అధిక వృద్ధి సామర్థ్యం ఉంది..!
• ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ
• ఉపాధి కల్పన ప్రణాళికలు అమలు జరుగుతున్నాయని వెల్లడి
లండన్: భారత్‌కు అధిక ఆర్థికవృద్ధి సామర్థ్యం ఉందని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ సోమవారం ఇక్కడ పేర్కొన్నారు. దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఉపాధి కల్పన, పేదరిక నిర్మూళన ప్రణాళికలు అమలు జరుగుతున్నాయని అన్నారు. దేశం తక్షణం ‘నగదు రహిత’ వ్యవస్థగా మారబోతోందన్న వార్తల్లో నిజం లేదనీ స్పష్టం చేశారు. అయిదు రోజుల బ్రిటన్ పర్యటన నిమిత్తం శుక్రవారం ఇక్కడకు వచ్చిన జైట్లీ, ఈ పర్యటనలో భాగంగా విదేశీ ఇన్వెస్టర్లు, బ్రిటీష్ సంస్థల సీఈవోలతో భేటీ అవుతున్నారు. ఈ సందర్భంగా ఒక వార్తా సంస్థకు ఆయన ఇచ్చిన ఇంటర్వూ్యలో ముఖ్యాంశాలు...
⇔ పన్నుల ఎగవేత ధోరణిని అరికట్టాలన్నది నోట్ల రద్దు వెనుక ఉన్న పలు కారణాల్లో ఒకటి. అయితే నగదును తక్కువగా వినియోగించే వ్యవస్థను సృష్టించాలని నేను కోరుకుంటున్నాను. ప్రధాన వాణిజ్యాలు, ఆస్తి లావాదేవీలు, వేతన చెల్లింపులు, స్కూల్ ఫీజుల వంటివి నగదు రహితంగా ఉండాలన్నది మా ఉద్దేశం.
⇔ జూలై 1వ తేదీ నుంచీ వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) అమలు జరుగుతుందని భావిస్తున్నాం.
⇔ గత కాలం వ్యాపారాలకు వర్తించే విధంగా పన్నులు (రిట్రాస్పెక్టివ్ ట్యాక్సేషన్) వేయడం వంటి చర్యలను పునరుద్ధరించాలనుకోవడం లేదు. ప్రస్తుతం ఇలాంటి సమస్యను చర్చల ద్వారాకానీ లేదా న్యాయపరమైన చర్యల ద్వారాగానీ పరిష్కరించుకోవాలన్నది మా అభిప్రాయం.
⇔ బ్రిటన్‌తో భారత్ వాణిజ్య సంబంధాల విషయానికి వస్తే... బ్రెగ్జిట్‌ను రక్షణాత్మక వాణిజ్య విధానంగా పోల్చడం సరికాదని బ్రిటన్ ఆర్థికమంత్రి సంతృప్తికరమైన స్థాయిలో నాకు వివరించారు. ఇక వీసా సరళీకరణల అంశం బ్రిటన్ ప్రభుత్వ పాలసీపై ఆధారపడి ఉంటుంది.
లండన్ స్టాక్ ఎక్సే్ఛంజీలో ‘ట్రేడింగ్ గంట’
లండన్‌లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ లండన్ స్టాక్ ఎక్సే్ఛంజ్‌లో ట్రేడింగ్ ప్రారంభ గంటను మోగించారు. అనంతరం భారత్‌లో పెట్టుబడులకు సంబంధించి ఇన్వెస్టర్లతో చర్చలు జరిపారు. అంతర్జాతీయ వాణిజ్య వ్యవహారాల బ్రిటన్ మంత్రి లియామ్ ఫాక్స్‌సహా పలువురు సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.