులు కొనసాగుతాయని ఆయన అంచనా వేస్తున్నారు. ఆర్థిక మందగమనం నుంచి రక్షణ కోసం పలు దేశాలు రక్షణాత్మక చర్యలు తీసుకుంటున్నాయని, పరిమితి స్థాయిల్లో వృద్ది చెందేందుకు ప్రయత్నిస్తున్నాయని వివరించారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఒకటి, లేదా రెండు శాతం వృద్ధి సాధించినా మంచి వృద్ధిగానే పలు దేశాలు సంబరపడుతున్నాయని పేర్కొన్నారు. అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితుల ప్రభావం భారత్‌పైనా కూడా తీవ్రంగానే ఉందని, ముఖ్యంగా ఎగుమతులు బాగా ప్రభావితమయ్యాయని వివరిం చారు. కమోడిటీ ధరలు, ముడి చమురు ధరలు తక్కువగా ఉండడం వల్ల కొందరికి మోదం, మరికొందరికి ఖేదం కలుగుతోందని చెప్పారు.
ఇప్పుడు మరింత బలంగా...
విదేశాలతో వాణిజ్యం విషయమై గతంలో అనిశ్చితిగా ఉండే భారత వైఖరి ఇప్పుడు బాగా మారిందని పేర్కొన్నారు. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న భారత్ ఇతర దేశాలతో నిర్వహించే వాణిజ్య కార్యకలాపాలు మరింతగా పెరుగుతున్నాయని వివరించారు. 1990ల్లో ఉన్న భారత్‌కు, 2016లో ఉన్న భారత్‌లో అసలు పోలికే లేదని తెలిపారు.
వడ్డీరేట్లు దిగివస్తాయ్..
ప్రపంచమంతా ఆర్థిక మందగమనంతో అతలాకుతలమవుతుంటే మనం మాత్రం జోరుగా వృద్ధి సాధిస్తున్నామని జైట్లీ చెప్పారు. వర్షాలు బాగా కురిస్తే, సంస్కరణలు అమలైతే మరింత జోరుగా వృద్ధి సాధిస్తామని చెప్పారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ముగియనున్న ఆర్‌బీఐ గవర్నర రాజన్ పదవీకాలాన్ని పొడిగిస్తారా అన్న ప్రశ్నకు సమాధానాన్ని ఆయన దాటవేశారు. ఆర్‌బీఐ తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తోందని కితాబిచ్చారు. ద్రవ్యోల్బణం క్షీణత కొనసాగుతుందని, వడ్డీరేట్లు మరింతగా దిగివస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.